జగనన్న స్మార్ట్ టౌన్ షిప్.. వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: మధ్యతరగతి ప్రజల సొంతింటి కల జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లకు ఏపీ ప్రభుత్వం రేపు(మంగళవారం) శ్రీకారం చుట్టనుంది. సంక్రాంతి పండుగ వేళ సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు. రేపటి నుంచి ఆయా ప్లాట్స్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ల మొదటి దశ కార్యక్రమాన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్య తరగతి వారి సొంతింటి కలను నిజం చేసే దిశగా పట్టణ ప్రాంతాల్లో ఈ లే అవుట్లను తీర్చిదిద్దుతున్నారు
మొదటి దశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరుల్లో ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. మధ్యతరగతి వారికి అనువైన ధరల్లో లిటిగేషన్ లేని స్థలాలను కేటాయిస్తారు. రూ.18 లక్షల వార్షిక ఆదాయం లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ జరిపి కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతారు. సంబంధిత ప్లాట్లకు ఏడాదిలోపు నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఒకేసారి ఏకమొత్తంలో చెల్లిస్తే 5 శాతం రాయితీని కూడా ప్రభుత్వం అందిస్తోంది.
అన్ని చోట్లా పట్టణ ప్రణాళికా విభాగం నియమాల మేరకు లే అవుట్లు తయారు చేస్తారు. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం రిజర్వేషన్, 20 శాతం రిబెటు కూడా అందించనున్నారు. కుటుంబ అవసరాలను బట్టి 150, 200, 240 చదరపు గజాలు ప్లాట్లు ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఈ లే అవుట్లలో 50 శాతం స్థలాన్ని సామాజిక అవసరాలకు కేటాయిస్తారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లతో పాటు కలర్ టైల్స్ తో ఫుట్‌పాత్ లు ఏర్పాటు చేస్తారు. ఏవెన్యూ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌తో పాటు వరద నీటి డ్రైనేజ్ కూడా ఉంటుంది. పార్కులు, ఆటస్థలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకులకు స్థలాలు ఉంటాయి. లే అవుట్ల నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా సంయుక్త నిర్వహణ చేస్తారు
0 Response to "జగనన్న స్మార్ట్ టౌన్ షిప్.. వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్"
Post a Comment