16 నుంచి మంత్రుల కమిటీ జిల్లాల పర్యటన

 కలెక్టరేట్స్‌లో భూముల లభ్యతపై సమీక్షలు 
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో 
ఉగాదికి 25లక్షల మందికి ఇంటి స్థలాలు, గృహాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తును వేగం చేస్తోంది. ఇందులో భాగంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పిల్లి సుభాస్‌చంద్రబోస్‌ అధ్యక్షతన నియమించిన మంత్రుల కమిటీ జిల్లాల బాట పట్టనుంది. 



ఈనెల 16న తూర్పుగోదావరి, 17న పశ్చిమ గోదావరి, 19న విశాఖ, 20న విజయనగరం, 21న శ్రీకాకుళం, 24న కర్నూలు, 25న అనంతపురం, 26న కడప, 27న చిత్తూరు, 28న నెల్లూరు, అక్టోబరు1న ప్రకాశం, 3న కృష్ణ, 4న గుంటూరు జిల్లాల్లో మంత్రుల బృందం పర్యటిస్తుంది. ఈనెల 15వ తేదీకి వాలంటీర్లు ప్రాధమికంగా నివేదికను తయారు చేయనున్నారు

ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు తూర్పు, పశ్చిమ, కృష్ణ, గుంటూరు జిల్లాలతో పాటు అర్బన్‌ ప్రాంతాల్లో అవసరమైన మేర ప్రభుత్వ భూములు లేవని ప్రభుత్వం గుర్తించింది. ఆయా నగరాల్లో ప్రైవేటు భూముల కొనుగోలుకు ఎంత మేర నిధులు అవసరమవుతాయి? ఎంత భూమి కొనుగోలుకు ఆయా భూముల యజమానులు సిద్ధంగా ఉన్నారు? ఏయే ప్రాంతాల్లో ఇంటి స్థలాలకు భూములు లభ్యతను గుర్తించారనే విషయాలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించే సమీక్షా సమావేశాల్లో నిర్ణయించనున్నారు. 


జిల్లాల పర్యటనలు ముగిసిన అనంతరం మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. జిల్లాల పర్యటనలో గృహనిర్మాణశాఖ మంత్రి రంగనాధ్‌రాజు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాధ్‌రెడ్డి పాల్గొంటారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "16 నుంచి మంత్రుల కమిటీ జిల్లాల పర్యటన"

Post a Comment