పదవులన్నీ ఒక్కరికే!
- ఇంటర్ బోర్డులో గాడితప్పిన పాలన..
- పరీక్షల కంట్రోలర్‌కు మరో 4 కీలక బాధ్యతలు
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఇంటర్ బోర్డులో పాలన గాడితప్పింది. ఒకే అధికారికి ఐదు కీలక బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. బోర్డులో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్(సీఓఈ) పదవి ఎంతో కీలకమైనది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆయనే పర్యవేక్షిస్తారు. అయితే సీఓఈగా వ్యవహరిస్తున్న ఓ అధికారికి అదనంగా అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ (ఎగ్జామ్స్-1), జాయింట్ సెక్రటరీ(అకడమిక్), జాయింట్ సెక్రటరీ(అడ్మినిస్ట్రేషన్) బాధ్యతలు కూడా అప్పగించారు. మొత్తం ఐదు పదవులు ఒక్కరికే కేటాయించడం ద్వారా ఏకపక్ష నిర్ణయాలకు తెరతీశారు. ఎంతో పనిఒత్తిడి ఉండే సీఓఈకి మరిన్ని పదవులు అప్పగించడంలో మాజీ కార్యదర్శి ఒకరు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి.
ఈ విషయంలో బోర్డు నియమ, నిబంధనలు పాటించలేదని విమర్శలొచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లలో సీనియర్లను పక్కనబెట్టి మరీ ఆయనకు కీలక పదవులు అప్పగించారని చెబుతున్నారు. విజయవాడలోని బోర్డు కార్యాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు వస్తుంటారు. ఇక్కడకు వచ్చేవారిని పట్టించుకునే
నాథుడే కరువయ్యాడు. రాష్ట్రంలో 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సహా మొత్తం 3,193 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. ఆయా కాలేజీలకు సంబంధించి అదనపు సెక్షన్లు, సీట్ల పెంపు, షిఫ్టింగ్, యాజమాన్యాల మార్పు తదితర పనుల కోసం నిత్యం పలు కాలేజీల నిర్వాహకులు ఇంటర్ బోర్డుకు వస్తుంటారు. కానీ ఇలా వచ్చేవారికి అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి.
అధికారాలన్నీ ఒక్కరి వద్దే కేంద్రీకృతం కావడంతో ఏ పని కావాలన్నా సీఓఈ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆయన ఆఫీసులో లేరనో, ఇంటర్మీడియెట్ విద్యా కమిషనరేట్‌కు వెళ్లారనో, సచివాలయంలో మీటింగ్‌కు వెళ్లారనో చెప్పి పంపడం సాధారణంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఇంటర్ విద్యా కమిషనరేట్‌ను గుంటూరులో, ఇంటర్‌బోర్డును విజయవాడలో ఏర్పాటు చేశారు. కమిషనర్‌గా, కార్యదర్శిగా ఒకే అధికారి ఉండటంతో
రెగ్యులర్‌గా కార్యాలయాలకు వచ్చే పరిస్థితి లేదు. వారానికి ఒకటి, రెండుసార్లు ఇంటర్ బోర్డుకు సెక్రటరీ రావడం, ముఖ్యమైన పైళ్లు చూడటం రొటీన్‌గా మారింది. పదోన్నతులపై పదవుల అప్పగింతలో బోర్డు ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని, సింహభాగం పోస్టులు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకే కట్టబెడుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. లెక్చరర్లకు ఇవ్వాల్సిన పోస్టులను ప్రిన్సిపాళ్లకు అప్పగిస్తున్నారని చెబుతున్నారు
0 Response to "పదవులన్నీ ఒక్కరికే!"
Post a Comment