ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యమేనా... చట్టం ఏం చెబుతోంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సుదీర్ఘ కాలంగా సంస్థ సిబ్బంది వినిపిస్తున్న ఈ డిమాండ్‌ను నెరవర్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
వైఎస్సార్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ హామీ ఉంది. దీంతో తొలి క్యాబినెట్ భేటీలోనే విలీన నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని క్యాబినెట్ ఆదేశించింది.
ప్రస్తుత పరిస్థితి . ..
రోడ్డు రవాణా చట్టం-1950ని అనుసరించి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా ఆర్టీసీలు ఏర్పడ్డాయి
రాష్ట్ర విభజనం అనంతరం ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విడిపోయింది. విజయవాడ కేంద్రంగా ఏపీఎస్ఆర్టీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పడిన ఆర్టీసీలో ప్రారంభం నుంచి చాలా మార్పులు జరిగాయి. కొన్నేళ్లుగా అద్దె బస్సులు, తాత్కాలిక సిబ్బంది నియామకాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీకి 11,678 బస్సులున్నాయి. అందులో 8964 బస్సులు సంస్థకు చెందినవి కాగా, మరో 2714 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్నవి. రాష్ట్ర వ్యాప్తంగా 126 బస్సు డిపోలు, 426 బస్సు స్టేషన్ల ఉన్నాయి.
ప్రస్తుతం నాలుగు జోన్లు, 12 రీజియన్లుగా ఏపీఎస్ఆర్టీసీ నడుస్తోంది. ఇటీవల సంస్థ ఏసీ బస్సుల నిర్వహణ మీద దృష్టి పెట్టింది. వెన్నెల, అమరావతి, గరుడ, ఇంద్ర వంటి సర్వీసులను తీసుకువచ్చింది. మొత్తంగా 299 ఏసీ సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో అత్యధికంగా 119 ఇంద్ర, 68 గరుడ సర్వీసులు ఉన్నాయి. సూపర్ లగ్జరీ, డీలక్స్, మెట్రో డీలక్స్‌తో పాటుగా పల్లె వెలుగు సర్వీసుల ద్వారా అనేక గ్రామీణ ప్రాంతాలు, సిటీ బస్సులతో నగర ప్రాంతాలను కవర్ చేస్తూ సంస్థకు నెట్‌వర్క్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ,మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి
నష్టాల ఊబిలో సంస్థ
ఏపీఎస్ఆర్టీసీ తన సేవల ద్వారా పలు గుర్తింపులు సాధించింది. అత్యధిక బస్సులు నడిపే సంస్థగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిన్నీస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా రోడ్డు భద్రతలో పలు జాగ్రత్తలు పాటిస్తోంది. రాష్ట్రంలోని అన్ని డిపోలను కంప్యూటరైజ్ చేసింది. వికలాంగులు, విలేకరులు, విద్యార్థులకు రాయితీలందిస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వం లెక్కల ప్రకారమే ఏపీఎస్ఆర్టీసీ నష్టాలు రూ.6373 కోట్లు. సిబ్బంది పీఎఫ్ నిధుల్లో నుంచి సుమారుగా రూ.2,900 కోట్లను సంస్థ అవసరాల కోసం వినియోగించినట్లుగా సమాచారం.
ఏపీఎస్ఆర్టీసీ భారీ నష్టాల్లో కూరుకుపోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి పోటీ, చమురు ధరలు, రాయితీల వ్యయాన్ని ప్రభుత్వం రీఎంబర్స్ చేయకపోవడం వంటివి వీటిలో ప్రధానమైనవని విశ్లేషకులు చెబుతున్నారు.
నిర్వహణ లోపాలు కూడా ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఉద్యోగ భద్రత, ఇతరత్రా ప్రయోజనాలు దక్కుతాయన్న ఆశతో కార్మిక సంఘాలు విలీనం డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి
'వీలైనంత త్వరగా పూర్తి'
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయం గురించి ఏపీ సమాచార మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.
''దేశంలోనే ప్రమాణాల పరంగా ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉంది. ఆర్టీసీని విలీనం చేయాలన్నది మానవీయ కోణంలో తీసుకున్ననిర్ణయం. వీలైనంత త్వరగా విలీన ప్రక్రియ పూర్తి చేస్తాం. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తాం. ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే ఆలోచనలోనూ ఉన్నాం" అని ఆయన చెప్పారు.
కేంద్రం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం-1950లో ఆర్టీసీ మూసివేత గురించి గానీ, విలీనం గురించి గానీ ప్రస్తావనే లేదు. చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని పునర్నిర్మాణం చేయవచ్చు. కొంత కాలం తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు. సెక్షన్ 39 ప్రకారం ఆర్టీసీ లిక్విడేషన్ గురించి ప్రస్తావించారు. ఈ రెండు సెక్షన్స్ ప్రకారం ఆర్టీసీ విలీనం జరగాలంటే కేంద్రం అనుమతి ఉండాలి. అందుకు పార్లమెంట్‌లో చట్ట సవరణ జరగాలి
వివిధ ప్రతిఫలాలు దూరం
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే ప్రస్తుతం సంస్థ సిబ్బందికి దక్కుతున్న వివిధ ప్రతిఫలాలు దూరం అవుతాయి. వాస్తవానికి 1996 వరకూ ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఆర్టీసీ సిబ్బందికే వేతనాలు ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత మారిన పరిణామాలతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది.
ఆర్టీసీ సిబ్బందికి బోనస్, ఓవర్ టైమ్ వేతనం, ఈఎస్ఐ సహా మోటార్ వాహన చట్టం ప్రకారం పలు ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు వీటిలో కొన్ని వర్తించవు. కార్మిక చట్టాల అమలు కూడా భిన్నంగా ఉంటుంది.
ఆర్టీసీ విలీనంపై ఏపీ ప్రభుత్వం చేసే ప్రతిపాదనలను గమనించాల్సి ఉంటుందని ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు సీహెచ్ సుందరయ్య బీబీసీతో అన్నారు.
అహ్మదాబాద్ వంటి చోట్ల ప్రజా రవాణా వ్యవస్థలను ప్రభుత్వం నిర్వహిస్తున్నా, కార్మికులకు అందుతున్న ప్రయోజనాలు నామమాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
''సీనియర్ అధికారులతో సాంకేతిక కమిటీ వేశారు. ఐఐఎం, ప్రపంచబ్యాంక్, కేరళ రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు కూడా పరిశీలిస్తున్నారు. మెరుగైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ప్రభుత్వం మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించుకున్నాం'' అని సుందరయ్య అన్నారు
Source daily a
0 Response to "ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యమేనా... చట్టం ఏం చెబుతోంది?"
Post a Comment