సమాచారం.. ఇక సులభతరం!

 ఒక్క క్లిక్‌తో వివరాలు ● పరీక్షల విభాగం ఆటోమేషన్‌

● ఎస్‌కేయూలో నేటి నుంచి ప్రక్రియ

ఎస్కేయూ పరీక్షల విభాగం

ఎస్కేయూ, న్యూస్‌టుడే: అడ్డదారికి అడ్డుకట్ట పడబోతోంది. వక్రమార్కుల ఆటలు ఇకపై చెల్లవు. విద్యార్థులు ధ్రువపత్రాల కోసం రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ల నాటి సమాచారం కూడా ఒక్క క్లిక్‌తో పొందవచ్ఛు ఈమేరకు ఎస్‌కేయూ సరికొత్త విధానానికి తెర తీసింది. ఎస్‌కేయూ 1981లో విశ్వవిద్యాలయంగా ఏర్పాటైంది. ఇక్కడ పదేళ్ల కిందటి సమాచారం కావాలంటే దస్త్రాలు వెతకడానికి నానాతంటాలు పడాల్సి వస్తోంది. ఈక్రమంలో వర్సిటీలోని పరీక్షల విభాగాలన్నీ ఆటోమేషన్‌ చేయడానికి సోమవారం నుంచి తొలి అడుగు పడనుంది


అవినీతికి అడ్డు

ఎస్‌కేయూ పరిధిలో 120 అనుబంధ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో 60 వేల మంది డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, న్యాయశాస్త్ర విద్య, బీఈడీ విద్యార్థులు ఉన్నారు. ఇక ఎస్కేయూకు సంబంధించి ఆర్ట్స్‌, సైన్సు, ఇంజినీరింగ్‌, ఔషధ, ఎడ్యుకేషన్‌ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 39 కోర్సులు, 29 విభాగాలు, ఆరువేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే కోర్సులు పూర్తి చేసిన లక్షలాది మంది విద్యార్థుల సమాచారం వెతకాలంటే ప్రతిబంధకంగా మారింది. పలు ధ్రువపత్రాల మంజూరులో కొందరు ఉద్యోగులపై ఆరోపణలు సైతం వచ్చాయి. ఈక్రమంలో ఆటోమేషన్‌ చేపడితే విద్యార్థుల సమాచారం సులభతరంగా అందుబాటులోకి రావడంతో పాటు అవినీతికి అడ్డుకట్ట పడుతుంది.

నాలుగు దశల్లో ప్రక్రియ

ఆటోమేషన్‌ ప్రక్రియ నాలుగు దశల్లో పూర్తి చేయాలని వర్సిటీ యోచిస్తోంది. మొదట మూడు నెలల పాటు చేపడతారు. 20 ఏళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఆటోమేషన్‌ చేస్తారు. మొదట విద్యార్థుల వివరాలన్నీ క్రోడీకరిస్తారు. అనంతరం పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తారు. మూడోదశలో పలు రకాల ధ్రువపత్రాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. నాలుగో దశలో విద్యార్థుల ఉపకార వేతనాలు, యూజీసీ, డీఎస్టీ, పలు జాతీయ సంస్థల నుంచి అందే ఫెలోషిప్స్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తారు. మొదటి సంవత్సరం ఉచితంగా చేపడతారు. రెండో సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సదరు సంస్ధకు వర్సిటీ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షల విభాగంలో ఈడీఈపీ విధానానికి గుంటూరుకు చెందిన ఓ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థకు ఇచ్చిన గడువు నవంబరులో ముగుస్తుంది. గడువు ముగిసే వరకు సదరు సంస్థతోనే పరీక్షల విధానానికి సంబంధించిన ప్రక్రియ చేస్తారు. దీనిపై రెక్టార్‌ రెడ్డివెంకటరాజు మాట్లాడుతూ ఇన్‌ఛార్జి, పూర్తి స్థాయి ఉపకులపతి వచ్చిన అనంతరం ఆటోమేషన్‌ ప్రారంభించాలని నిర్ణయించినా సత్వరమే చేపట్టాలని ఉన్నత విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో సోమవారం నుంచి ఆటోమేషన్‌ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

  • సమాచారం.. ఇక సులభతరం! ఒక్క క్లిక్‌తో వివరాలు ● పరీక్షల విభాగం ఆటోమేషన్‌● ఎస్‌కేయూలో నేటి నుంచి ప్రక్రియఎస్కేయూ పరీక్షల విభాగంఎస్కేయూ, న్యూస్‌టుడే: అడ్డదారిక… ...

0 Response to "సమాచారం.. ఇక సులభతరం!"

Post a Comment