ఎముక ఆరోగ్యాన్ని పరిశీలించే చిన్న కంప్యూటర్‌





వాషింగ్టన్‌: ఎముక ఆరోగ్యాన్ని, వాటిపై ఏర్పడే గాయాలను పర్యవేక్షించే సాధనం తయారీ దిశగా అమెరికా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. వీరు అత్యంత పలుచటి వైర్‌లెస్‌ సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఒసెయోసర్ఫేస్‌ ఎలక్ట్రానిక్స్‌గా పేర్కొంటున్నారు. 
ఆస్టియోపొరోసిస్‌ వంటి రుగ్మతల వల్ల ఎముకలు పెళుసుగా మారుతుంటాయి. దీనివల్ల బాధితులు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో గడపాల్సి వస్తోంది. ఒసెయోసర్ఫేస్‌ ఎలక్ట్రానిక్స్‌ వంటి వైర్‌లెస్‌ సాధనాల వల్ల ఎముక ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతోపాటు దాన్ని మెరుగుపరచుకునేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

‘‘ఎముక, కండరాల వ్యవస్థ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం చాలా ముఖ్యం. ఈ సాధనాన్ని అమర్చడం ద్వారా ఎముకపై కంప్యూటర్‌ను ఏర్పాటు చేసినట్లే. ఎముకల వ్యవస్థ పనిచేసే తీరును అర్థం చేసుకోవడానికి పరిశోధనాత్మక సాధనాల అభివృద్ధికీ ఇది ఉపయోగపడుతుంది. వీటి ద్వారా సేకరించే వివరాలను చికిత్సకు వాడొచ్చు’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఫిలిప్‌ గుట్రుఫ్‌ చెప్పారు. ఎముకలు.. కండరాలకు చాలా దగ్గరగా ఉండటంతోపాటు తరచూ కదిలించాల్సి రావడం వల్ల ఈ సాధనాన్ని చాలా పలుచగా ఉంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ సాధనంలో ‘నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌’ అనే విధానాన్ని వాడటం వల్ల దీనికి బ్యాటరీ అవసరం లేదు. ఎముకకు బలంగా అతుక్కోవడానికి కాల్షియం రేణువులతో ప్రత్యేక జిగురును అభివృద్ధి చేశారు. అందువల్ల ఈ సాధనాన్ని తనలోని భాగంగానే ఎముక భావిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫలితంగా ఆ రెండింటి మధ్య శాశ్వత బంధం ఏర్పడుతుందని చెప్పారు. దీర్ఘకాలం పాటు కొలతలు తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎముక ఆరోగ్యాన్ని పరిశీలించే చిన్న కంప్యూటర్‌"

Post a Comment