జీడీపీ ఒక్కటే కాదు..జీహెచ్‌పీ కూడా కావాలి

దిల్లీ: ప్రజల సుఖసంతోషాలకు విద్య ద్వారానే పునాదులు పడతాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అలాగే దేశాభివృద్ధికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఎంత 




అవసరమో విద్య కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా రాసిన 'శిక్షా' అనే పుస్తక ఆవిష్కరణ సభలో గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''ఈరోజు ప్రపంచం కేవలం జీడీపీ గురించి మాత్రమే ఆలోచించట్లేదు. వారికి ఇంకా ఏదో కావాలని ఆశిస్తున్నారు. 



జీడీపీ తరహాలోనే 'గ్రాస్‌ హ్యాపీనెస్‌ ప్రోడక్ట్‌'(జీహెచ్‌పీ) అనే కొత్త విధానం కూడా వచ్చింది. జీడీపీ ఎంత అవసరమో ప్రజలకు జీహెచ్‌పీ కూడా అంతే అవసరం.

చదువే జీహెచ్‌పీకి పునాది'' అని ప్రణబ్‌ వ్యాఖ్యానించారు. జీడీపీ తగ్గుముఖం పట్టడంపై దేశవ్యాప్తంగా విస్త్రృత చర్చ జరగుతున్న వేళ ప్రణబ్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ సందర్భంగా సిసోడియాపై ప్రణబ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. శిక్షా పుస్తకం కేవలం పరిశోధనకేగాక ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన స్వీయ అనుభవం, పరిశీలనతో ఈ పుస్తకాన్ని రచించారన్నారు. అనంతరం మాట్లాడిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఆప్‌ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం తీసుకున్న చర్యల ఆధారంగా సిసోడియా పుస్తకం రచించారన్నారు. విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం దిల్లీ ప్రభుత్వం ప్రణబ్‌ ముఖర్జీ నుంచి అనేక సలహాలు తీసుకుందని గుర్తుచేశారు. సిసోడియా మాట్లాడుతూ.. 'గూగుల్ టెక్స్ట్‌ టు స్పీచ్‌' టూల్‌ సాయంతో పుస్తకాన్ని పూర్తిచేశానని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జీడీపీ ఒక్కటే కాదు..జీహెచ్‌పీ కూడా కావాలి"

Post a Comment