తల్లిదండ్రుల కలల్ని పిల్లలపై రుద్దకూడదు : మోదీ





న్యూఢిల్లీ : తల్లిదండ్రులు తమ కలలను, ఆకాంక్షలను తమ పిల్లలపై రుద్దకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఏప్రిల్ ఉత్సవాల నేపథ్యంలో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను వేడుకలుగా ఎలా మార్చుకోవచ్చునో చర్చిద్దామన్నారు. శుక్రవారం ఆయన తల్కతోరా స్టేడియంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. 

‘పరీక్షా పే చర్చ-2022’ ఐదో విడత కార్యక్రమాన్ని ‘పరీక్ష యొక్క మాటలు, ప్రధాన మంత్రితో’ అనే నినాదంతో నిర్వహించారు. ఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరీక్షలకు ముందు ఎదురయ్యే సమస్యలు, పరీక్షలకు సిద్ధమయ్యే విధానాలు, ఒత్తిడిని తట్టుకోగలగడం వంటివాటి గురించి మోదీ మాట్లాడారు. 

మోదీ మాట్లాడుతూ, తమ కలలు, ఆకాంక్షలను పిల్లలపై రుద్దవద్దని తల్లిదండ్రులను, టీచర్లను కోరారు. ఆన్‌లైన్ విద్యకు ఆధారం విజ్ఞానాన్ని సంపాదించడమనే సిద్ధాంతమని తెలిపారు. ఆ విజ్ఞానాన్ని పటిష్టం చేసుకోవడం, ఆచరణలో వర్తింపజేయడానికి సంబంధించినది ఆఫ్‌లైన్ విద్య అని చెప్పారు. ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలని, దానిని ఆఫ్‌లైన్‌లో ఉపయోగించుకోవాలని చెప్పారు. జాతీయ విద్యా విధానం 21 శతాబ్దపు ఆకాంక్షలను నెరవేర్చుతుందన్నారు. ఇది భారత దేశాన్ని భవిష్యత్తులోకి తీసుకెళ్తుందన్నారు. ఈరోజుల్లో విజ్ఞానం మాత్రమే సరిపోదని, నైపుణ్యాన్ని కూడా సాధించాలని చెప్పారు. విజ్ఞానం, నైపుణ్యాల సమాహారంపై నూతన విద్యా విధానంలోని సిలబస్ దృష్టి పెట్టిందన్నారు.  

బాలల సత్తా గుర్తించాలి

బాలల నిజమైన సామర్థ్యాలు, ఆకాంక్షలను మనం అర్థం చేసుకుని, శ్రద్ధగా ప్రోత్సహించనంత వరకు వారు తమ సంపూర్ణ సామర్థ్యాన్ని తెలుసుకోలేరన్నారు. ప్రతి బిడ్డ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభతో పుడతారని చెప్పారు. మనం ఆ సత్తా, సామర్థ్యాలను గుర్తించాలని చెప్పారు. విద్యార్థులు తరచూ సందిగ్ధంలో ఉంటారని, తమ కలలను నెరవేర్చుకోవాలా? తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలా? అనే సందిగ్ధంలో ఉంటారని చెప్పారు. దీనివల్ల విద్యార్థులు అంతులేని అయోమయంలో కొట్టుమిట్టాడుతారని చెప్పారు. తమ పిల్లలకు దేనిమీద ఆసక్తి ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలని, వారి బలాలను వారు తెలుసుకోవడానికి సాయపడాలని అన్నారు. 

కాలంతో పాటు మారాలి

20వ శతాబ్దంనాటి కాలం చెల్లిన భావాలు, విధానాలు 21వ శతాబ్దంలో అభివృద్ధికి మార్గదర్శకం కాబోవన్నారు. కాలంతోపాటు మనం మారాలన్నారు. సానుభూతి కోసం ఎన్నడూ చూడవద్దని చెప్పారు. ‘‘మీ సమస్యలపై మీరే ఆత్మవిశ్వాసంతో పోరాడాల’’ని తెలిపారు. ‘‘మీ జీవితం నుంచి నెగెటివిటీని నిర్మూలించడానికి సవాళ్ళను ఎదుర్కొనాల’’ని చెప్పారు. 

వెనుకకు లాగుతున్నదేమిటి?

‘‘మనం తరచూ ప్రేరణనిచ్చే ఇంజెక్షన్ కోసం లేదా ప్రేరణనిచ్చే సూత్రం కోసం చూస్తూ ఉంటాం. మనల్ని వెనుకకు లాగుతున్నదేమిటనే దానిని మనం మొదట చూడాలి, వాటిని దూరంగా ఉంచాలి’’ అని చెప్పారు. స్వీయ ప్రేరణ కోసం ఓ సరదా మార్గం ఉందన్నారు. అన్ని బాధలతో ఓ లేఖను రాయాలని చెప్పారు. మనసు పక్కదారి పట్టడం, నైరాశ్యానికి లోనవడం వంటివాటిని అర్థం చేసుకోవడానికి స్వీయ పరిశీలన అవసరమని చెప్పారు. పరీక్షల సమయంలో ప్రగతి దిశగా తీసుకెళ్ళగలిగే ప్రేరణ అవసరమని తెలిపారు. 

జ్ఞాపకశక్తికి సహాయపడాలంటే...

జ్ఞాపకశక్తి గొప్ప ఉత్ప్రేరకమని, ఇది మన జీవితం, నైపుణ్యాలను పదునుపెట్టుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. ఓ పాత్రలో ఓ నాణేన్ని పెట్టి, నీటిని పోసి, ఆ నీటిని బాగా కదిలించినపుడు, దానిలోని నాణెం మనకు కనిపించదని చెప్పారు. మన జ్ఞాపకశక్తి కూడా అటువంటిదేనని తెలిపారు. మన జ్ఞాపకశక్తికి సహాయపడాలంటే మన మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. గరిష్ఠ స్థాయిలో ఫలితం రావాలన్నది మన లక్ష్యం కావాలని, అయితే రోజుకు 18 గంటలపాటు పని చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయని అనుకోనక్కర్లేదన్నారు. 

పరీక్షల కోసం చదవడం తప్పు

మనం పరీక్షల కోసం చదవకూడదని, ఇలా చేయడం తప్పుడు వైఖరి అవుతుందని చెప్పారు. పరీక్షల కోసం చదివితే నేర్చుకోవడంపై కాకుండా ఉత్తీర్ణత సాధించడం, మార్కులను పొందడంపై మాత్రమే మన దృష్టి ఉంటుందని చెప్పారు. పోటీల వల్ల జీవితం ప్రగతి సాధిస్తుందని చెప్పారు. మనం పోటీని ఆహ్వానించాలని, ప్రతి రంగంలోనూ పోటీ పడటానికి ప్రయత్నించాలని తెలిపారు. బాలికలను చదివించని సమాజం ఎన్నటికీ సౌభాగ్యవంతం కాబోదని తెలిపారు. గతంలో పెళ్లయిన తర్వాత బాలికలు స్థిరపడతారని అనుకునేవారని, వారి విద్యను నిర్లక్ష్యం చేసేవారని చెప్పారు. ఇది మారుతుండటం మంచి పరిణామమని తెలిపారు. మహిళా శక్తి లేకపోతే దేశం అభివృద్ధి సాధించదని మన తరానికి తెలుసునన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తల్లిదండ్రుల కలల్ని పిల్లలపై రుద్దకూడదు : మోదీ"

Post a Comment