సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు రెడీ
సెప్టెంబర్ 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లను ఇవ్వడంతోపాటు స్వచ్ఛాంధ్ర కింద మరో రూ.5 కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ నిధులను గ్రామ సచివాలయాల నిర్మాణంతో పాటు అంగన్‌వాడీల నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడమే సీఎం జగన్ ఉద్దేశమన్నారు.
ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి, అన్ని రకాల ప్రభుత్వ సేవలు వాటి ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లోనూ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో ఇప్పటికే నియమించిన గ్రామ వాలంటీర్లకు తోడుగా మరో 10మంది చొప్పున సిబ్బందిని నియమిస్తున్నారు. ఇందుకోసం ఇంటర్, డిగ్రీ, టెక్నికల్ విద్యార్హతలు కలిగిన మొత్తం లక్షా 26వేల 728 పోస్టులను భర్తీకి సెప్టెంబర్ మొదటివారంలో పరీక్షలు జరిగాయి.
మొత్తం 10 రకాల పోస్టులు వీటిలో ఉన్నాయి. ఈ పరీక్షలకు 19లక్షల 58వేల 582 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ విభాగాల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి వారిలో లక్షా 98వేల 164 మందిని ప్రభుత్వం అర్హులుగా ప్రకటించింది. కొన్ని పోస్టులకు ఉన్న ఖాళీల కంటే తక్కువ మంది అర్హత సాధించగా, మరికొన్ని పోస్టులకు గట్టి పోటీ ఏర్పడింది. ఎంపికైన వారికి రెండు రోజులపాటు శిక్షణ ఇస్తారు. అక్టోబర్ 2న విధుల్లోకి తీసుకుంటారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను 72 గంటల్లో అందిస్తారు. ప్రస్తుతం వార్డు సచివాలయాల్లో 10 సేవలను ప్రారంభిస్తామన్నారు. తర్వాత దశల వారీగా సేవల సంఖ్య పెంచుతారు. ఒక్కో వార్డు సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉంటారు. వారిలో పరిపాలన కార్యదర్శి 'స్పందన' కార్యక్రమంతో పాటు ఇతర సేవలను పర్యవేక్షిస్తారు
0 Response to "సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు రెడీ"
Post a Comment