సిలికాన్ నగరం
ఎంత ఆధునికమైనవైనా కొన్ని యూరప్ నగరాల్లో చారిత్రక నిర్మాణ నైపుణ్యం ఇంకా అక్కడి కట్టడాల్లో ఉట్టిపడుతుంది. ఎస్తోనియా రాజధాని ట్యాలిన్. ఈ నగరానికి మరో ప్రత్యేకత ఆనుకుని ఉన్న విస్తార తీర ప్రాంతం, అటవీ ప్రదేశం... మధ్యనుంచి ప్రవహించే నదులతో అరుదైన ప్రకృతి విశేషాన్ని కలిగి ఉందిది. ఇక్కడి ఒకప్పటి రహస్యదారులు, రాతి నిర్మాణాలు ఆశ్చర్యపరిస్తే... పరిశుభ్రమైన పరిసరాలతో ప్రపంచలోనే టాప్ టెన్ నగరాల్లో ఒకటనే జీవనప్రమాణం ఆకట్టుకుంటుంది. టెక్నాలజీలో అందరికంటే ముందున్న ఈ నగరాన్ని బాల్టిక్ సిలికాన్ సిటీ అని అంటారు.
- ఈ నగర ఆర్థికవ్యవస్థ ఐటీ, టూరిజం, లాజిస్టిక్స్ రంగాలపై ఆధారపడి ఉంది. తీరప్రాంత నగరం కావడంతో 14 వ శతాబ్దంలోనే ఇది వాణిజ్య కేంద్రంగా విస్తరించింది. ఓడరేవుతో పాటు ఐటి హబ్‌గా అభివృద్ధి చెందడంతో 'బాల్టిక్ సముద్ర తీరంలోని సిలికాన్ లోయ'గా 2005లో న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది.
- ట్యాలిన్‌లో అప్పర్, లోవర్ టౌన్‌లు ఉంటాయి. నగరానికి మధ్యలో టూంపీ అనే దీర్ఘచతురస్రాకారపు సున్నపురాతి పర్వతం ఉంటుంది. దీనిపై అప్పర్‌టౌన్‌లో ఉన్న మధ్యయుగకాలంనాటి గృహసముదాయాలు వాటిపై పెంకులతో నిర్మించిన పైకప్పులు అద్భుతంగా దర్శనమిస్తాయి. ఇక్కడ సోవియట్ పాలనలో నిర్మించిన అలెగ్జాండర్ నవోస్కీ కెథడ్రల్ నిర్మాణశైలి అద్భుతంగా ఉంటుంది. దీనిని మైఖేల్ ప్రిబ్రోజనిస్కీ డిజైన్ చేసి 'రష్యన్‌స్టైల్' ఆర్కిటెక్చర్‌లో నిర్మించారు. దీని మీది ఐదు ఆనియన్ డోమ్‌లు ఆకర్షణీయంగా ఉంటాయి.
- ట్యాలిన్‌లో 17వ శతాబ్దానికి చెందిన రహస్య సొరంగ మార్గాలు కనిపిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వీటిని బాంబులను భద్రపరిచేందుకు వినియోగించేవారట. 2010లో దాదాపు 380 సొరంగ మార్గాలను ప్రజల అవసరాల కోసం ఆధునీకరించారు.
- ట్యాలిన్‌లో ఓ ప్రత్యేకమైన సారాయిని తయారుచేస్తారు. దాల్చినచెక్క, సిట్రస్ సువాసనలతో గుబాళించే దీనిని ఆస్వాదించేందుకు స్థానికులు పోటీపడుతుంటారు.
- మధ్యయుగ ఆర్కిటెక్చర్‌లో నగరానికి మధ్యలో నిర్మించిన కోట 14వ శతాబ్దానికి చెందినది. ఇది 2.4 కిలోమీరట్ల పొడవు, 16 మీటర్ల ఎత్తు మూడు మీటర్ల వెడల్పులో 46 వాచ్ టవర్లు ఉంటాయి. దీని చుట్టూ నిర్మించిన కోట గోడ నిర్మాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ నగరం దెబ్బతిన్నప్పటికీ దాని సౌందర్యాన్ని కోల్పోలేదు. ఈ నిర్మాణం ఓల్ట్ టౌన్‌ను చారిత్రక అందాన్ని సంతరించుకుంది.
- పీటర్ ది గ్రేట్ రెండవ భార్య రష్యా యువరాణి క్యాథరిన్-1 కోసం నిర్మించిన ప్యాలెస్ కాడ్రియోర్గ్ ప్యాలెస్. ప్రస్తుతం దీన్ని ఆర్ట్ మ్యూజియంగా నిర్వహిస్తున్నారు. 16 నుంచి 20వ శతాబ్దం వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రదర్శన వస్తువులను సేకరించి దీనిలో ఉంచారు.
- టెక్నాలజీలో ప్రపంచంలోనే ముందున్న ఈ నగరంలో ఇంటర్‌నెట్ వినియోగం ఒక హక్కుగా పరిగణించబడుతోంది. యూరోపియన్ యూనియన్ ఐటీ ఏజెన్సీ హెడ్‌క్వార్డర్‌గా ట్యాలిన్ కొనసాగుతోంది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కోసం ఎన్‌ఎటిఒ సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కూడా ఇక్కడే ఉంది.
- 1422లో ఏర్పాటు చేసిన ఫార్మసీ నేటికీ అదే భవనంలో కొనసాగడం విశేషం. అదే టౌన్‌హాల్ స్క్వేర్‌లోని రారీప్‌టిక్ ఫార్మసీ.
- స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన పరిసరాలున్న ఈ నగరంలో గ్యాలరీలు, థియేటర్లు, ఫెస్టివల్ గ్రౌండ్, మార్కెట్లు, బీచ్‌లు, చారిత్రాత్మక నిర్మాణాలెన్నో..! మనసుకు ఆకట్టుకునే అందాలు ఈ నగరం సొంతం. అందుకే ఏటా 43 లక్షల మంది పర్యాటకులు ట్యాలిన్‌కు వస్తుంటారు
0 Response to "సిలికాన్ నగరం"
Post a Comment