సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్

సచివాలయం అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. నోటిఫికేషన్‌లో తెలిపిన ఖాళీలకు తగినంత మంది పరీక్షల్లో ఎంపిక కాకపోతే.. అర్హత మార్కులను తగ్గించే అవకాశం ఉన్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. కొన్నిరోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది. 1.28 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.



ఏపీలో అక్టోబర్ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి రానుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించింది. లక్ష 26వేల 728 ఉద్యోగాలకు గానూ 21లక్షల 69వేల 814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు


19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల స్వీకరణకు 1902 కాల్‌ సెంటర్‌ నెంబర్ ని ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులకు ఏమైనా ఫిర్యాదులుంటే నేరుగా ఈ నెంబర్ కి ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు.

మరోవైపు ఏపీలో గ్రామ వాలంటీర్ పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామ వాలంటీర్ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తయి.. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్హులైన అభ్యర్థుల కొరత కారణంగా వివిధ జిల్లాల్లో ఎంపిక చేయలేకపోయారు. కొన్ని చోట్ల ఎంపికైనా అభ్యర్థులు ముందుకురాలేదు. దీంతో దాదాపు 18 వేల గ్రామ వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో మరోసారి జిల్లాలవారీగా మార్గదర్శకాలు రూపొందించి.. ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. అక్టోబరు 2 నుంచి అమల్లోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో లక్షా 26వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు నిరుద్యోగ యువత నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 21.69 లక్షల మంది అభ్యర్థులు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో పీజీ అర్హత ఉన్నవారే 42 శాతం ఉండటం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో డిగ్రీ అర్హత ఉన్నవారు 38 శాతం, ఇంజినీరింగ్ అర్హత ఉన్నవారు 20 శాతం ఉన్నారు. మొత్తం పోస్టులను మూడు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీల వారీగా సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు నియామక పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబరు 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో 6 రోజులపాటు పరీక్షలు జరిగాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్"

Post a Comment