Omicron: ఈ లక్షణాలుంటే పరీక్షలు చేయించండి.. పరీక్షలు పెంచడంతోనే కొవిడ్‌కు అడ్డుకట్ట! రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం



ఈనాడు, దిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతుండటంతో కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఈమేరకు కొవిడ్‌ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలంటూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సంయుక్తంగా లేఖ రాశారు. అనుమానిత రోగులు, వారితో సన్నిహితంగా మెలిగినవారిని త్వరగా గుర్తించి పరీక్షలు జరిపించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అలాంటి వారిని ఏకాంతంలో ఉంచితేనే కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాలిక్యులర్‌ పరీక్షల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, పరీక్షలకు అవసరమయ్యే కిట్లను, ల్యాబొరేటరీ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకు గాను అత్యవసర కొవిడ్‌-19 స్పందన ప్రణాళిక నిధులను వినియోగించాలని తెలిపారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలను విస్తృతస్థాయిలో పెంచాలని సూచించారు. ఇందుకు గానూ 24/7 పనిచేసే ర్యాట్‌ బూత్‌లను ఏర్పాటు చేసి, ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని లేఖలో పేర్కొన్నారు. వీటి నిర్వహణకు తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. లక్షణాలున్నవారు సొంతంగా/ఇళ్లవద్ద పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. తగిన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానాలను కనుగొనాలని తెలిపారు. 

ఈ లక్షణాలుంటే పరీక్షలు చేయించండి..
ఎవరైనా జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి-వాసన కోల్పోవడం, అలసట, డయేరియా వంటి లక్షణాలతో బాధ పడుతుంటే కొవిడ్‌గా అనుమానించి, తప్పక పరీక్షలు జరపాలని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. అలాంటి లక్షణాలున్న వ్యక్తులందరినీ వెంటనే వేరుగా ఉంచాలని, ఇంటివద్ద ఐసొలేషన్‌ మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Omicron: ఈ లక్షణాలుంటే పరీక్షలు చేయించండి.. పరీక్షలు పెంచడంతోనే కొవిడ్‌కు అడ్డుకట్ట! రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం"

Post a Comment