ఒకే రోజు 17 ఖాళీ జీవోలు!

* రెండు కాన్ఫిడెన్షియల్‌ కూడా 
* రెవెన్యూ శాఖ జారీ
 
* అన్నీ విజిలెన్స్‌ దర్యాప్తుకు సంబంధించినవే 
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి:
అధికారంలోకొచ్చిన తొలి నాళ్ల నుంచే రహస్య (కాన్ఫిడెన్షియల్‌) ఉత్తర్వులివ్వడం మొదలు పెట్టిన వైసిపి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి 'ఖాళీ' ఉత్వర్వులిస్తోంది. గురువారం రెవెన్యూ శాఖ నుంచి విడుదలైన జీవోల్లో పదిహేడింని ఎలాంటి సమాచారం లేకుండా 



ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. మరో రెండు జీవోలకు కాన్ఫిడెన్షియల్‌ అని పేర్కొని ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పటికే వైసిపి సర్కారు వచ్చాక అత్యధిక రహస్య జీవోలను జారీ చేసిన రెవెన్యూ శాఖ ఒక్క రోజునే 'ఖాళీ', కాన్ఫిడెన్షియల్‌ రెండూ కలిపి 19 ఉత్తర్వులు జారీ చేసి అనుమానాలకు కేంద్ర బిందువైంది

అవన్నీ విజిలెన్స్‌్‌ విచారణకు సంబంధించినవే కావడం విశేషం. రెవెన్యూశాఖ గురువారం మొత్తం 23 జీవోలు విడుదల చేయగా వాటిలో 19 జీవోలకు సమాచారం ఇవ్వలేదు. వీటన్నింటినీ 'ఇతర' (అదర్స్‌) కేటగిరీగా పేర్కొంది. అయితే రెండు జీవోలకు మాత్రం కాన్ఫిడెన్షియల్‌ అని తెలిపింది.

జీవో ప్రతిలో కాన్ఫిడెన్షియల్‌ అన్న ఒక్క పదం మాత్రమే కనిపిస్తోంది. మరో 17 జీవోల్లో ఆ పదం కూడా పేర్కొనలేదు. ఖాళీ ప్రతిని అప్‌లోడ్‌ చేసింది. జీవోలకు నెంబర్లు మాత్రమే ఇచ్చి టైటిల్‌ (శీర్షిక) లేకుండా చేసింది.

ఒకే రోజు ఇన్నేసి రహస్య, ఖాళీ ఉత్తర్వులు, అదీ ఒకే శాఖ నుంచి విడుదల కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత టిడిపి ప్రభుత్వంలోనైనా, ఇప్పటి వైసిపి హయాంలోనైనా అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం, నిధులు పక్కదారి పట్టడం వంటి ఆరోపణలెదుర్కొంటున్న కేసుల్లో విజిలెన్స్‌్‌ దర్యాప్తు పాలనాపరంగా జరుగుతుంది. ఆ కేసుల దర్యాప్తులకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో ప్రభుత్వం వాటి పట్ల రహస్యం పాటిస్తోంది.

వైసిపి సర్కారు అధికారంలోకొచ్చి 85 రోజులవగా ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి 41 కాన్ఫిడెన్షియల్‌ జీవోలొచ్చాయి. గురువారం రెవెన్యూ డిపార్టుమెంట్‌ నుంచి వచ్చిన 17 'ఖాళీ' జీవోలు అదనం. వాటిని కూడా కలుపుకుంటే 58 రహస్య జీవోలవుతాయి. ఆ విధంగా విడుదలైన జీవోల్లో రెవెన్యూ శాఖ నుంచే 36 జారీ అయ్యాయి. తరచూ అవినీతిరహిత, పారదర్శక పాలన అందిస్తామంటున్న జగన్‌ ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో రహస్య, ఖాళీ జీవోలు విడుదల కావడంపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత టిడిపి హయాంలోనూ ఇలాగే కాన్ఫిడెన్షియల్‌ జీవోలు వచ్చాయి. చివరికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటిస్తుండగానే ఆదరాబాదరగా చంద్రబాబు సర్కారు పెద్ద సంఖ్యలో కాన్ఫిడెన్షియల్‌, ఖాళీ ఉత్తర్వులిచ్చి విమర్శలపాలైంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఒకే రోజు 17 ఖాళీ జీవోలు!"

Post a Comment