మంత్రివర్గ సమావేశం 8ఫిభ్రవరి నాడు
మంత్రివర్గ సమావేశం
ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి
అమరావతి, ఫిబ్రవరి 8: ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) కల్పిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. గతేడాది జూలై ఒకటో తేదీ నుంచి దీన్ని వర్తింప చేస్తూ ఈ ఏడాది జూన్ నుంచి చెల్లింపులు జరిపేందుకు కేబినెట్ ఆమోదించింది. శుక్రవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలతో పాటు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లకు గరిష్ఠ వేతనాలను మంజూరు చేయాలని ప్రతిపాదిస్తూ ఆర్థికశాఖ జారీచేసిన జీవోపై మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ ప్రకారం డీఏ మినహా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సెలవులు వర్తిస్తాయి.
010 పద్దు కింద మునిసిపల్ ఉద్యోగులకు జీతాలు
010 పద్దు కింద విజయవాడ, విశాఖపట్నం
నగరపాలక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా
అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు ఆదేశాలననుసరించి సత్వర చెల్లింపులు జరిపేందుకు ఆమోదం లభించింది. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో చెల్లింపులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు అభినందించటంపై కూడా మంత్రిమండలిలో చర్చించారు. బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వ చొరవను హైకోర్టు అభినందించటం పట్ల సమావేశంలో హర్షం వ్యక్తమైంది. సత్వర ఊరటగా రూ 250 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. హైకోర్టు కూడా ఇందుకు అంగీకరించింది. ఇక భూముల వేలం త్వరితగతిన పూర్తిచేసి బాధితులందరికీ సత్వర న్యాయం జరిగేలా హైకోర్టు వేగవంతమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని మంత్రిమండలి అభిప్రాయపడింది.
స్మార్ట్‌సిటీగా ఏలూరు అంశం ప్రస్తావనకు వచ్చింది. వినూత్న నమూనాగా స్మార్ట్ ఏలూరును అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.
వైకుంఠపురం ఎత్తిపోతల పథకం నిర్మాణం అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. గతంలో గుత్తేదార్లు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఎవరు తక్కువ ధర వేస్తే వారికి కేటాయించాలని నిర్ణయించారు. రాజధాని అణరావతికి భవిష్యత్‌లో తాగునీటి అవసరాల దృష్ట్యా కృష్ణానదిపై వైకుంఠపురం దగ్గర బ్యారేజ్ నిర్మించాలని గతంలో నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజ్‌కి 23 కిలోమీటర్ల ఎగువన, పులిచింతల ప్రాజెక్ట్‌కు 60 కిలోమీటర్ల దిగువన వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణం కానుంది. బ్యారేజ్ పొడవు 3.068 కిలోమీటర్లు. ఈ బ్యారేజ్ నిర్మాణానికి రూ 3,278.60 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. నిర్మాణానికి ప్రభుత్వం మూడేళ్ల కాలపరిమితిని నిర్దేశించింది.
అమరావతిలో జేఎన్‌టీయూ ఏర్పాటు
జెఎన్‌టీయు అమరావతి పేరిట కొత్త యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్త వర్శిటీని మోడల్ యూనివర్శిటీగా ఏర్పాటు చేయాలని కూడా తీర్మానించారు.
అకార్డ్ వర్శిటీకి భూమి
విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో 70 ఎకరాల భూమిని ఎకరం రూ 10 లక్షల చొప్పున, విశాఖ రూరల్ మండలం ఎండాడ గ్రామంలో 70 ఎకరాల భూమిని ఎకరం కోటి రూపాయల చొప్పున అకార్డ్ యూనివర్శిటీకి కేటాయించేందుకు ఆమోదముద్ర వేసింది.
హెల్త్ సైనె్సస్ విభాగంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కూడిన మల్టీ స్ట్రీమ్ యూనివర్శిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. చెన్నైలో ఈ సంస్థకు 7 యూనివర్శిటీలు ఉన్నాయి. అన్ని విద్యా సంస్థలకు కలిపి 120 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రతిపాదన ప్రభుత్వానికి అందింది. రానున్న పదేళ్లలో రూ 5వేల కోట్ల పెట్టుబడులకు సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. అఖిల భారత స్థాయిలో ఈ సంస్థ ఏ ర్యాంక్‌లో ఉందో పరిశీలించి ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
విజయనగరంలో మెడికల్ కళాశాల
విజయనగరం విశ్వవిద్యాలయానికి గురజాడ అప్పారావు పేరు పెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. డిగ్రీ కళాశాలకు అనుమతిచ్చింది. విజయ నగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పేదలకు ఇరిగేషన్ భూములు
జలవనరులశాఖకు చెందిన భూములలో రెండువేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని తీర్మానించింది. ఇతర ఇళ్ల స్థలాలను కూడా సత్వరమే పంపిణీ చేయాలని నిశ్చయించింది. ఏళ్ల తరబడి నివాసం ఏర్పరచుకున్న పేదల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా సున్నిపెంటలో 76.4 ఎకరాలు, వెలిగోడులో 20 ఎకరాల భూముల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం పరిగి, సెరికొలెం గ్రామాల్లోని 256.51 ఎకరాల భూమిని బెనిఫీషియంట్ నాలెడ్జ్ పార్క్ ఏర్పాటుకు ఇవ్వాలనే ఏపీఐఐసీ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.
రాజమహేంద్రవరం రామకృష్ణ మఠానికి రూ 23,49,961 విలువగల ఆస్తిపన్నుకు మినహాయింపు నిచ్చింది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్‌కు బదులుగా అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆరోగ్య కేంద్రాల స్థాయి పెంపు
రాష్టవ్య్రాప్తంగా 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంచాలని తీర్మానించింది. ఇందుకు రూ 255.96 కోట్లు కేటాయించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ సిటీస్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపేడెకో) ఏర్పాటుకు విజయవాడ జక్కంపూడి, వేమవరం గ్రామాల్లో 153 ఎకరాల భూమిని రూ 50 లక్షల నుంచి కోటి వరకు మార్కెట్ ధర నిర్ధారిస్తూ కేటాయించేందుకు సమ్మతించింది. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో 50 ఎకరాల భూమిని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగానికి కేటాయించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రాంతంలో సమగ్ర ఇంటెలిజెన్స్ అకాడమీ ఇందులో ఏర్పాటు కానుంది.
8ఫిభ్రవరి నాడు
20శాతం ఐ.ఆర్ కు ఆమోదం
ఇతర తీర్మానాలు
వివరనాత్మక బ్రోచర్
చదవండి
అవగాహన చేసుకోండి
దిగుమతి చేసుకోండి
సివిప్రసాద్
0 Response to "మంత్రివర్గ సమావేశం 8ఫిభ్రవరి నాడు"
Post a Comment