టీచర్ల నియామకాల బిల్లుకు ఆమోదం

- ఆధార్ చట్టానికి సవరణ - ట్రిపుల్ తలాక్ కొత్త బిల్లు - 7వేల టీచర్ పోస్టుల భర్తీ - కేంద్ర మంత్రివర్గం ఆమోదం - వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పలు బిల్లుల ప్రతిపాదనకు నిర్ణయం న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతా తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు తీసుకునేందుకు ఆధార్‌ను స్వచ్ఛందంగా వినియోగించే అవకాశం పౌరులకు కల్పించే ఆధార్ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మొదటిసారిగా మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఆధార్ చట్ట సవరణతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఆధార్ చట్టం 2016, ఇతర చట్టాలను సవరిస్తూ గత మార్చిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన తాజా బిల్లును ఈ నెల 17నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది


ప్రజలు తమ గుర్తింపునకు ఆధారంగా ఆధార్‌ను స్వచ్ఛందంగా సమర్పిస్తే తప్ప దాని కోసం ఎవరూ ఒత్తిడి చేయరాదని చట్టంలో సవరణలు చేశారు. అలాగే 18 ఏండ్లు దాటిన వ్యక్తి ఆధార్ నుంచి నిష్క్రమించే అవకాశాన్ని కూడా బిల్లులో కల్పించారు. ఇక ఆధార్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై రూ.కోటి వరకు జరిమానా విధించే విధంగా నిబంధనలను సవరించారు. ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని నిషేధించే తాజా బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ బిల్లును వచ్చే సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

టీచర్ల నియామకాల బిల్లుకు ఆమోదం

ఖాళీగా ఉన్న ఏడువేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి అనుమతినిచ్చే కేంద్ర విద్యా సంస్థల (టీచర్స్ క్యాడర్‌లో రిజర్వేషన్) బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆర్నెల్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.


గత ఏడాది జూన్ 20 నుంచి ఆ రాష్ట్రంలో కేంద్ర పాలన కొనసాగుతున్నది. జమ్ముకశ్మీర్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంట నివసిస్తున్న ప్రజలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ట్రస్ట్‌లు కూడా పారిశ్రామిక యూనిట్లను నెలకొల్పేందుకు అనుమతించే బిల్లుకు, ప్రభుత్వ నివాస భవనాలను అనధికారికంగా ఆక్రమించిన వారిని ఖాళీ చేయించే బిల్లుకు, హోమియోపతి కేంద్ర మండలి (సవరణ) ముసాయిదా బిల్లుకు, దంతవైద్యుల చట్టం, 1948 సవరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రవర్గ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ తన మంత్రివర్గ సహచరులకు పలు సూచనలు చేశారు. ఆఫీసుకు నిర్దేశిత సమయంలోగా రావాలని చెప్పారు. సహాయ మంత్రులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని, ముఖ్యమైన ఫైళ్లను వారితో పంచుకోవాలని సీనియర్లకు సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టీచర్ల నియామకాల బిల్లుకు ఆమోదం"

Post a Comment