తెల్లరేషన్‌ కార్డుదారులకు ఈకేవైసీ నమోదు తప్పనిసరి

*తెల్లరేషన్‌ కార్డుదారులకు ఈకేవైసీ నమోదు తప్పనిసరి*

  తెల్లకార్డుదారులు వారి కుటుంబ సభ్యుల ఈకేవైసీ(ఎలక్ట్రానికల్‌ నో యువర్‌ కస్టమర్‌) వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా సంయుక్త పాలనాధికారి మార్కండేయులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6,56,110 మంది (రేషన్‌ కార్డులోని సభ్యులు)ఈకేవైసీ నమోదు చేసుకోలేదని, ఇందులో చిత్తూరు డివిజన్‌లో 1,76,107 మంది, తిరుపతి డివిజన్‌లో 1,60,565, మదనపల్లె డివిజన్‌లో 3,21,250 మంది ఉన్నారన్నారు. ఈకేవైసీలో నమోదు కాని కుటుంబ సభ్యుల వివరాలను డీలర్లకు అందజేశామమని చెప్పారు. ఈ నెల 18వ తేదీలోగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలన్నారు. నమోదు వేగవంతానికి చౌక దుకాణాల డీలర్లు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించామని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలన్నారు. ఈకేవైసీ నమోదు పెండింగ్‌లో ఎక్కువగా విద్యార్థులున్నారని, ప్రస్తుతం వరుసగా మూడు రోజులు సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఇళ్ల వద్దే ఉంటారని, డీలర్లు ప్రత్యేక చొరవతో విద్యార్థులతో ఈకేవైసీ నమోదు చేయించాలని పేర్కొన్నారు. ఈకేవైసీ నమోదు కాని కార్డుదారులకు సెప్టెంబరు నెల రేషన్‌ నిలుపుదల చేస్తారని ఆయన తెలిపారు.
అనర్హులకు ఆగస్టు నెల రేషన్‌ నిలిపివేత
ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ తెల్ల రేషన్‌ కార్డు పొందిన వారికి ప్రభుత్వం ఆగస్టులో రేషన్‌ నిలుపుదల చేసిందని జేసీ తెలిపారు. పలు ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ రేషన్‌ పొందుతున్న కార్డులను ప్రభుత్వమే ఇన్‌ఆక్టివ్‌ చేసిందని చెప్పారు. ఇన్‌ఆక్టివ్‌ కార్డుల్లో అర్హులైన కార్డులు ఆక్టివ్‌లోకి వచ్చాయని వారు సరకులు పొందవచ్చునన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో లేని వారు కూడా ఉద్యోగులుగా ప్రజాసాధికార సర్వేలో నమోదైతే అలాంటి వారు తక్షణమే ప్రజా సాధికార సర్వే ద్వారా సవరించుకోవాలని సూచించారు.
సాధికార సర్వే చేసుకుంటేనే.. కొత్త రేషన్‌ కార్డు
కొత్త రేషన్‌ కార్డులు కావాల్సిన వారు విధిగా ప్రజా సాధికార సర్వే చేసుకోవాలని జేసీ తెలిపారు. స్ల్పిట్‌ కార్డు(కుటుంబ విభజన కార్డు)దారులు తల్లిదండ్రుల కుటుంబం నుంచి స్పిట్‌ ఫ్యామిలీ అనే ఆప్షన్‌ ద్వారా ప్రజా సాధికార సర్వే నందు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం కొత్త కార్డు జారీకి తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తుతో పాటు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ను సమర్పించాలని లేదా ప్రతి సోమవారం నిర్వహించే 'స్పందన' కార్యక్రమంలో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వందశాతం ఈకేవైసీ, ప్రజా సాధికార సర్వే నమోదుకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు, డీలర్లు కృషి చేయాలని ఆయన తెలిపారు.



*🌴🦢🦢🦢🦢🦢🦢🦢🌴*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "తెల్లరేషన్‌ కార్డుదారులకు ఈకేవైసీ నమోదు తప్పనిసరి"

Post a Comment