పది పరీక్షల్లో ఏడు పేపర్లు సామాన్య శాస్త్రం మినహా అన్నింటికీ 100 మార్కులకు ప్రశ్నపత్రం



ఈనాడు, అమరావతి: కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు.. పదోతరగతిలో ఏడు పేపర్లతో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకూ ఏడు పేపర్లే ఉంటాయి. సామాన్య శాస్త్రం మినహా మిగతా అన్ని సబ్జెక్టులకూ ఒకే పేపర్‌ ఉంటుంది. మొత్తం 33 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు ఒకటిగా, జీవశాస్త్రం పేపర్లు ఒకటిగా 50 చొప్పున మార్కులకు ఇస్తారు. 100 మార్కుల పరీక్షకు 3.15 గంటల సమయం ఇవ్వనున్నారు. ఇందులో ప్రశ్నపత్రం చదువుకోవడానికి, రాసింది సరి చూసుకోవడానికి 15 నిమిషాలు, పరీక్ష రాయడానికి 3 గంటలు ఉంటుంది. ఏడు పేపర్ల విధానాన్ని ఈ ఒక్క ఏడాదే అమలు చేయనున్నారు. 2023 మార్చి నుంచి 11 పేపర్ల విధానం అమల్లోకి వస్తుంది.


సంస్కరణల తర్వాత..
2020 మార్చిలో నిర్వహించే పరీక్షల కోసం 2019లో కీలక మార్పులు చేశారు. ఇందులో భాగంగా వంద మార్కులకు ప్రశ్నపత్రం తీసుకొచ్చారు. 2019 మార్చి వరకు ఉన్న అంతర్గత మార్కులు, ప్రత్యేక బిట్‌ పేపర్‌ను తొలగించారు. కరోనా కారణంగా 2020, 2021లో జరగాల్సిన పరీక్షలు రద్దయ్యాయి. తాజాగా ప్రశ్నపత్రాలను 11 నుంచి ఏడుకు కుదించారు. పది పరీక్షల్లో తీసుకొచ్చిన మార్పులతో ఇప్పటి వరకూ పరీక్షలు జరగలేదు. కరోనా ఉద్ధృతి లేకపోతే ఈ ఏడాది విద్యార్థులే ఈ మార్పులతో పరీక్షలు రాయనున్నారు. జవాబుపత్రం 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. మొత్తం ఇందులోనే రాయాలి. అదనంగా సమాధాన పత్రాలు ఇస్తే విద్యార్థులు వాటిని వరుసలో జత చేయకపోవడం, కొన్నిసార్లు కొన్ని పత్రాలు కనిపించకపోవడం లాంటి ఘటనల నేపథ్యంలో ఈ మార్పు తీసుకొచ్చారు.

* సామాన్యశాస్త్రంలో రెండు ప్రశ్నపత్రాలు 50 మార్కులకు ఉన్నందున ప్రశ్నలకు ఇచ్చే మార్కులు తగ్గుతాయి. ప్రశ్నల సంఖ్య 33లో ఎలాంటి మార్పు ఉండదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పది పరీక్షల్లో ఏడు పేపర్లు సామాన్య శాస్త్రం మినహా అన్నింటికీ 100 మార్కులకు ప్రశ్నపత్రం"

Post a Comment