వ్యక్తిగత ఆదాయపు పన్నుకూ ఊరట
ఐటీలోనూ వరాలు!
వేతనంపై సూపర్ రిచ్ సర్‌చార్జ్ ఎత్తివేత!
ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం
కార్పొరేట్ పన్ను తగ్గింపుతో ఊతం
తగ్గనున్న నిత్యావసర సరుకుల ధరలు?
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: కార్పొరేట్ పన్నును దాదాపు 8 నుంచి 10 శాతం మేర తగ్గించిన కేంద్రం ఇక మధ్యతరగతికి కూడా కాస్త ఊరట కల్పించాలని యోచిస్తోంది. వ్యక్తిగత ఆదాయపు పన్నులో కొన్ని రాయితీలు కల్పించే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. దీనిపై ఆర్థికశాఖ గతంలో నియమించిన ఓ టాస్క్‌ఫోర్స్ తన నివేదికను కిందటి నెలలోనే మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించింది. అమలుకు ముందు దీనిపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకొంటోంది. ప్రస్తుతం దీనిపై నిర్మల కొందరు ఆర్థిక నిపుణులతో మాట్లాడుతున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. కార్పొరేట్లకేనా వరాలు, సామాన్యులకు ఉండవా.. అని విమర్శలు వచ్చినందున సాధ్యమైనంత తొందర్లోనే దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. స్వదేశీ, విదేశీ ఇన్వెస్టర్ల (కంపెనీల) నుంచి వసూలు చేస్తున్న ‘సూపర్ రిచ్ సర్‌ఛార్’్జ ను నిర్మల శుక్రవారంనాటి ప్రకటనలో ఎత్తేశారు. కానీ‘‘ వేతనాలు, అద్దెలు, వృత్తిపరమైన ఆర్జన ద్వారా వ్యక్తిగతంగా రూ 2 కోట్ల పైబడి ఆదాయం ఉన్న సంపన్న శ్రేణిపై విధిస్తున్న సర్‌చార్జిని మాత్రం యథాతథంగా ఉంచారు. దీనిని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి నిర్మల దీనిపై నిర్ణయానికి వస్తారా లేదా అన్నది చూడాలి. ఇక పండగల సీజన్ వస్తున్న వేళ ... ప్రభుత్వం కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించడం వినియోగదారులకు భారీగా లాభించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా త్వరితగతిన విక్రయమయ్యే నిత్యావసరాలు, వినియోగ సరుకుల రంగానికి (ఎఫ్‌ఎంసీజీ) ఇది పెద్ద ఊతమిస్తుందని అంటున్నారు.
పన్ను తగ్గింపు వల్ల ధరవరలు తగ్గుతాయని, ఫలితంగా డిమాండ్ పెరుగుతుందని, ఇది వినియోగ వ్యయానికి దారితీసి ఆర్థిక వృద్ధికి దోహదకారి కాగలదని నిపుణులు అంటున్నారు. ‘‘ప్రజలు నిత్యం వాడే సరుకుల మీద జీఎస్టీ తగ్గితే సహజంగానే కొనుగోళ్లు పెరుగుతాయి’ అని ఓ నిపుణుడు పేర్కొన్నారు. బిస్కెట్లు, సబ్బులు, టీ, మొదలైన వాటి విక్రయాలు గత కొద్దినెలలుగా మందగతిలో ఉన్నాయి. బ్రిటానియా, కోల్గేట్, హిందూస్థాన్ యూనీలీవర్, ఐటీసీ, జీఎ్‌సకే లాంటి కంపెనీలు తమ లాభాల్లో 28-35 శాతం కార్పొరేట్ పన్నుగా చెల్లిస్తున్నాయి. ఈ పన్ను తగ్గుతుంది కాబట్టి ఆ లాభాన్ని వినియోగదారులకు మళ్లించవచ్చు, ధరలు తగ్గించవచ్చు అని విశ్లేషిస్తున్నారు. ‘‘మందగతిన ఉన్న ఆర్థికానికి ఇది పెద్ద ఊతం. ముఖ్యంగా తయారీ రంగంలో (మేన్యుఫేక్చరింగ్) ఇది మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తుంది. ఇన్వెస్టర్ల విశ్వాసం పెరుగుతుంది. దేశీయ పరిశ్రమ ఎదుగుతుంది. మేకిన్ ఇండియా పథకానికిది పెద్ద ప్రోత్సాహం’’ అని నిపుణులు వివరిస్తున్నారు.
తగ్గింపు సానుకూలమైనదే: మూడీస్
మందగమనంలో ఉన్న వృద్ధిని పరుగులు పెట్టించేందుకు గాను కార్పొరేట్ పన్ను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం సానుకూలమైనదేనని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. పన్ను తగ్గింపుతో ఆసియా దేశాల సరసన భారత్ చేరిందని, వ్యాపార వాతావరణం, పోటీతత్వం పెరగడానికి ఇది దోహదపడుతుందని వెల్లడించింది. కార్పొరేట్ పన్ను తగ్గింపు అనేది కంపెనీలకు క్రెడిట్ పాజిటివ్‌గా ఉంటుందని, దీని వల్ల కంపెనీలు పన్ను తర్వాత ఎక్కువ ఆదాయాలను కలిగి ఉండటానికి అవకాశం ఉందని పేర్కొంది
0 Response to "వ్యక్తిగత ఆదాయపు పన్నుకూ ఊరట"
Post a Comment