మోదీ మదిలో...అధ్యక్ష పాలన

  

అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది.

- బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, భారత రాజ్యాంగ రూపకర్త




భారత్‌ కూడా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం దిశగా వెళుతోందా? ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ బాటలు పరుస్తున్నారా? అది అమెరికా తరహానా? మరో విధంగానా?

రామ్‌నాథ్‌ కోవిందే భారతదేశపు చివరి రాష్ట్రపతి కానున్నారా? 2022లోనే లోక్‌సభకు, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించి, మోదీ సర్వాధికారాలు కలిగిన దేశాధ్యక్షుడిగా, అమిత్‌షా ప్రధానిగా కొత్త బాధ్యతల్లోకి అడుగు పెడతారా?
దేశ అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చలివి!!

సిద్ధాంతకర్తల మొగ్గు అటే!

బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష వ్యవస్థ ఆవశ్యకతపై పలు వ్యాసాలు రచించారు. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ.. అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే తప్పులేదని ఆడ్వాణీ వాదించారు. రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు.

 

(న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి) : భారత ప్రజాస్వామ్యం దాదాపు పాతికేళ్లపాటు సంకీర్ణపు సంకెళ్లలో ఇరుక్కుపోయింది. పాలించిన పార్టీలేవైనా తమ ఆలోచనలకు చట్టరూపం కల్పించలేక పోయాయి. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఐదేళ్ల జీవితకాలం సరిపోయేది. దేశ ప్రగతికి స్వయంగా పార్లమెంటే అడ్డంకిగా నిలిచిన పరిస్థితులు ఎన్నోసార్లు తలెత్తాయి. దేశంలో ఏదో మూలన ఉండే చిన్నచిన్న పార్టీలుస్థానిక డిమాండ్ల పేరుతో, సిద్ధాంతాల పేరుతో ప్రభుత్వాలను బ్లాక్‌ మెయిల్‌ చేసి, కీలక నిర్ణయాలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేశాయి. ఇవన్నీ జనం ముందు ఏకరువు పెట్టడం ద్వారా, వాటన్నింటికీ పరిష్కారం తాను మాత్రమే చూపించగలనని భరోసా ఇవ్వడం ద్వారా 2014లో నరేంద్ర మోదీ దేశంలో తొలిసారిగా ‘అధ్యక్ష తరహా’ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మిత్రుల మద్దతు అవసరం లేకుండా తిరుగులేని మెజారిటీ సాధించారు. తాజాగా 2019లోనూ అధ్యక్ష తరహా ప్రచారమే చేపట్టి అంతకంటే భారీ విజయం సొంతం చేసుకున్నారు. కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఏర్పడిన పార్టీలకు స్థానిక కారణాలతో ఓటేసే ఎజెండాకు కాలం చెల్లేట్లు చేశారు. ఇదే పరిస్థితిని శాశ్వతం చేయాలంటే దేశంలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యమే శరణ్యమని ప్రధాని మోదీ, ఆయన్ను వెనకుండి నడిపిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ భావిస్తున్నట్టు సమాచారం. దేశ వ్యాప్తంగా 2022లో జమిలి ఎన్నికలను నిర్వహించాలనుకోవడం వెనుక కారణం కూడా ఇదేనని, దేశవ్యాప్తంగా పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి జరిపించి, ఆ తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం మోదీ ఎత్తుగడ అని ఈ వర్గాలు భావిస్తున్నాయి.

 

పార్లమెంట్‌ మొదటి సమావేశంలోనే 32 కీలక బిల్లులు ఆమోదించడం, జాతీయ భద్రత, పరిశోధన, సమాచార హక్కు, నదీజలాలు, ఆనకట్టలు, ట్రైబ్యునళ్లపై అధికారం చేజిక్కించుకోవడం.. కేంద్రీకృత ప్రజాస్వామ్యం దిశగా దేశాన్ని నడిపించాలన్న మోదీ సర్కారు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోందని కాంగ్రెస్‌ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది రాజ్యసభలో మెజారిటీ వస్తే మోదీ అధ్యక్ష తరహా పాలనకు వెనుకాడకపోవచ్చునని కాంగ్రెస్‌ వర్గాలు సైతం భావిస్తున్నాయి.

 

ప్రజాబలం లేనివారికి చెక్‌..

గత ఎన్నికలను మోదీ.. తనకు, రాహుల్‌ గాంధీకి మధ్య (అధ్యక్ష తరహా) పోరుగా మార్చేయడంలో విజయం సాధించడమే కాదు.. అమెరికా తరహాలో అధికారులను నేరుగా కేంద్రమంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఉదాహరణకు.. విదేశాంగ మంత్రిగా మోదీ తన కేబినెట్‌లోకి తీసుకున్న జైశంకర్‌ ఒక ఐఎ్‌ఫఎస్‌ అధికారి. పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్‌ పురి ఐఏఎస్‌ అధికారి కాగా.. రోడ్డు, రవాణా జాతీయ రహదారుల మంత్రిగా వ్యవహరిస్తున్న వీకే సింగ్‌ ఆర్మీ మాజీ చీఫ్‌. అంతే కాదు.. ప్రైవేట్‌ రంగానికి చెందిన వారిని జాయింట్‌ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీల హోదాలో నియమించారు. ఈ క్రమంలోనే.. పూర్తిగా అధ్యక్ష తరహా పాలన ప్రవేశపెడితే పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలను పరిహరించవచ్చని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజలకు నేరుగా తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం లభిస్తుందని, సంకీర్ణ ప్రభుత్వాలకు ఆస్కారం ఉండదని.. దేవెగౌడ, గుజ్రాల్‌ వంటి ప్రజాబలం లేని నేతలు ప్రధానులయ్యే అవకాశాలు ఉండవని ఆ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా అధ్యక్ష వ్యవస్థ వల్ల దేశంలో సుస్థిరత ఏర్పడుతుదని, కార్యనిర్వాహక వర్గం, చట్ట సభల అధికారాలు వేర్వేరుగా మారతాయని చెబుతున్నారు.

 

అధ్యక్షుడు నేరుగా ప్రజల ద్వారా ఎన్నిక కావడం వల్ల చట్టసభలో ఆయన పార్టీకి మెజారిటీ ఉన్నా లేకపోయినా ప్రభుత్వ సుస్థిరత దెబ్బతినదని వాదనలు వినిపిస్తున్నాయి. అఽధ్యక్ష వ్యవస్థ వల్ల అధ్యక్షుడికి తన టీమ్‌ ను తానే ఎన్నుకునేందుకు పూర్తి స్వేచ్చ ఉంటుందని, తద్వారా వివిధ రంగాలకు చెందిన నిపుణులు మంత్రివర్గంలో సమర్థవంతంగా దేశానికి సేవలందించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అధ్యక్ష వ్యవస్థలో స్వయంపాలనకు, అధికార వికేంద్రీకరణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. అమెరికాలో 80వేల స్వయంపాలక సంస్థలు ఉన్నాయని, పాఠశాలలు, అంబులెన్స్‌ సేవలు, శౌచాలయాలు ఇలా అన్నిటినీ స్థానిక వ్యవస్థలే నిర్వహించుకుంటాయని వారు గుర్తుచేస్తున్నారు.

 

అధ్యక్ష వ్యవస్థ వద్దన్న రాజ్యాంగ అసెంబ్లీ

మనదేశంలో అధ్యక్ష తరహా పాలన ఉండాలా లేక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా? అనే అంశంపై రాజ్యాంగ అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అయితే మెజారిటీ సభ్యులు పార్లమెంటరీ తరహా వ్యవస్థను సమర్థించారు. నిజానికి అప్పటికి భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి అలవాటుపడి ఉండటం కూడా ఆ నిర్ణయానికి దోహదం చేసింది. ఈ 70 ఏళ్లల్లో ఆవిష్కృతమైన కుళ్లు రాజకీయాలు, అరాచకత్వం, అవినీతి, అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యవస్థ మనకు సరిపోతుందా అనే సందేహం తలెత్తుతోందని.. దీనిపై చర్చించాల్సి ఉన్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

 

వాజపేయి హయాంలో.. ఆందోళన!

వాజపేయి హయాంలో రాజ్యాంగ సమీక్షకు జస్టిస్‌ వెంకటాచలయ్య కమిషన్‌ను నియమించినప్పుడు అధ్యక్ష వ్యవస్థ ప్రవేశపెడతారంటూ గందరగోళం చెలరేగింది. జస్టిస్‌ వెంకటాచలయ్య కమిషన్‌ కేవలం పార్లమెంటరీ వ్యవస్థను మెరుగుపరచడంపైనే నివేదిక సమర్పించింది.

 

ఏ తరహా అధ్యక్ష పాలన?

అధ్యక్ష పాలన అనగానే చాలామందికి గుర్తొచ్చేది.. అమెరికా తరహా పాలనే. అన్ని దేశాల అధ్యక్షుల అధికారాలూ ఒకలాగా ఉండవు. కొన్ని ప్రెసిడెన్షియల్‌ వ్యవస్థలు.. మరికొన్ని సెమీ-ప్రెసిడెన్షియల్‌ వ్యవస్థలు. ప్రెసిడెన్షియల్‌ వ్యవస్థకు ఉదాహరణ అమెరికా. ఈ వ్యవస్థ ఉన్న దేశాల్లో ప్రధానులు ఉండరు. ఇక.. సెమీ ప్రెసిడెన్షియల్‌ వ్యవస్థల్లో అధ్యక్షుడితోపాటు ప్రధాని కూడా ఉంటారు. సెమీ ప్రెసిడెన్షియల్‌ వ్యవస్థలో రెండు రకాలుంటాయి. ఒకటి.. ‘ప్రెసిడెంట్‌-పార్లమెంటరీ’ వ్యవస్థ. రష్యా, తైవాన్‌, పోర్చుగల్‌, సెనెగల్‌, నమీబియా, మొజాంబిక్‌ తదితర దేశాల్లో ఈ వ్యవస్థే అమల్లో ఉంది. రెండోది.. ‘ప్రీమియర్‌ ప్రెసిడెన్షియల్‌’ వ్యవస్థ. పోలాండ్‌, రోమేనియా, బుర్కినాఫాసో తదితర దేశాల్లో ఈ వ్యవస్థ అమల్లో ఉంది. మోదీ అధ్యక్షుడిగా ఉండి అమిత్‌షాను ప్రధానిగా చేస్తారనే ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఒకవేళ మనదేశంలో అధ్యక్షపాలన అంటూ ప్రవేశపెడితే అది సెమీ-ప్రెసిడెన్షియల్‌ వ్యవస్థే అయి ఉంటుందని రాజకీయ నిపుణుల విశ్లేషణ.

 

మహా దళపతి కూడా మోదీయేనా?

అమెరికా అధ్యక్షుడు.. ఆ దేశ త్రివిధ దళాలకు, అంటే సైన్యానికి, నౌకాదళానికి, వైమానిక దళానికి అధిపతిగా వ్యవహరిస్తారు. మోదీ ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో త్రివిధ దళాలకు ఒకే అధిపతి ఉంటారని ప్రకటించారు. దీనితో మోదీయే త్రివిధ దళాలకు అధిపతి అవుతారా, లేదా తాత్కాలికంగా ఎవరినైనా నియమిస్తారా అన్న చర్చ కూడా ప్రారంభమైంది.

ప్రాంతీయ పార్టీలకు అడ్డుకట్ట..

‘‘అధ్యక్ష పాలన ప్రవేశపెడితే అమెరికా అధ్యక్షుడి మాదిరి భారత అధ్యక్షుడు కూడా మంత్రులను, ఇతర ఉన్నతాధికారులను నియమిస్తారు. చట్టసభ ఆమోదించిన బిల్లులను తిరస్కరించే అధికారం కూడా ఆయనకు ఉటుంది. ఈ మొత్తం వ్యవస్థ వల్ల కార్యనిర్వాహక వర్గం విచ్చలవిడిగా తన అధికారాలను వినియోగించుకునే అవకాశం ఉండదు. భారత ప్రజాస్వామ్యం పార్లమెంటరీ వ్యవస్థలో కన్నా అధ్యక్ష వ్యవస్థలో బలోపేతం అవుతుంది’’ అని బీజేపీ వర్గాల వాదన. అంతేకాదు.. ఆ తరహా వ్యవస్థలో రెండు ప్రధాన పార్టీలకే ప్రాధాన్యత ఉంటుందని, ప్రాంతీయ పార్టీలకు అంత ప్రాబల్యం ఉండదని.. ఈ పద్ధతితో వాటికి కూడా చెక్‌ చెప్పొచ్చని వారు చెబుతున్నారు.

 

అధ్యక్ష తరహా అంత డేంజరా?

అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంతో నియంతృత్వం ఏర్పడే ప్రమాదం ఉందని అపోహలున్నాయి. అమెరికా 230 ఏళ్ల అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క అధ్యక్షుడూ నియంతలాగా వ్యవహరించలేకపోయారు. డెబ్బయ్యేళ్ల భారత ప్రజాస్వామ్య చరిత్రలో కనీసం ఇద్దరు ప్రధానులు నియంతృత్వంగా పాలించారు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని ఏక వ్యక్తి నియంత్రిస్తారనుకోవడం అపోహే. భారత ప్రజాస్వామ్యంలో ప్రధానులు రాష్ట్రాల మీద సవారీ చేస్తారు. అమెరికాలో అధ్యక్షులు రాష్ట్రాల్లో వేలు కూడా పెట్టలేరు. చట్టసభల్లో చట్టాలు చేయించలేరు. బడ్జెట్‌ ఆమోదం పొందలేరు. దర్యాప్తు సంస్థలను వ్యక్తుల మీద ఉసిగొల్పలేరు. చట్టసభ అనుమతి లేకుండా కనీసం మంత్రివర్గాన్ని కూడా ఎంపిక చేసుకోలేరు.

కాంగ్రె్‌సలోనూ మద్దతుదారులు

అధ్యక్ష తరహా పాలనపై కాంగ్రెస్‌ పార్టీలో కూడా పెద్దగా వ్యతిరేకత ఏమీలేదని.. ఆ పార్టీలోనూ దీనికి మద్దతుదారులున్నారని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి వసంత్‌ సాథే అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా పార్లమెంటరీ వ్యవస్థను పునఃపరిశీలించాలని, భారత దేశానికి అధ్యక్ష తరహా వ్యవస్థే మంచిదని సూచించారు. పార్లమెంటరీ వ్యవస్థకు కాలం చెల్లిపోయిందని.. దేశంలోని అన్ని రాజకీయ రుగ్మతలకూ పార్లమెంటరీ వ్యవస్థే కారణమని థరూర్‌ ఒక వ్యాసంలో రాశారు. అమెరికాలో మాదిరి జాతీయ స్థాయిలో అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయిలో గవర్నర్‌ నేరుగా ఎన్నిక కావాలని ఆయన అభిప్రాయపడ్డారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మోదీ మదిలో...అధ్యక్ష పాలన"

Post a Comment