ఇక ఇంగ్లిష్ మీడియమే
- సర్కారీ బడుల్లో ఒక సబ్జెక్టుగా మాత్రమే తెలుగు
అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన జరగాలన్న సర్కారు ఆదేశాల అమలుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ)’ ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. 2020-21లో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు, 2021-22 నుంచి తొమ్మిది, పది తరగతులకూ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఆంగ్ల మీడియంలో మాత్రమే బోధన జరిగేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. విద్యాశాఖపై గత నెల 11న జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇకపై అన్ని తరగతుల్లోనూ తెలుగు మాధ్యమం ఉండదు. తెలుగు ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ, జిల్లా మండల పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్.. తదితర అన్ని మేనేజ్‌మెంట్లలో కలిపి 43,200 పాఠశాలలున్నాయి. వీటిల్లో ఇప్పటికే 1,500 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుగుతోంది. గతేడాది రాష్ట్రంలోని 7 వేల ప్రాథమిక పాఠశాల(1-5 తరగతులు)ల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టారు
రాష్ట్రంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున దాదాపు 96 వేల మంది టీచర్లకు ఆంగ్ల బోధనలో శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉందని ఎస్‌సీఈఆర్‌టీ అంచనా వేసింది. తెలుగు మీడియంలో చదువుకుని, ఇప్పటి వరకు తెలుగు మీడియంలోనే బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ అనివార్యంగా భావిస్తోన్న విద్యాశాఖ .. ఆ మేరకు చర్యలు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఇంగ్లీషులో శిక్షణ ఇచ్చే సంస్థలను గుర్తించే పనిలో ఉంది. మైసూరులోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీషు(ఆర్‌ఐఈ), హైదరాబాద్‌లోని ఇఫ్లూ వంటి సంస్థల సహకారంతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించే దిశగా కసరత్తు చేస్తోంది. డిసెంబరు నుంచి ప్రారంభించి దశల వారీగా టీచర్లకు శిక్షణ ఇప్పించే దిశాగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక పాఠ్యపుస్తకాల విషయానికి వస్తే .. ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం పుస్తకాలు ఉన్నాయి. అయితే వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నందున ఇబ్బంది ఉండబోదని అధికారులు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో తరగతిలో సుమారు ఏడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఈ మేరకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేయడంలో ఇబ్బంది లేదని చెబుతున్నారు
0 Response to "ఇక ఇంగ్లిష్ మీడియమే"
Post a Comment