ప్రభుత్వ బడిలో.. పచ్చని తోటలు

నల్గొండ: చుట్టూ పచ్చని తోటలు, పూల మొక్కలు, విశాలమైన క్రీడా మైదానం ఎంతో ఆహ్లాదభరితంగా ఉండే పాఠశాల ఆవరణం. రుచికరమైన భోజనం, మెరుగైన విద్యాబోధన, అమ్మానాన్నల్లా చూసుకునే ఉపాధ్యాయులు, ఉత్తమ ఫలితాల సాధన ఈ వసతులన్నీ ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉండటమంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా.. ఇంతకీ అంతటి ఆహ్లాదాన్ని పంచుతున్న ఆ పాఠశాల గురించి తెలుసుకోవాలంటే మాత్రం నల్గొండ జిల్లా వెళ్లాల్సిందే మరి..




బడి ఆవరణలోనే కూరగాయలు సాగు చేస్తూ విద్యార్థులకు పోషక విలువలతో కూడిన రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. ఈ పాఠశాలలోకి అడుగు పెట్టగానే పచ్చని చెట్లు ప్రశాంత వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి


అన్ని రకాల మౌలిక వసతులు కలిగి ఈ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది.

ఎలా సాధ్యమైంది? 
15 ఏళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి ఆరు ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి సేకరించి పాఠశాలకి ఇచ్చారు. ఇందులో రెండు ఎకరాల్లో నిమ్మ, కొబ్బరి చెట్లను గత పది సంవత్సరాలుగా పెంచుతున్నారు. తోటను లీజుకు ఇవ్వడం వల్ల పాఠశాలకు ఆదాయం సమకూరుతుంది. మిగిలిన స్థలంలో కాకర, బీర, బెండ, దొండ, వంగ వంటి కూరగాయలు సాగు చేస్తున్నారు. వివిధ రకాల పూలు, పండ్లమొక్కలు పెంచుతున్నారు. ఉపాధ్యాయులే ప్రత్యేక శ్రద్ధ వహించి తోటలను, మొక్కలను సంరక్షిస్తున్నారు. మిగిలిన స్థలంలో విద్యార్థులకు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్థులు, స్థానిక నాయకుల సహకారం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని ఉపాధ్యాయులు తెలిపారు.

ఉత్తమ ఫలితాలు సాధిస్తూ.. 
రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి విద్యార్థులు. హాకీ, కోకో, కబడ్డీ వంటి క్రీడల్లో శిక్షణనిస్తూ ఉత్తమ క్రీడాకారులను తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాలలో మెరుగైన విద్యాబోధన ఉండటం వల్ల తాము ఎంతో నేర్చుకుంటున్నామని, ప్రశాంత వాతావరణంలో ఉల్లాసంగా ఆడుకుంటున్నామని, తమను ఉపాధ్యాయులు వారి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రభుత్వ బడిలో.. పచ్చని తోటలు"

Post a Comment