పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించిన రాష్ట్రాలు ఇవే




న్యూఢిల్లీ: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దీపావళి పండగ సందర్భంగా దేశ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. కేంద్రం బాటలోనే కొన్ని రాష్ట్రాలు అనుసరించాయి. రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పిస్తూ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి


రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 తగ్గిస్తున్నట్లు అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్‌ శర్మ పేర్కొన్నారు. కేంద్రం తగ్గించిన దానితో కలిపి అక్కడ పెట్రోల్‌ రూ.12, డీజిల్‌ రూ.17 మేర తగ్గుతోంది. త్రిపుర రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 తగ్గించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను హరియాణా ప్రభుత్వం తగ్గించింది. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తూ త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటకలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 తగ్గించినట్లు సీఎం తెలిపారు. గోవాలో రూ.7 వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు సీఎం ప్రమోద్‌ కుమార్‌ సావంత్‌ తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్‌ ధర రూ.12, డీజిల్‌ ధర రూ.17 మేర తగ్గనుందని ట్విటర్‌లో పేర్కొన్నారు.


బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.1.30, డీజిల్‌పై రూ.1.90 చొప్పున తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.2 వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డీజిల్‌పై ఎలాంటి ఊరటా ఇవ్వలేదు. మణిపూర్ రాష్ట్రంలో పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్‌ తగ్గించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించింది. గుజరాత్‌ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.7చొప్పున తగ్గించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించిన రాష్ట్రాలు ఇవే"

Post a Comment