పసిపిల్లలకు పాస్, ఫెయిలా? వద్దే వద్దు
ప్రీ స్కూల్ చిన్నారులకు పాస్, ఫెయిల్ ముద్ర తగిలించడం సరికాదు: ఎన్‌సిఎఆర్‌టి
దిల్లీ: ప్రీ స్కూల్ స్థాయిలో ఉన్న చిన్నారులకు పరీక్షలు నిర్వహించడం సరికాదని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ కౌన్సిల్ (ఎన్.సి.ఇ.ఆర్.టి.) అభిప్రాయపడింది. ఆ ప్రాయంలో ఉన్న శిశువుకు రాతపూర్వక లేదా మౌఖిక పరీక్షల నిర్వహణ హానికర, అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తుందని దేశంలో పాఠ్యప్రణాళికా రచన సాధికారిక సంస్థ ఎన్.సి.ఇ.ఆర్.టి. తెలిపింది.
పిల్లలలో సృజనాత్మకత, శారీరక, మానసిక, భావోద్వేగాల అభివృద్ధికి గట్టి పునాదిగా నిలువవలసిన ప్రీ స్కూల్ విద్య ప్రస్తుతం నిస్తేజంగా, మూసధోరణిలో ఉంది
పిల్లలు పాత పద్ధతుల్లో, ఆంగ్ల మాధ్యమంలో విద్య నేర్చుకుంటున్నారు. ఆటలాడడం పిల్లల హక్కు. కానీ వారికి ఇంటిపని, పరీక్షలు అంటూ ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇదే సరయినదనే తప్పు అభిప్రాయంతో ఉండటం ప్రమాదకరం... అంటూ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
ఎన్.సి.ఇ.ఆర్.టి. నిర్దేశాల ప్రకారం, ప్రతి చిన్నారి పురోగతిని వివిధ పద్ధతుల్లో ఎప్పటికప్పుడు మదింపు వేయాలి. పిల్లలు పాఠశాల సమయాన్ని ఎక్కడ, ఎలా గడుపుతున్నారు, భాషను ఎలా వాడుతున్నారు, మిగిలిన పిల్లలతో ఎంతవరకు కలువగలుగుతున్నారు అనే విషయాలను, వారి అరోగ్యం, పోషకాహార అలవాట్లు వంటి అంశాలను టీచర్లు జాగ్రత్తగా పరిశీలించి సంక్షిప్త వ్యాఖ్యలతో రిపోర్టును తయారుచేయాలి.
పై వివరాలతో కూడిన ఫోల్డర్ తల్లిదండ్రులకు అందుబాటులో ఉండాలి. సంవత్సరానికి రెండుసార్లు పిల్లల వికాసానికి సంబంధించిన సారాంశంతో కూడిన రిపోర్టును కన్నవారికి అందజేయాలి. అంతేకానీ, ప్రీ స్కూల్ స్థాయి విద్యార్ధుల మూల్యాకనం పాస్ లేదా ఫెయిల్ అనే ముద్రవేయడానికి మాత్రమే పరిమితం కారాదని స్పష్టం చేసింది
0 Response to "పసిపిల్లలకు పాస్, ఫెయిలా? వద్దే వద్దు"
Post a Comment