విశ్వనాధ సత్యనారాయణగారి పుట్టినరోజు నేడు
విశ్వనాధ సత్యనారాయణగారి పుట్టినరోజు నేడు
SEPTEMBER 10th
..
విశ్వనాధ పుట్టిన రోజు ! తెలుగు భాషకు పండుగ రోజు
తెలుగులు ఏదో పుణ్యం చేసుకొని ఉంటారు!
అందుకే విశ్వనాధ తెలుగువాడిగా పుట్టాడు
.
విశ్వనాధ వారిగురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఎత్తైన ఎవరెస్టు శిఖరము.
ఆయన అనంత విజ్ఞాన ఖని.
విజ్ఞానాన్ని,విశ్లేషణను ఊహకు జోడించి అపూర్వమైన రచనా వ్యాసంగం చేశాడాయన.
.
కొందరంటారు ఆయన వ్రాసేవి మాకు అర్ధం కావు ! అని .
.
ఒక విషయం అడుగుతాను ,ఏ మాత్రం భాషా పరిజ్ఞానము లేని ఒక చిన్న శిశువు ఎలా మాటలను అర్ధం చేసుకుంటున్నది?
అంటే ఆ శిశువు నేర్చుకుంటున్నాడు అన్నమాట.
ఇప్పటి వరకు మనకున్న కొంచెం భాష అయినా నేర్చుకున్నదే కదా !
.
ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి నీ కొమ్మలకు బోలెడు పళ్ళున్నాయి నాకివ్వవేం?
అంతెత్తుకు పెరిగావేమిటి?
నేను ఎక్కడానికి వీలు లేకుండా ?
అని ప్రశ్నిస్తామా?
చెట్టు ఏదోవిధంగా ఎక్కడానికి ప్రయత్నిస్తాము ,మధురఫలాలను అంత ఎత్తున ఉన్నవి ప్రయత్నం చేత కోసుకు తిన్నప్పుడు కలిగే ఆనందం ఎంతో గొప్పది.
.
అలాగే విశ్వనాధ ఒక శిఖరం !
ఆ శిఖరం ప్రయత్నం చేసి ఒక్కసారి ఎక్కామా!
అంతకు ముందు చూడని ఊహాలోకాలు చూస్తాము!
.
అద్భుతమైన భాష,
అనితరసాధ్యమైన విశ్లేషణ
,అపురూపమైన ఊహ !
మొక్క వోని ఆత్మవిశ్వాసము !
ఇవి కలిస్తే విశ్వనాధ!
.
ఇద్దరు ప్రాణ స్నేహితుల విఫల ప్రేమగాధలు వారి వారి మనసులో సృష్టించిన అగాధాలు చెలరేగే భావతుఫానులు మన కళ్ళముందు సాక్షాత్కరింపచేస్తుంది "ఏకవీర".
.
ప్రేమను ఎవరు అర్ధం చేసుకోగలరు?
సమాజంలో మనము ఉంచుకున్న సూత్రాలు నిజంగా ప్రేమను నిర్వచించగలవా?
ఒకడిని చూసి తిరుగుబోతు అనుకుంటాము!
ఒకస్త్రీనిగురించి చాలా చులకనగా మాట్లాడతాము కానీ వారి హృదయపు లోతులలో ఏ అమృత ధారలు ప్రవహిస్తున్నాయో ఎవరికి తెలుసు?
" ప్రభూ నేను జారిణిని కాను,అతడు జారుడు కాడు మా ప్రేమకు మీ సూత్రములు పట్టవు మాది లింగజ్ఞానానికి అతీతమైన సంబంధము " అని అంటూ బాదమ్మ చనిపోతుంది !
ఇది ఎందుకో తెలవాలంటే
"బద్దన్న సేనాని" "చదవాల్సిందే!
.
రాజ్యమెట్టిదో ధాత్రి ఎట్టిదో స్త్రీ అట్టిది !
సేవించినకొలదీ ప్రసన్నయగును
ప్రేమించినకొలదీ సుఖధాత్రి యగును!
విరోధించినకొలదీ కలుషితురాలు అగును.
.
ఈ సృష్టిలో శరీరము ఒక్కటే దృశ్యమానము (కనబడేది!)
తక్కినవన్నియు అదృశ్యములే ( కనపడేవికావు) ప్రేమ,గౌరవము,అధికారము,వంశమర్యాద,కీర్తి ,అపకీర్తి,మంచితనము,చెడ్డతనము,మొదలయినవన్నీ కూడా మనము భావిస్తే ఉంటాయి లేకపోతే లేదు!.
ఎన్ని లోతైన విషయాలు ! ఎంత అద్భుతమైన చర్చ
"భ్రమరవాసిని " చదవండి తెలుస్తుంది.
.
"దంతపుదువ్వెన " అనే నవల వ్రాశారు ఆయన అందులో నరేంద్రుడు అనేవాడు తన పేరు "గూజా" అని మార్చుకుంటాడు.మార్చుకొని అది దేశీయమైన పేరు అంటాడు ! సంస్కృతము కాదు అని అంటాడు!
ఆ పేరు ఏ ధాతువునుండి పుట్టిందో చెప్పి అది సంస్కృత పదమే అని నిరూపిస్తారు.
ఇది మనకు పెద్ద చదువుకాదా!.
.
ఇక చెలియలి కట్ట నవల ,వివాహవ్యవస్థ ద్వారా సంక్రమించిన వాటిలో శృంగారము ఒక భాగము మాత్రమే అని చెపుతుంది.కేవల శృంగారమే పెళ్ళి కాదు.
.
వివాహము అంటే విశేషముగా వహించునది అని అర్ధము !
అంటే ఈ లోకమే గాక పరలోకమునకు కూడా సంబంధించినది అని అర్ధము.రెండు శరీరాలు కలుసుకొని పునరుత్పత్తి చేయడమే వివాహ లక్ష్యము కాదు అంతకు మించినది అని చెపుతారు విశ్వనాధ!
.
యోగిలాగ ఉన్న రైతును భోగిలాగ చేసినది నూతన
సమాజపు ధనతృష్ణ!
రాజులు రాణులు కేవలం మోతుబరి రైతుకుటుంబాలుగానో సంపన్నకుటుంబాలుగానో మారిన వైనం
పూర్వపు భావోన్మాదాలు,భావప్రేమలు మచ్చుకు కూడా కనపడకుండా పోవడం
భూమిమీద మనుషులకు దేవతలకు మధ్య ఉండే లంకె గణాచారి వ్యవస్థ ! అది నేడు పూర్తిగా తెగిపోయింది.
.
మా కాపులు మానేలను ఎంత పచ్చగా ఉంచారో ! నేడేమైనది అది అంతా ! అని అనిపిస్తుంది!
.
ఎక్కడ చూసినా వరి మాగాణులేనా ! వేరే ఇతర పంటలు అవసరములేదా?
ఏ నేలలో సహజంగా ఏ పంట పండుతుందో దానిని వృద్ధిచేయకుండా మొత్తము మాగాణులేనా!
.
ఈ రోజు ప్రతి పంటపొలము తూర్పుకృష్ణాలో చేపలచెరువుగా మారి పోయింది!
.
త్రాగే నీరుకలుషితం!
పీల్చే గాలి కలుషితం
భూమినిండా ప్లాస్టిక్ అవశేషాలే
పంచభూతాలను కలుషితం చేస్తే అవి ప్రకోపించకుండా ఉంటాయా!
.
ఎన్నో విశేషాలు వేయిపడగలు నవలలో!
.
ఎంతో వ్రాయవచ్చు ! నాబోటివాడికి ఒక జీవితకాలము సరిపోదు ! ఆయన ప్రతిభ వర్ణించాలంటే .
.
ప్రతి నవలలో ఏదో ఒక మానసిక విశ్లేషణ కనపడుతుంది .
ప్రతినవల ఒక పూల తోటే!
ఎన్నో భావపుష్పాలతో అందంగా విరబూసిన పూదోటే!
.
విశ్వనాధకు నమస్సుమాంజలి!
.
.
0 Response to "విశ్వనాధ సత్యనారాయణగారి పుట్టినరోజు నేడు"
Post a Comment