జాతీయ విద్యావిధానంతో గొప్ప మార్పు
విజ్ఞానాన్ని రైతుల కోసం వినియోగించాలి
విశ్వభారతి విద్యార్థులకు మోదీ పిలుపు
న్యూఢిల్లీ/విశ్వభారతి/తిరువనంతపురం, ఫిబ్రవరి 19: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం.. దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా తీర్చిదిద్దే దిశగా వేసిన కీలక అడుగు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు ఇది ప్రోత్సాహాన్నిస్తుందని తెలిపారు. శుక్రవారం కోల్‌కతాలోని విశ్వభారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. విశ్వభారతిని రవీంద్రనాథ్ ఠాగూర్ సాధారణ విద్యాబోధన కోసం స్థాపించలేదని, భారతీయ సంస్కృతిని, సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకు నెలకొల్పారని అన్నారు. విశ్వభారతి విద్యార్థులు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. తమ విజ్ఞానాన్ని గ్రామాల్లోని రైతులు, వృత్తిపనుల వారి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌ను కల్పించేందుకు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇక కొవిడ్-19 తరువాత ప్రపంచ అభివృద్ధిలో భారత్-ఆస్ట్రేలియా బంధం కీలకం కానుందని ప్రధాని మోదీ అన్నారు.
ప్రపంచ వ్యాపార ప్రయోజనాలను పెంపొందించే ఆర్థిక విధానాలను రూపొందించడంలో రెండు దేశాలు ముందుంటాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. శుక్రవారం భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా చేపట్టిన సర్క్యులర్ ఎకానమీ (ఐ-ఏసీఈ) హ్యాకథాన్ ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. మరోవైపు సౌర విద్యుత్తుకు భారత్ అత్యంత ప్రాధాన్యమిస్తోందని ప్రధాని తెలిపారు. దీనిని రైతుల వద్దకు చేర్చేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కేరళలో పలు విద్యుత్తు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఎఫ్‌బీపై మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని చర్చ..
సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌తో తమ దేశానికి నెలకొన్న వివాదంపై భారత్, కెనడా ప్రధానులు మోదీ, ట్రూడోతో చర్చించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ తెలిపారు. ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు తమ వార్తాసంస్థలకు డబ్బులు చెల్లించాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం చ ట్టం తేవడం, దానిని వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్.. ఆస్ట్రేలియన్ల ఖాతాలను బ్లాక్ చేయడం తెలిసిందే. దీంతోపాటు ప్రభుత్వ సమాచారాన్ని కూడా పోస్ట్ చేయకుండా ఫేస్‌బుక్ చ ర్యలు తీసుకుంది. అయితే ఇది తమ సార్వభౌమత్వంపై దాడిగా భావించాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా పేర్కొంది
0 Response to "జాతీయ విద్యావిధానంతో గొప్ప మార్పు"
Post a Comment