‘వద్దనుకుంటే వాట్సాప్ వాడొద్దు’ కొత్త గోప్యతా విధానంపై దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

: సామాజిక మాధ్యమం వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త గోప్యతా విధానం విషయంపై దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నూతన విధానాన్ని అంగీకరించడం ఐచ్ఛికమని తెలిపింది. దాన్ని అంగీకరించడం ఇష్టం లేని వారు వాట్సాప్‌ను 





వినియోగించాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘‘అదొక ప్రైవేట్‌ యాప్‌. మీకు ఇష్టం లేకపోతే వాడకండి. అది పూర్తిగా వ్యక్తిగత అంశం. కొత్త విధానాన్ని తప్పనిసరిగా అంగీకరించాల్సిన అవసరం లేదు. వద్దనుకుంటే ఇంకా వేరే యాప్‌ ఏదైనా వినియోగించుకోవచ్చు’’ అని జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవా అభిప్రాయపడ్డారు. వాట్సాప్‌ కొత్త గోప్యతా విధానాన్ని సవాల్‌ చేస్తూ ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. కొత్త విధానం ద్వారా వ్యక్తులు ఆన్‌లైన్‌లో నిర్వహించే కార్యకలాపాలన్నింటినీ వాట్సాప్‌ యాక్సెస్‌ చేయగలదని.. దీనిపై ప్రభుత్వ నియంత్రణేమీ ఉండదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కోర్టు కొన్ని మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘మొబైల్‌ యాప్స్‌ నియమ నిబంధనల్ని పరిశీలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గూగుల్‌ మ్యాప్స్‌ కూడా మీ సమాచారం మొత్తాన్ని స్టోర్‌ చేస్తుంది’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక వాట్సాప్‌ విషయానికి వస్తే ఏ సమాచారం లీక్‌ అవుతుంది అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 25కు వాయిదా వేసింది. ఇక వాట్సాప్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, ముకుల్‌ రోహత్గి వాదించారు. పిటిషనర్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు సరైన ఆధారాలు లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు


కొత్త గోప్యతా విధానంపై భారత్‌ సహా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వాట్సాప్‌ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8 నుంచి అమలు చేయాలనుకున్న గోప్యతా విధానాన్ని మే 15కు వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న ఎవరి ఖాతాను సస్పెండ్‌ చేయమని స్పష్టం చేసింది. జనవరి 4 నుంచి కొత్త షరతులు, నిబంధనలు ఆమోదించాలంటూ వాట్సాప్‌  తన 200 కోట్ల మంది వినియోగదారులకు నోటిఫికేషన్లు పంపడం ప్రారంభించింది. ఇందులో ఫేస్‌బుక్‌తో పంచుకునే సమాచారం విషయంలో చేసిన మార్పులను అంగీకరించాలని, అప్పుడే ఫిబ్రవరి 8 తర్వాత వాట్సాప్‌ను కొనసాగించే అవకాశం ఉంటుందని వినియోగదారులను హెచ్చరించింది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఎక్కడ తమ వ్యక్తిగత సమాచారం బహిర్గతమవుతుందోనన్న భయం వినియోగదారులను వెంటాడింది. చాలా మంది వాట్సాప్‌నకు ప్రత్యామ్నాయ సంభాషణ వేదికలైన సిగ్నల్‌, టెలిగ్రామ్‌పై దృష్టి పెట్టారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "‘వద్దనుకుంటే వాట్సాప్ వాడొద్దు’ కొత్త గోప్యతా విధానంపై దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు"

Post a Comment