చెప్పులు లేకుండా తిరిగి.. అద్భుతాలు సృష్టించి

ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ప్రస్థానమిది..

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఆ కుర్రాడు.. చిన్నప్పుడు తండ్రితో కలిసి పొలం పనులు చేశాడు.. కాళ్లకు చెప్పులు లేకుండానే తిరిగాడు.. కళాశాలకు వెళ్లేంత వరకూ ధోతీనే ధరించాడు.. ఇంతటి నిరుపేద కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి.. భారత ఖ్యాతిని ప్రపంచంలోనే కాదు, విశ్వం నలుమూలల వ్యాపింపజేసే స్థాయికి ఎదుగుతాడని ఎవరైనా ఊహించారా?. అతనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌.




అంతరిక్ష చరిత్రలో ఇస్రో ఎన్నో మైలురాళ్లను చేరుకోవడంలో శివన్‌ కీలక భూమిక పోషించారు. అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-2 ప్రాజెక్టు ఆయన ఆధ్వరంలోనే కొనసాగుతోంది


భవిష్యత్‌లో భారత కీర్తిని పెంచే మరిన్ని ప్రాజెక్టులకూ ఆయనే నేతృత్వం వహించనున్నారు. తన బాల్యానికి సంబంధించిన పలు విశేషాలను శివన్‌ ఇటీవల ఓ మీడియాతో పంచుకున్నాడు.

ఆ కుటుంబంలో తొలి గ్రాడ్యుయేట్‌.. 
తమిళనాడులోకి కన్యాకుమారి జిల్లాలోని ఓ నిరుపేద రైతు కుటుంబంలో కైలాసవదివు శివన్‌ జన్మించారు. ఆ కుటుంబంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది శివన్‌ ఒక్కరే. ఆర్థిక స్తోమత లేకపోవడంతో శివన్‌ సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నత చదువులు చదవలేకపోయారు. పొలం పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఆ కారణం చేతనే ఇంటికి దగ్గర్లోని కళాశాలలో శివన్‌ను చేర్పించాడు అతని తండ్రి.

ఎంఐటీలో చేరిన తర్వాతే ప్యాంట్‌.. 
నిరుపేద కుటుంబంలో జన్మించడంతో చిన్నప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండానే తిరిగేవాడు శివన్‌. ప్రభుత్వ పాఠశాలలో తమిళ మీడియంలో పాఠశాల విద్య కొనసాగింది. నాగెర్‌కోయిల్‌లోని ఎస్టీ హిందూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. బీఎస్సీ(గణితం)లో వంద శాతం మార్కులు సంపాదించాడు. దీంతో అతని ఆసక్తి తెలుసుకొని తండ్రి ప్రోత్సహించడం ప్రారంభించాడు. శివన్‌ 1980లో మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చేరి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఎంఐటీలో చేరంత వరకూ ధోతీని ధరించేవాడు. ఆ తర్వాతనే ప్యాంట్‌ వేసుకుని కళాశాలకు వెళ్లాడు


అన్ని రాకెట్‌ ప్రాజెక్టుల్లో పనిచేసి.. 
1982లో శివన్‌ ఇస్రోలో చేరారు. దాదాపు అన్ని రాకెట్‌ ప్రోగ్రామ్స్‌లో పనిచేశారు. ఇస్రోలో అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. క్రయోజనిక్‌ ఇంజిన్లు, పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ, ఆర్‌ఎల్వీ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. 2017 ఫిబ్రవరిలో ఇస్రో ప్రపంచ రికార్డు(ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం)లో కీలక భూమిక పోషించారు. 2018 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు శివన్‌ ఆధ్వర్యంలో జరిగాయి.

క్లిష్ట సమయంలో చురుగ్గా స్పందించి.. 
చంద్రయాన్‌-2.. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే జీఎస్‌ఎల్వీ ఎంకే3 వాహకనౌక ద్వారా జులై 15న నింగిలోకి దూసుకెళ్లేది. అయితే చివరి నిమిషాల్లో సాంకేతిక లోపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంటనే ప్రయోగాన్ని నిలిపివేసేందుకు శివన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇస్రో తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు నిపుణులు స్వాగతించారు. సరైన సమయంలో స్పందించి విలువైన రాకెట్‌, ఉపగ్రహాలను రక్షించారని కొనియాడారు. ప్రయోగాన్ని నిలిపివేసిన అనంతరం శివన్‌ వెనువెంటనే ఓ ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి సమస్యను 24 గంటల్లోనే పరిష్కరించారు. అతి తక్కువ సమయంలో సమస్యను పరిష్కరించి తిరిగి ప్రయోగానికి సిద్ధం చేయడానికి శివన్‌ ఎంతో కృషి చేశారు. ఈ నెల 22న చంద్రయాన్‌-2 నింగిలోకి దూసుకెళ్లి తొలిదశను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "చెప్పులు లేకుండా తిరిగి.. అద్భుతాలు సృష్టించి"

Post a Comment