ఆంగ్ల మాధ్యమంతో అనేక ప్రయోజనాలు

  •  అయినా.. మూడేళ్లపాటు తెలుగు ఉంటుంది
  •  త్వరలో డీఎస్సీ.. టీచర్‌ పోస్టుల భర్తీ: మంత్రి సురేశ్‌


ఒంగోలు(క్రైం), నవంబరు 10: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లబోధనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. ఒంగోలులో ఆయన క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఆంగ్ల మాధ్యమాన్ని ఒకేసారి పిల్లలపై రుద్దబోమని స్పష్టం చేశారు. పాఠశాలల్లో మూడేళ్లపాటు తెలుగు మాధ్యమంలో బోధనలు కొనసాగిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ ఇచ్చి నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. త్వరలో డీఎస్సీని ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొంత మంది కోర్టుకు వెళ్లడం వలన ప్రస్తుతం ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నామని, సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా స్కూళ్లను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ నెల 14న సీఎం జగన్‌ ఒంగోలులో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సిలబ్‌సను మారుస్తామని మంత్రి తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఆంగ్ల మాధ్యమంతో అనేక ప్రయోజనాలు"

Post a Comment