8th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- జీతాల పెంపుపై బడ్జెట్​లో కీలక ప్రకటన!

2024-25ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న పార్లమెంట్​లో బడ్జెట్​ని ప్రవేశపెట్టనున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్​ కావడంతో దీనిపై అన్ని రంగాల వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు



ఇదిలా ఉండగా ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం అమలును కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్బీ యాదవ్ కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని, 18 నెలల పాటు కరువు భత్యం విడుదల చేయాలని, కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కల్పించాలని లేఖలో డిమాండ్ చేశారు.

8వ వేతన సంఘం ఎప్పుడు అమలు చేయాలి?

సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ప్రయోజనాలపై సమీక్ష, సవరణ, ద్రవ్యోల్బణం, ఇతర బాహ్య అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిఫార్సులు ఉంటాయి. 7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరి 28న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నియమించగా, 2015 నవంబర్ 19న కమిషన తన నివేదిక సమర్పించింది. ఈ సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. తదనుగుణంగా పదేళ్ల విధానాన్ని పరిశీలిస్తే 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమలు చేయాలి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తక్షణమే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)ను రద్దు చేయాలని, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో స్తంభింపజేసిన 18 నెలల డీఏ/ డీఆర్ను ఉద్యోగులు, పెన్షనర్లకు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

2024-25 కేంద్ర బడ్జెట్​ని జూలై 23న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు ఇది వరుసగా ఏడో బడ్జెట్ కావడం గమనార్హం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లోక్​సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడే వరకు ఆర్థిక అవసరాలను తీర్చింది. ఆ తర్వాత జూన్​లో కొత్త ప్రభుత్వం ఏర్పడగా జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్​ని ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఆగస్ట్​ 1 నుంచి జీతాలు పెంపు..

కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​! జీతాల పెంపుపై ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన వారికి కీలక అప్డేట్​. 7వ వేతన సంఘం సిఫార్సులను ఆగస్టు 1 నుంచి అమలు చేయాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. ఏడు లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపును అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "8th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- జీతాల పెంపుపై బడ్జెట్​లో కీలక ప్రకటన!"

Post a Comment