నేటి నుండి బడులకు చకచక..


  • 15వ తేదీ వరకూ ఒంటిపూట బడులు
  • ఉ.8 నుంచి మ.12:30 గంటల వరకూ
  • ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం
  • మౌలిక వసతుల సమస్య యథాతథం
  • అరకొర టీచర్లతో విద్యాసంవత్సరం ఆరంభం
అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో బుధవారం నుంచి బడి గంట మోగనుంది. అన్ని యాజమాన్యాల పాఠశాలలు బుధవారం పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో కలిపి మొత్తం 62,063 పాఠశాలలు ఉండగా 70,41,694 లక్షల మంది విద్యార్థులు కొత్త తరగతులలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు


అయితే 15వ తేదీ దాకా మధ్యాహ్నం వరకే పాఠశాలలు నిర్వహిస్తారు. ఎండల తీవ్రత కారణంగా వాతావరణశాఖ చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుని నాలుగు రోజులపాటు ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి 12ః30 గంటల వరకే పాఠశాలలు ఉంటాయి. ఈ నెల 17 నుంచి పాఠశాలలు రెండుపూటలూ జరుగుతాయి.

టీచర్ల కొరత..

రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో 37,21,436 మంది ప్రభుత్వరంగ పాఠశాలల్లో, 2,08,825 మంది ఎయిడెడ్‌ పాఠశాలల్లో, 31,11,433 మంది విద్యార్థులు ప్రైవేట్‌ రంగంలోని పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రభుత్వరంగ పాఠశాలల్లో దాదాపు 1.85 లక్షల ఉపాధ్యాయులు పనిచేస్తుండగా... మరో 18వేల ఖాళీలు ఉన్నాయి. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి టీచర్‌ ఖాళీలను భర్తీచేస్తామని చెప్పినా ఆచరణలో జరగలేదు. కొత్త టీచర్ల నియామకాలు చేపట్టేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాగా, తొలిసారిగా విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాల్లో ఇప్పటికే దాదాపు 80శాతం మేర పాఠశాలలకు చేరాయి. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి 9-10 తరగతుల బాలికలకు పంపిణీ చేయాల్సిన సైకిళ్లలో ఇప్పటి వరకూ కేవలం 37 శాతమే కావడం గమనార్హం. మిగిలిన సైకిళ్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది.

మౌలిక వసతుల వెక్కిరింత

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్య యథాతథంగా కొనసాగుతోంది. గత విద్యా సంవత్సరంలో కొన్ని హైస్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదు. దాదాపు 40శాతం పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవు. 57శాతం స్కూళ్లలో ఫర్నిచర్‌, 25శాతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం వంటగదులు, 7 శాతం స్కూళ్లలో నీటి సదుపాయం, 6 శాతం స్కూళ్లలో విద్యుత్‌ లేదు. మొత్తం 38,889 పాఠశాలల్లో రూ.4,848 కోట్ల వ్యయంతో హైబ్రిడ్‌ యాన్యుటీ స్కీమ్‌ ద్వారా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా అది టెండర్ల ప్రక్రియకే పరిమతం అయ్యింది. ఇక మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలోనూ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా తరగతి గదుల్లేవు.

ఇదీ రాజన్న బడిబాట

  • ఈ నెల 15 వరకూ 'రాజన్న బడిబాట' పేరిట ఉదయం పూట పలు కార్యక్రమాలను విద్యాశాఖ నిర్వహించనుంది.
  • 12న స్వాగత సంబరం: పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని కల్పించడం. పాఠశాలల్లో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించడం. బొమ్మలు గీయించడం, రంగు కాగితాలను కత్తిరించడం, వివిధ ఆకృతులను తయారుచేసి ప్రదర్శించడం.
  • 13న నందనాభినయం: విద్యార్థులతో మొక్కలు నాటించడం, వాటిని దత్తత ఇవ్వటం. అభినయ గేయాలు, కథలు, పాటలతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడడం.
  • 14న అక్షరం: ప్రజాప్రతినిధులు, పాఠశాలల యాజమాన్య కమిటీ సభ్యులు, దాతల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహణ.
  • 15న వందనం-అభినందనం: ప్రముఖులతో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, బాలికల విద్యాభివృద్ధికి సూచనలు, సలహాలు, తల్లిదండ్రుల సమావేశ నిర్వహణ, ప్రతిభావంతులైన విద్యార్థులకు సత్కారం, సహపంక్తి భోజనాలు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేటి నుండి బడులకు చకచక.."

Post a Comment