ఏకోపాధ్యాయ పాఠశాలలుండవు






ఎమ్మెల్సీలతో సమావేశంలో మంత్రి బొత్స హామీ

అమరావతి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): జీవో 117పై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్న తరుణంలో ప్రభుత్వం ఆ జీవోలో అనేక మార్పులు తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో గరిష్ఠంగా 30 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే ఉంటాడని ప్రభుత్వం జీవోలో పేర్కొనగా, దానిని సవరించడానికి అంగీకరించింది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చూస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. బుధవారం పీడీఎఫ్‌, స్వతంత్ర ఎమ్మెల్సీలు వీ బాలసుబ్రమణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు, కత్తి నర్సింహారెడ్డి, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, పాకలపాటి రఘువర్మ, ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జి... మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి జీవో 117పై తమ అభ్యంతరాలను తెలిపారు. అయితే.. తాము చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని పలు మార్పులు చేపట్టేందుకు మంత్రి అంగీకారం తెలిపారని మీడియాకు ఎమ్మెల్సీలు తెలిపారు. ప్రఽధానంగా 6, 8 తరగతులుండే ప్రాథమికోన్నత పాఠశాలలకు స్కూల్‌ అసిస్టెంట్‌ను ఇస్తామని, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వారానికి పీరియడ్స్‌ 45 నుంచి 36కు తగ్గిస్తామని, ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడి పోస్టును రద్దు చేయకుండా సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. ఉన్నత పాఠశాలల అప్‌గ్రేడేషన్‌లో భాగంగా ఇంటర్‌ బోధనకు అవసరమైన అధ్యాపకులను పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు పదోన్నతుల కల్పన ద్వారానే తీసుకుంటామని చెప్పారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జీరో సర్వీసు ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని తాము కోరగా, దానికి మంత్రి అంగీకరించినట్లు వెల్లడించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏకోపాధ్యాయ పాఠశాలలుండవు"

Post a Comment