కాటికిపోయినా.. కనికరించరా? కొవిడ్‌తో 900 మంది టీచర్లు మృతి



ప్రభుత్వం నుంచి సాయం అందని వైనం 

ఇవ్వాల్సిన పీఎఫ్‌, గ్రాట్యుటీ కూడా లేదు 

చనిపోయి నెలలవుతున్నా స్పందన కరవు

అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రామ బడుల మూత, బడుల విలీనం, ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం విషయంలో ఆగమేఘాలపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవడంలో మాత్రం కనీస మానవత్వం చూపించడం లేదు. వారిని ఆదుకుంటామని ఒక్క హామీ  కూడా ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌తో 900 మంది ఉపాధ్యాయులు మరణించారు. వీరి కుటుంబాలకు న్యాయం చేయాలని ఉపాఽధ్యాయ సంఘాలు పలుమార్లు డి మాండ్‌ చేశాయి. ఆయా  కుటుంబాలూ మొరపెట్టుకున్నాయి. అయినా ప్రభుత్వంలో వీసమెత్తు కదలిక లేదు. కనీసం ఆ చనిపోయిన ఉపాధ్యాయులకు సంబంధించిన పీఎఫ్‌, గ్రాట్యుటీ కూడా చెల్లించలేదు. చనిపోయి ఐదారు నెలలైనా వారికి రావాల్సిన బకాయిలు ఇంతవరకూ ఇవ్వలేదు. కొవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు పాఠశాలలు నడవకుంటే ఆన్‌లైన్‌ తరగతులు బోధించినవాళ్లు.. మొదటి, రెండో వేవ్‌లో  అర్ధాంతరంగా కనుమరుగయ్యారు. వారిమీద ఆధారపడిన కుటుంబాల్లో చీకట్లు కమ్మేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో 40 నుంచి 90 మంది వరకు ఉపాధ్యాయులు కొవిడ్‌తో మరణించారు. ఎక్కడెక్కడ ఎవరెవరు చనిపోయారనే జాబితాలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వీరంతా చనిపోయి కూడా ఐదారునెలలు దాటిపోతోంది. కొందరు చనిపోయి ఏడాది దాటిపోయింది. వారి కుటుంబాల విషయంలో ప్రభుత్వం మానవత్వంతో స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. చనిపోయిన ఉపాధ్యాయులకు పరిహారంగా రూ.5 లక్షలు చెల్లించాలనే డిమాండ్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా చెల్లించిన పాపానపోలేదు. 


ఉత్తర్వులు ఇచ్చి ఏడాదైనా..  

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ చనిపోతే వారి కుటుంబాల్లో అర్హులైనవారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలిస్తారు. కొవిడ్‌తో చనిపోయినా అదే నిబంధన వర్తింపజేయాలంటున్నారు. కరోనాతో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ఊరటనిచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయడంలేదు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వాలంటూ గతంలో పాఠశాల విద్య డైరెక్టర్‌ వీరభద్రుడు కలెక్టర్లకు ఒక మెమో జారీ చేశారు. అది ఇచ్చి కూడా ఏడాది అయిపోతోంది. అయినా ఎక్కడా ఎవరూ దీనిపై పెద్దగా స్పందించింది లేదు. ఒక్క గుంటూరు జిల్లాలో మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. ఇంకా 39 మంది క్యూలో ఉన్నారు. ఖాళీలున్నప్పుడు భర్తీ చేస్తామని విశాఖ జిల్లా కలెక్టర్‌ ఒక ఉపాధ్యాయ సంఘం ఇచ్చిన విజ్ఞాపనపై సమాధానమిచ్చారు. 


రిటైర్డ్‌ టీచర్లకూ కష్టాలు.. 

ఉపాధ్యాయులు తమ జీవితకాలంలో దాచుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌, ఏపీజీఎల్‌ఐ, గ్రాట్యుటీ మొత్తాలను సెటిల్‌ చేయలేదు. కొద్దిమందికి మాత్రమే ఇచ్చారు. పదవీ విరమణ చేసిన దాదాపు 11 వేలమంది ఉపాధ్యాయులకు పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ ప్రయోజనాలు అందలేదు. ప్రావిడెంట్‌ ఫండ్‌ అంటే సగం ఉపాధ్యాయుల సొమ్మే. నెలనెలా కొంత వారు దాచుకుంటే కొంత ప్రభుత్వం కలిపి ఒక నిధిగా ఉండే మొత్తం. అదేవిధంగా ఏపీజీఎల్‌ఐ అంటే సాధారణ బీమా సొమ్ము. ప్రతి ఉపాధ్యాయుడు తమ సొంత డబ్బుతో ఈ బీమా బాండ్లు కొనుగోలు చేయాలి. అవి మెచ్యూరిటీ గడువు ముగిశాక ఎంత మొత్తం ఇవ్వాలో అంతా ప్రభుత్వం చెల్లించాలి. సుమారు ఏడాదికాలంగా ఈ రెండింటినీ పదవీ విరమణ చేసినవారికి ఇవ్వలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారే అంత ఇబ్బందులు పడుతుంటే.. చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాల పరిస్థితి మరీ కష్టంగా ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " కాటికిపోయినా.. కనికరించరా? కొవిడ్‌తో 900 మంది టీచర్లు మృతి"

Post a Comment