‘మైనారిటీ’ నిర్వచనం మార్చాలి

  • రాష్ట్ర జనాభా ప్రకారం మైనారిటీని తేల్చాలి
  • కేంద్ర డేటా ప్రకారం చేయడం సరికాదు
  • ఏడు రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు
  • ముస్లిం, క్రైస్తవ జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలున్నాయ్‌
  • 26ఏళ్ల నాటి నోటిఫికేషన్‌ చట్టవిరుద్ధం
  • సుప్రీంలో పిల్‌- కేంద్ర సాయాన్ని కోరిన సీజే
న్యూఢిల్లీ, జూలై 19: మైనారిటీ వర్గాలకు ఇస్తున్న నిర్వచనం మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత దావా దాఖలయ్యింది. రాష్ట్రాల్లోని జనాభా ప్రాతిపదికన మైనారిటీ అన్నది నిర్ధారించాలి తప్ప కేంద్రం ఇచ్చే డేటా ఆధారంగా కాదని- పిటిషన్‌ వేసిన న్యాయవాది, బీజేపీ కార్యకర్త అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ అందులో పేర్కొన్నారు. ‘‘జాతీయ డేటా ప్రకారం మైనారిటీ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధం. ఇది సహజ న్యాయసూత్రాలకు కూడా విరుద్ధం’’ అని ఆయన తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు.
 
ఈ పిటిషన్‌ను పరిశీలించిన చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం- ఈ కేసులో సాయపడాల్సిందిగా అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను కోరింది. రాజకీయంగా అత్యంత కీలకమైన ఈ కేసు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉంది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలను మైనారిటీలుగా గుర్తిస్తూ కేంద్రం 26 ఏళ్ల కిందట ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు 1992లో జాతీయ మైనారిటీ కమిషన్‌ ఓ చట్టాన్ని చేసి.. అందులోని సెక్షన్‌ 2 (సీ)లో ఈ వర్గీకరణను పొందుపరిచింది. దీనిని ఉపాధ్యాయ సవాలు చేశారు. ఆరోగ్యం, విద్య, నివాసం, జీవనం మొదలైన ప్రాథమిక హక్కులను ఇది హరిస్తోందన్నది ఆయన వాదన. ‘జాతీయ సగటు ఆధారంగా హిందువులను మెజారిటీ వర్గంగా కేంద్రం తీర్మానించింది.
 
కానీ రాష్ట్రాల జనాభాలను పరిశీలిస్తే చాలా చోట్ల వారు మైనారిటీలుగా ఉన్నారు. ముఖ్యంగా ఈశాన్య భారతం, దక్షిణాది, జమ్మూ కశ్మీర్‌ మొదలైన చోట్ల! దీనివల్ల ముస్లింలకు విద్య, ఆరోగ్య, జీవనోపాధి రంగాల్లో లభిస్తున్న అనేక సౌకర్యాలు హిందువులకు అందడం లేదు. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల అధికరణాలకు (14, 21, 15, 19)లకు వ్యతిరేకం. ఈ దృష్ట్యా మైనారిటీ అన్న పద నిర్వచనాన్ని జాతీయ మైనారిటీ కమిషన్‌ పునఃపరిశీలించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.


 
‘‘రాజ్యాంగంలోని 29-30 అధికణాల్లో పేర్కొన్న మైనారిటీ అన్న పద నిర్వచనం రాష్ట్రాల చేతికొచ్చేసరికి మారిపోతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది మారాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల సంఖ్య తక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో వారిని మైనారిటీలుగా ప్రకటించాలి’’ అని ఆయన తన పిటిషన్‌లో కోరారు.
 
ఏంటీ వివక్ష..?
  • రాజ్యాంగం ప్రసాదించిన సమాన హక్కుల అఽధికరణాలకు, ఆచరణకు సామ్యం కుదరడం లేదని, మైనారిటీ చట్టం వివక్షతో కూడుకున్నదని పిటిషనర్‌ వాదించారు.
  • మిజోరం, మేఘాలయ, నాగాలాండ్‌లలో క్రైస్తవు లు ఎక్కువ.. కానీ వారికి మైనారిటీ హోదా ఉంది
  • అరుణాచల్‌, గోవా, కేరళ, మణిపూర్‌, తమిళనాడుల్లో క్రిస్టియన్లు గణనీయంగా ఉన్న ప్రాంతాలున్నాయి. వారికి మైనారిటీ హోదా ఉంది
  • పంజాబ్‌లో సిక్కుల సంఖ్య చాలా ఎక్కువ.. కానీ వారు మైనారిటీలు
  • ఢిల్లీ, హరియాణా, చండీగఢ్‌ల్లో సైతం సిక్కులెక్కువ... కానీ వారికి మైనారిటీ హోదా ఉంది
  • లక్షద్వీ్‌పలో అంతా ముస్లింలే.. ఏకంగా 97 శాతం ఉన్నారు. వారినీ మైనారిటీలుగా పరిగణిస్తున్నారు
  • జమ్మూ కశ్మీర్‌లో 68.3 శాతం ముస్లింలున్నారు. వారూ మైనారిటీలే
  • అసోం (35 శాతం), బెంగాల్‌ (27.5 శాతం), కేరళ (26.6 శాతం), యూపీ (19.3 శాతం), బిహార్‌ (18 శాతం)ల్లో ముస్లింలెక్కువగానే ఉన్నారు. వారంతా మైనారిటీ సౌకర్యాలు పొందుతున్నారు
రాష్ట్రం    హిందువుల సంఖ్య (శాతాల్లో)
మిజోరాం                 2.75
లక్షద్వీప్‌                  2.75
నాగాలాండ్‌               8.75
మేఘాలయ            11.53
జమ్మూ కశ్మీర్‌           28.44
అరుణాచల్‌ ప్రదేశ్‌       29
మణిపూర్‌                31.39
పంజాబ్‌                   38.40

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "‘మైనారిటీ’ నిర్వచనం మార్చాలి"

Post a Comment