*ITR Filing: ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా ఐటీఆర్‌ దాఖలు చేయాలా?

*ITR Filing: ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా ఐటీఆర్‌ దాఖలు చేయాలా? -* 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటీఆర్‌) దాఖలు చేయడం ప్రతి సంవత్సరం చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి అయిన రూ.2.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారంతా ఐటీఆర్‌ దాఖలు చేయడం తప్పనిసరి. *2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలు చేయాల్సిన తేదీని సెప్టెంబరు 30 వరకు పొడిగించారు.*
60 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉండి ఆదాయం రూ.2.5 లక్షలు మించకపోతే వారు ఐటీఆర్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఈ పరిమితి 60-80 ఏళ్ల వయసు వారికి రూ.3 లక్షలుగా.. 80 ఏళ్లు దాటిన వారికి రూ.5 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే. వీరంతా ఐటీఆర్‌ దాఖలు చేయడం తప్పనిసరేం కాదు. అయినప్పటికీ.. ఈ కేటగిరీ వారంతా కూడా ఐటీఆర్‌ దాఖలు చేస్తే కొన్ని ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆర్థిక నిపుణులు. అవేంటో చూద్దాం..!
*అవాంతరాలు లేని బ్యాంకు రుణాలు..*
ఐటీఆర్‌ పత్రాలను అత్యంత కచ్చితమైన, చట్టబద్ధమైన ఆదాయ ధ్రువీకరణగా గుర్తింపు ఉంది. ఏదైనా బ్యాంకులో లేదా ఆర్థికేతర సంస్థలో రుణం కోసం దరఖాస్తు చేసుకునే  సమయంలో ఐటీఆర్‌ను అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి జాప్యం, అవాంతరాలు లేకుండా రుణం పొందడం కోసం ఇది ప్రయోజనకంగా ఉంటుంది.
*వేగవంతమైన వీసా ప్రక్రియ కోసం..*
వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చాలా దేశాలు ఐటీఆర్‌ పత్రాలను అడుగుతుంటాయి. తద్వారా సదరు దేశానికి వెళ్లి.. నివసించేత కనీస ఆర్థికస్తోమత మీకు ఉందా? లేదా? అనే అంశాన్ని ధ్రువీకరిస్తారు. అలాగే ఆర్థిక చట్టాలను మనం ఏమేర పాటించామో కూడా దీని ద్వారా వారికి తెలుస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఆర్థిక నేరాలను అసలు సహించరు.
*పన్ను మినహాయింపులు కోరడానికి..*
సెక్షన్‌ 80సీ సహా ఇతర నిబంధనల కింద మనం చేసే పెట్టుబడులు, విరాళాలకు పన్ను మినహాయింపు కోరడానికి ఐటీఆర్‌ ఉంటే సులువవుతుంది. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ద్వారా ఆర్జించే ఆదాయానికి, డివిడెంట్లకు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆదాయ మూలం వద్దే పన్ను(టీడీఎస్‌) వసూలు చేస్తుంటారు. వీటన్నింటినీ క్లెయిం చేయడానికి కూడా ఐటీఆర్‌ కావాల్సిందే.
*నష్టాలను పూడ్చడానికి..*
క్యాపిటల్‌ గెయిన్స్‌, వ్యాపారం లేదా ఇతర వృత్తుల్లో సంభవించిన నష్టాల నుంచి వచ్చే సంవత్సరం మినహాయింపు కోరడానికి కూడా ఐటీఆర్‌ ఉండాలి. ఆదాయపు పన్ను నియమాల ప్రకారం.. సకాలంలో ఐటీఆర్ దాఖలు చేసిన వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. ఉదాహరణకు మ్యూచువల్‌ ఫండ్లు, లేదా ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలపై పన్నును.. గత సంవత్సరం సంభవించిన నష్టాలను పూడ్చుకోవడానికి మినహాయింపు కోరవచ్చు.
*క్రెడిట్‌ కార్డు పొందడానికి..*
ఉద్యోగులు కాని పక్షంలో స్వయం ఉపాధి లేదా వ్యాపారం చేసుకునే వారు క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఐటీఆర్‌ ఉండాల్సిందే. లేదంటే రిజెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. ఐటీఆర్‌ను అడ్రస్‌ ప్రూఫ్‌గా కూడా వాడుకోవచ్చు.

   

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "*ITR Filing: ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా ఐటీఆర్‌ దాఖలు చేయాలా?"

Post a Comment