ఇ ఫైలింగ్ జాగ్రత్తలు తెలుసుకోండి

ఇ ఫైలింగ్ జాగ్రత్తలు తెలుసుకోండి
ఈనాడు -(30/06/2019.)
*రిటర్నులకు.. సిద్ధమయ్యారా*
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించే సమయం ఆసన్నమయ్యింది. 2018-19 ఆర్థిక సంవత్సరం (అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2019-20) రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31, 2019 వరకూ సమయం ఉంది. చాలా సమయం ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ, చివరి నిమిషం వరకూ ఎదురు చూడకుండా.. ముందే రిటర్నులు దాఖలు చేస్తే మేలు కదా.. మరి, దీనికోసం ఎలా సిద్ధం కావాలి? అవసరమైన పత్రాలేమిటి?


రిటర్నులు దాఖలు చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మనం పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన అన్ని ఆధారాలనూ సిద్ధంగా ఉంచుకొని, అన్ని వివరాలనూ పూర్తి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం ఏయే పత్రాలు మీ దగ్గరుండాలంటే..


ఫారం 16 తీసుకున్నారా?
ఉద్యోగం చేస్తున్న వారందరికీ.. యాజమాన్యాలు మూలం వద్ద పన్ను కోతకు సంబంధించిన వివరాలతోపాటు, ఆదాయ ఆధారాలతో ఫారం-16ను అందిస్తాయి. ఇందులో మీ ఆదాయానికి సంబంధించిన వివరాలతోపాటు, పన్ను మినహాయింపులకు సంబంధించిన అంశాలూ ఉంటాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రిటర్నుల ఫారాలకు అనుగుణంగా ఇప్పుడు కొత్త రూపంలో ఈ పత్రం అందుతుంది.

ఈ ఫారం 16 రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్‌- ఏ లో యాజమాన్యం మినహాయించిన పన్ను వివరాలు, శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌), ఉద్యోగి, ఉద్యోగ సంస్థ వివరాలు, ఉంటాయి. పార్ట్‌-బిలో మూల వేతనం, అలవెన్సులు, ఇతర ఆదాయాలను పేర్కొంటారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీలో పేర్కొన్న పెట్టుబడులు పెట్టినప్పుడు ఆ వివరాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. మీరు యాజమాన్యానికి ఇచ్చిన మినహాయింపులకు సంబంధించిన ఆధారాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని, అవన్నీ ఇందులో పేర్కొన్నారా లేదా గమనించండి. ఏదైనా తేడా ఉంటే.. రిటర్నులు సమర్పించేప్పుడు వాటిని పేర్కొనండి.

పన్ను జమ ఎంత?
మీ దగ్గర్నుంచి ఆదాయపు పన్ను శాఖకు ఎంత పన్ను జమ అయ్యిందనే విషయాన్ని తెలిపేది ఫారం 26 ఏఎస్‌. ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్‌ వెబ్‌సైటులోకి వెళ్లి.. ఎవరికి వారు ఈ ఫారాన్ని పొందే వీలుంది. ఇందులో.. బ్యాంకులు, యాజమాన్యం మూలం వద్ద వసూలు చేసిన పన్ను వివరాలు, సొంతంగా మీరు చెల్లించిన పన్ను వివరాలు, ఇతర సంస్థల నుంచి ఆదాయం వచ్చినప్పుడు దానికి సంబంధించిన పన్ను, ముందస్తు పన్ను చెల్లింపు వివరాలు ఉంటాయి.
ఈ పత్రాన్ని తీసుకొని, పూర్తిగా పరిశీలించండి. మీ ఆదాయాలు, దానికి సంబంధించి పన్ను మినహాయింపులన్నీ సరిగా నమోదయ్యాయా? చూసుకోండి. ఈ పత్రంలో వచ్చిన వివరాల ఆధారంగానే రిటర్నులు సమర్పించేందుకు వీలవుతుంది.

ఫారం 16ఏ/ ఫారం 16బీ/ ఫారం 16సీ

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన వారికి వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను కోత విధించినప్పుడు బ్యాంకులు ఫారం 16 ఏను జారీ చేస్తాయి. అదే విధంగా మీరు ఇల్లు అమ్మినప్పుడు కొనుగోలుదారుడు పన్ను మినహాయించిన సందర్భంలో ఫారం 16బి ఇస్తారు. నెలవారీ అద్దె మొత్తం రూ.50,000 దాటినప్పుడు.. అద్దె చెల్లించే వారు పన్ను మినహాయించి, యజమానికి ఇచ్చే సర్టిఫికెట్‌ ఫారం 16సి. పన్ను రిటర్నులు దాఖలు చేసేప్పుడు.. పైన పేర్కొన్న ఆదాయాలకు వర్తించే ఫారాలను తీసుకోవడం మర్చిపోకండి. వీటి ఆధారంగానే మీ మొత్తం ఆదాయాన్ని లెక్కించేందుకు వీలవుతుంది.
పత్రాలన్నీ సిద్ధంగా..
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ మినహాయింపుల కోసం పెట్టిన పెట్టుబడి రశీదులన్నీ ఇప్పటికే యాజమాన్యానికి ఇచ్చి ఉంటారు. అవన్నీ సరిగ్గా నమోదయ్యాయా లేదా తనిఖీ చేసుకోండి. ఒకవేళ నమోదు కాకపోతే వాటి ఆధారాలను మీ దగ్గర పెట్టుకొని, రిటర్నులలో నమోదు చేయండి.

* మూలధన పెట్టుబడిపై లాభం లేదా నష్టం వచ్చినప్పుడు కూడా ఆ విషయాన్ని రిటర్నులలో పేర్కొనడం మంచిది. ముఖ్యంగా స్థిరాస్తులను విక్రయించినప్పుడు దానికి సంబంధించిన అన్ని పత్రాలూ సిద్ధంగా ఉంచుకోండి.
* ఇంటి రుణం తీసుకున్నప్పుడు.. దానికి చెల్లించే వడ్డీకి సంబంధించిన వడ్డీ సర్టిఫికెట్‌ జాగ్రత్తగా ఉంచుకోండి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నప్పుడు వార్షిక వడ్డీకి సంబంధించిన వివరాలను బ్యాంకు/పోస్టాఫీసు నుంచి తీసుకోండి.

ఇవేకాకుండా.. రిటర్నులు దాఖలు చేసేప్పుడు.. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు.. గత ఏడాదికి సంబంధించిన రిటర్నుల పత్రాలూ అందుబాటులో ఉంచుకోండి.

రిటర్నులు దాఖలు చేసే సమయంలో నమోదు చేసే ప్రతి రూపాయికీ తగిన ఆధారం ఉండేలా చూసుకోవాలి. మీకు సంబంధించిన ఆదాయం, మినహాయింపుల పత్రాల్లో ఏదైనా తేడా ఉందని గమనిస్తే.. దాన్ని జారీ చేసిన వారిని సంప్రదించి సరి చేసుకునేందుకు ప్రయత్నించండి. కచ్చితమైన సమాచారంతో రిటర్నులు దాఖలు చేస్తేనే.. భవిష్యత్తులో ఏ ఇబ్బందీ రాకుండా ఉంటుందని గుర్తుంచుకోండి.      *

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇ ఫైలింగ్ జాగ్రత్తలు తెలుసుకోండి"

Post a Comment