హోరెత్తిన పోరు



రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన..


విధులు బహిష్కరించి ర్యాలీలు, ధర్నాలు


నల్లబ్యాడ్జీలతో ఆఫీసుల ముందు నిరసన


తక్షణమే ప్రొబేషన్‌ ప్రకటించాలని డిమాండ్‌


అధికారులకు వినతి పత్రాలు అందజేత 


అధికారులు, పోలీసుల హెచ్చరికలు బేఖాతరు


ఓటీఎస్‌ మేళా, వ్యాక్సినేషన్‌కు దూరం 


నెల్లూరు జిల్లాలో మంత్రి మేకపాటికి నిరసన సెగ


అందరికీ ఒకేసారి ప్రొబేషన్‌ అన్న సీఎంవో అధికారుల వ్యాఖ్యలపై ఆగ్రహం



Video Player is loading.

This is a modal window.

video append of 588347b failed for segment #0 in playlist 0-https://s.vdo.ai/uploads/videos/16394881987561b89ac68dd3d.m3u8


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) 


ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇప్పటికే అధికారిక వాట్సాప్‌ గ్రూపుల నుంచి వైదొలిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళనను తీవ్రం చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించి ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన హోరు పెంచారు. ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన ఓటీఎస్‌ మేళాను కూడా బహిష్కరించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఈ రెండు కార్యక్రమాలు ఉన్నందున కచ్చితంగా విధులకు హాజరు కావాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా పట్టించుకోలేదు. ఉద్యోగాల్లో చేరి రెండేళ్లు పూర్తయిందని, వెంటనే ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసి, జనవరి నుంచే ప్లే స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

గతేడాది అక్టోబరుకే ప్రొబేషన్‌ ప్రకటించాల్సి ఉన్నా.. ప్రభుత్వం మరో ఆరు నెలలు వాయిదా వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భౌతికదాడులకు గురైనా వెరవక పనిచేసినా ప్రభుత్వం గుర్తించలేదన్నారు. ఎన్నిసార్లు వేడుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆయా కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఉద్యోగుల నిరసనలపై పలు చోట్ల పోలీసులు నిఘా పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయరాదని, కేసులు పెడతామని బెదిరించారు. అధికారులను కలిసేందుకు కూడా ఆంక్షలు పెట్టారు. కొన్ని చోట్ల నిరసనలు విరమించాలని అధికారులు కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. డిమాండ్ల సాధన కోసం ప్రకటించిన ఐక్య కార్యాచరణ ప్రకారం నిరసనలు కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.

కొన్ని చోట్ల ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి అటెండెన్స్‌ వేసుకుని తిరిగి నిరసన కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల కార్యాలయాలకు రాకుండా నిరసనలు తెలిపారు. జనవరి నెలాఖరుకు ప్రొబేషన్‌ ప్రకటిస్తామని ప్రభుత్వం గట్టిగా హామీ ఇస్తేనే ఉద్యమం నుంచి విరమించుకుంటామని, లేకపోతే నిరసన హోరు కొనసాగిస్తామని రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు నాగరాజు హెచ్చరించారు.  

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు 


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళనలు కొనసాగించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసనలు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విశాఖలో జోనల్‌ కార్యాలయాల కమిషనర్లకు వినతి పత్రాలు అందజేశాక కలెక్టరేట్‌కు వెళ్లారు. పేర్లు, ఫోన్‌ నంబర్లు, తదితర వివరాలతో వినతిపత్రం ఇవ్వాలని అధికారులు చెప్పడంతో వెనుదిరిగారు. విజయనగరం జిల్లాలో ఉద్యోగులంతా నిరసన బాట పట్టారు. అనేక సచివాలయాల్లో బయోమెట్రిక్‌ వేయకుండా నిరసనకు దిగారు. జిల్లా కేంద్రంలో జేసీకి వినతిపత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు రోడ్డెక్కారు. పలు చోట్ల ధర్నాలు చేశారు. రాజమహేంద్రవరంలో మోకాళ్లపై కూర్చుని నినాదాలు చేశారు.

తమకు న్యాయం చేయాలని, ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని నినదించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉధృతంగా నిరసనలు చేపట్టారు. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలు, 48 మండలాల్లో నిరసనలు తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించారు. గుంటూరు జిల్లాలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరణించిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఒంగోలు జిల్లాలో ఆందోళనలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఒక్క సచివాలయంలో కూడా విధులకు హాజరు కాలేదు. మర్రిపాడు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి వెళుతున్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి నిరసనకారుల సెగ తగిలింది. ఉద్యోగులంతా రోడ్డుపై నిలబడి ప్లకార్డులతో నిరసన తెలిపారు. మంత్రితో కాసేపు తమ సమస్యలపై చర్చించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు విధులు బహిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 21 శాఖలకు చెందిన దాదాపు 14 వేల మంది ఉద్యోగులు నిరసనల్లో పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మిగనూరులో ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు రోడ్లెక్కి వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఉద్యోగులను పోలీసులు హెచ్చరించారు. ఎవరి అనుమతితో ఆందోళనలు చేస్తున్నారని బెదిరింపులకు దిగారు. ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసేంత వరకూ దశలవారీగా ఉద్యమిస్తూనే ఉంటామని ఉద్యోగులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనూ సచివాలయ ఉద్యోగుల నిరసన జోరుగా సాగింది. చిత్తూరు జిల్లాలో 11,500 మంది ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఓటీఎస్‌ మేళాను బహిష్కరించారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు ఇతర ఉద్యోగులతో పనులు చేయించుకోవాల్సి వచ్చింది.


 


అజయ్‌ జైన్‌తో ఉద్యోగ సంఘాల చర్చలు


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్‌జైన్‌తో సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. సీఎం ఇప్పటికే జూన్‌ నుంచి ప్రొబేషన్‌ ప్రకటిస్తామని చెప్పారని, జూన్‌ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని, వెంటనే విధుల్లోకి చేరాలని ఆయన కోరినట్లు తెలిసింది. సంఘాల నేతలు బయటకు వచ్చి ఉద్యోగులకు ఏమి చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఉద్యోగులను సముదాయించలేక ఫోన్లు ఎత్తడం మానేశారు. 

అందరికీ ఒకేసారి ప్రొబేషన్‌ ఎలా ఇస్తారు?


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ ఒకేసారి ప్రొబేషన్‌ ప్రకటిస్తామని సీఎం పేషీ అధికారులు చెప్పారంటూ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు మండిపడ్డారు. రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికే ప్రొబేషన్‌ ప్రకటించాల్సి ఉందని, జాప్యం చేసి అందరికీ ఒకేసారి ప్రకటిస్తామని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులందరూ ఒకేసారి పాస్‌ కారని, అందరూ పాసయ్యే దాకా ఆగి ప్రొబేషన్‌ ప్రకటించాలంటే అసలు ఈ ప్రక్రియే ప్రారంభం కాదని స్పష్టం చేశారు. 

శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు.. రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసనలతో హోరెత్తించారు. వాట్సాప్‌ గ్రూపులలో వెంటనే చేరి విధులకు హాజరు కావాలన్న అధికారుల బెదిరింపులను.. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆందోళనలకు దిగారు. ప్రొబేషన్‌ ప్రకటనపై ప్రభుత్వం జాప్యం చేసినందుకు నిరసనగా విధులు బహిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. కొన్ని చోట్ల ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. వెంటనే ప్రొబేషన్‌ ప్రకటించి, పే స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "హోరెత్తిన పోరు"

Post a Comment