ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీపై పన్ను మినహాయించాలి
ఆర్థిక మంత్రిని కోరిన ఏఐబీఈఏ
ముందస్తు బడ్జెట్ చర్చలు
దిల్లీ: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వచ్చే వడ్డీని ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్మలా సీతారామన్‌ను అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కోరింది. బ్యాంకింగ్ రంగం నుంచి సలహాలు, ప్రతిపాదనలను ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం లేఖలో పంపించారు. అందరికీ బ్యాంకింగ్ హక్కుగా మారాలని, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును కనీసం 2 బేసిస్ పాయింట్లు పెంచాలని కోరారు
ఎన్‌బీఎఫ్‌సీలకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి
ఆర్థిక రంగం, స్టాక్ మార్కెట్ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడో దఫా ముందస్తు బడ్జెట్ చర్చలు జరిపారు. స్టాక్ మార్కెట్లు, ఆర్థిక రంగం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఏఐఎఫ్‌లు)కు సంబంధించిన సమస్యలను సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్, వ్యయాల కార్యదర్శి గిరిష్ చంద్ర ముర్ము, రెవెన్యూ కార్యదర్శి అజయ్ నారాయణ పాండే, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్, ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్, పీఎన్‌బీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఛైర్మన్ సునీల్ మెహతా, ఎల్‌ఐసీ ఎండీ సుశీల్ కుమార్‌లు ఆర్థిక రంగం తరఫున పాల్గొన్న వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధులు అందించిన పలు సలహాలు, సూచనలు ఇలా..
* ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మూలధనం చొప్పించాలి.
* ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఫైనాన్షియల్ సెక్టర్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ క్రియాశీల పాత్ర పోషించాలి.
* ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నగదు లభ్యతకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలపై ఇచ్చే వడ్డీ రేట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి.
* ప్రత్యేక కమిటీ ద్వారా బ్యాంకుల మొండి బకాయిల కేటాయింపులపై సమీక్షించాలి. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు ప్రోత్సాహించడంతో పాటు నిధులు కేటాయించాలి. వ్యవసాయ మార్కెటింగ్‌కు ప్రోత్సాహాకాలు ఇవ్వాలి.
* ఎంఎస్‌ఎంఈ రంగంలో వాణిజ్య లైసెన్సు ఆన్‌లైన్‌లో తీసుకునే సదుపాయం కల్పించాలి. దివాలా చట్టం వల్ల ఎదురవుతున్న నగదు లభ్యత ఇబ్బందులను తగ్గించాలి.
* స్టాక్ మార్కెట్‌లో సెక్యూరిటీ లావాదేవీ పన్ను (ఎస్‌టీటీ) వంటి పన్నులను హేతుబద్ధీకరించాలి. ప్రత్యేక బాండు ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేయాలి. ఇన్విట్‌ల్లో పెట్టుబడి పెట్టేందుకు బ్యాంకులను అనుమతించాలి.
* జీఎస్‌టీ విధానాన్ని సరళీకరించాలి. పన్ను రేట్లను హేతుబద్ధీకరించాలి.
బీమాలో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచాలి: ఫిక్కీ
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచాలని పరిశ్రమ సంఘం ఫిక్కీ ప్రభుత్వాన్ని కోరింది. ఆహార రిటైల్‌లో 100 శాతం ఎఫ్‌డీఐ మాదిరిగానే, మల్టీ బ్రాండ్ రిటైల్ ఉత్పత్తులను పూర్తిగా భారత్‌లోనే తయారు చేయాలని సూచించింది. రీఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐలను 49 శాతానికి పరిమితం చేయొచ్చని తెలిపింది
0 Response to "ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీపై పన్ను మినహాయించాలి"
Post a Comment