ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ నేడు! ఫిట్‌మెంట్‌పై కసరత్తు కొలిక్కి.. ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో జగన్‌కు నివేదించిన ఆర్థికశాఖ అధికారులు






ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం చర్చించే అవకాశముంది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఉన్న 13 సంఘాల ప్రతినిధులు అందుబాటులో ఉండాలని, ఏ సమయంలోనైనా సీఎంతో భేటీకి అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది. ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చల్లో ఫిట్‌మెంట్‌ను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పీఆర్సీపై కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌పై అధికారుల కమిటీ సూచించిన 14.29 శాతం కంటే ఎంత ఎక్కువ ఇస్తే ప్రభుత్వం ఎంత భారం పడుతుందో ఆర్థిక శాఖ నివేదికలు సిద్ధం చేసింది. క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్థికశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ ఇతర ఉన్నతాధికారులు సీఎం జగన్‌కు ఈ నివేదికలను సమర్పించారు. వీటిపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. అయితే అక్కడ తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. గురువారం ముఖ్యమంత్రి వద్ద జరగనున్న జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. ఈ సమావేశానికి ముందుగా ముఖ్యమంత్రి మరోసారి ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. బుధవారం ముఖ్యమంత్రివద్ద జరిగిన చర్చలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. సీఎంతో భేటీకి అవకాశాలున్న నేపథ్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక సమావేశం కావాలని నిర్ణయించాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ నేడు! ఫిట్‌మెంట్‌పై కసరత్తు కొలిక్కి.. ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో జగన్‌కు నివేదించిన ఆర్థికశాఖ అధికారులు"

Post a Comment