ఆయన న్యాయశాస్త్రానికి కదిలే ఎన్‌సైక్లోపీడియా


న్యూదిల్లీ: ప్రముఖ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ(95) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన గతంలో కేంద్ర మంత్రిగా, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.ఎన్నో కీలక కేసులను ఈయన డీల్ చేశారు. అరుణ్‌ జైట్లీ-కేజ్రీవాల్‌ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌ తరఫున వాదించారు. సుప్రీంలో ఎన్నో వివాదాస్పద కేసులనూ ఈయన వాదించారు. వాజ్‌పేయీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. దేశంలో పేరెన్నిక గల న్యాయవాదుల్లో ఒకరైన జెఠ్మలానీ.. 1923 సెప్టెంబరు 14న ముంబయిలో జన్మించారు



ఈయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడు దశాబ్దాల పాటు ఆయన న్యాయవాద వృత్తిలో కొనసాగారు

రామ్‌జెఠ్మాలానీ జీవిత విశేషాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : 'వయస్సు అనేది మనం అనుకుంటేనే సమస్య.. పట్టించుకోకపోతే అది సమస్యకాదు' అని మార్క్‌ ట్వైన్‌ అన్న మాట భారత న్యాయ దిగ్గజం రామ్‌జెఠ్మాలనీకి అతికినట్లు సరిపోతుంది. భారత్‌లో ఆయన పేరు తెలియని వారు న్యాయశాఖ వర్గాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఆయన న్యాయశాస్త్రానికి కదిలే ఎన్‌సైక్లోపీడియా వంటి వారు. 95ఏళ్ల వయస్సులో కూడా ఐఎన్‌ఎస్‌ మ్యాక్స్‌ వంటి కీలక కేసులను ఆయన సుప్రీం కోర్టులో వాదించారు. మరో ఆరు రోజుల్లో 96వ వసంతంలోకి అడుగుపెట్టనున్న సమయంలో ఆయన కన్నుమూశారు. న్యాయకోవిదుడిగా


కేంద్ర మంత్రిగా దేశం కోసం ఆయన ఎంతో సేవ చేశారు.

ఆయన 1923లో బాంబే ప్రావిన్స్‌లోని సికార్పూర్‌లో జన్మించారు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు. స్కూల్‌లో ట్రిపుల్‌ ప్రమోషన్‌ సాధించడం విశేషం. 17 ఏళ్లకే లా డిగ్రీ అందుకొన్నారు. భారత్‌-పాక్‌ విడిపోయే వరకూ ఆయన కరాచీలో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేశారు. అప్పట్లో సింధ్‌ ప్రాంతంలోని లాయర్లలో ఆయనే అతిపిన్న వయస్కుడు. ఆయన్ను లాయర్‌గా ప్రాక్టిస్‌ చేసుకునేందుకు సింధ్‌ ప్రాంత న్యాయమూర్తి ప్రత్యేకంగా అనుమతి మంజూచేశారు. ఎందుకంటే అప్పట్లో లాయర్‌గా సాధన చేయాలంటే కనీసం 21ఏళ్ల వయస్సు ఉండాలి.

అండర్‌ వరల్డ్‌ డాన్‌ తరపున..

స్వాతంత్ర్యం వచ్చాక 1948లో ఆయన ముంబయికి వలసవచ్చారు. 1959లో కె.ఎం. నానావతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బాంబే కేసును ఆయనే వాదించారు. జ్యూరీ ట్రైల్‌ విధానంలో విచారించిన చివరి కేసు ఇదే. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి చెప్పింది. అప్పట్లో ఓ స్మగ్లింగ్‌ కేసులో అండర్‌ వరల్డ్‌ డాన్‌ హాజీ మస్తాన్‌ తరపున వాదించడంతో 'స్మగ్లర్ల లాయర్‌'గా పేరు తెచ్చుకొన్నారు. కానీ ఆ తర్వాత ఆయన ఎన్నో కీలకమైన కేసులను వాదించి దేశంలోనే ప్రముఖ లాయర్‌గా అవతరించారు. ఆ తర్వాత కూడా ఆయన ఎవరు వాదించడానికి కూడా సాహసించని కేసులను వాదించారు. ఇందిరాగాంధీ హంతకుల తరఫున, హర్షద్‌ మెహతా, కేతన్‌ ఫరేక్‌, అఫ్జల్‌ గురూ వంటి వారి తరఫున కోర్టులో వాదించారు. అలాగని ఆయన దేశంలో చట్టం గాడితప్పితే చూస్తూ కూర్చొనే రకం కాదు. ఆయనది రెబల్‌ మనస్తత్వం. అందుకనే ఆయన ఆటోబయోగ్రఫీ కూడా 'ది రెబల్' పేరుతో విడుదలైంది.



ప్రధానులతో ఢీ.. 
ఎమర్జెన్సీ సమయంలో ఆయన నాటి ప్రధాని ఇందిరా గాంధీని తీవ్రంగా విమర్శించారు. భాజపా తరఫున ముంబయి నుంచి 6,7వ లోక్‌సభలకు ఎన్నికయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన 2004లో లఖ్‌నవులో వాజ్‌పేయిపైనే పోటీకి దిగారు. 2013లో ఆయన్ను భాజపా నుంచి బహిష్కరించారు.

1987లో రాష్ట్రపతి పదవికి పోటీచేశారు. భారత్‌ ముక్తి మోర్చా పేరుతో ఒక రాజకీయ వేదికను స్థాపించారు. 1995లో పవిత్ర హిందూస్థాన్‌ కజగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. దేశంలో రాజ్యాంగం అమలులో పారదర్శకతను సాధించడమే ఈ పార్టీ లక్ష్యం. 
దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కోసం పరువు నష్టం కేసును వాదించినందకు రూ.1.5కోట్ల ఫీజు చెల్లించాలని కోరడం సంచలనం సృష్టించింది


SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "ఆయన న్యాయశాస్త్రానికి కదిలే ఎన్‌సైక్లోపీడియా"