నేడే నోటిఫికేషన్‌

ఉదయం 10 గంటలకు తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ప్రకటన 
ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు 
ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి 
శాంతిభద్రతలకు ఒక ఐపీఎస్‌ అధికారి 
ప్రభుత్వ విభాగాలు, కలెక్టర్లు, అధికారులు ఎస్‌ఈసీతోనే పనిచేయాలి 
రాష్ట్ర ఎన్నికల కమిషనరు రమేశ్‌కుమార్‌ స్పష్టీకరణ



ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోని నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు యథావిథిగా నిర్వహించాలన్నదే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయమని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు

ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ శనివారం ఉదయం 10 గంటలకు జారీ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఎవరు అవరోధం కలిగించాలని చూసినా కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఈసీ హెచ్చరించారు. అలాంటి వ్యక్తుల కదలికల్ని నిశితంగా గమనించాలని, సమస్యలు సృష్టించేవారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖను ఆదేశించారు. గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి జరిగే ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. 'ఒక పక్క ఎన్నికలు, మరోపక్క కరోనా టీకాలిచ్చే కార్యక్రమం సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో కరోనా రక్షణ చర్యల్ని అత్యున్నత ప్రమాణాలతో చేపట్టాలి. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేవారందరికీ కరోనా రక్షణ సామగ్రి సమకూర్చాలి. శిక్షణ ఇవ్వాలి' అని తెలిపారు. 
ఎస్‌ఈసీదే తుది నిర్ణయం 
'ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఒకేలాంటి అధికారాలుంటాయని కిషన్‌సింగ్‌ తోమర్‌ వర్సెస్‌ అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక నుంచి ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో సంబంధిత ప్రభుత్వ విభాగాలు, అధికారులు, కలెక్టర్లు ఎస్‌ఈసీ ఆధ్వర్యంలోనే పనిచేయాలి. ఎన్నికలకు సంబంధించి ఎస్‌ఈసీ చెప్పేదే తుది నిర్ణయం. ఎన్నికలకు అవసరమైన రవాణా, ఆర్థిక వనరులు సమకూర్చడం వంటి బాధ్యతలన్నీ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ పర్యవేక్షించాలి' అని ఆయన స్పష్టం చేశారు. 'శుక్రవారం ఉదయం గవర్నర్‌ను కలిసి.. ఇప్పటి వరకు ఎస్‌ఈసీ తీసుకున్న చర్యల్ని తెలియజేశాం. ఎస్‌ఈసీ రాజ్యాంగ విధుల్ని నిర్వహించేందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని గవర్నర్‌ హామీ ఇచ్చారు. ఆయన సహకారానికి, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. 
కోడ్‌ అమలు బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదే 
'ఎన్నికల నిర్వహణకు హైకోర్టు సమ్మతి తెలియజేసిన మరుక్షణం నుంచీ కోడ్‌ అమల్లోకి వచ్చింది. దాని అమలు బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినవారు ఎంత పెద్దవారైనా తీవ్ర పరిణామాలు తప్పవు. శాంతిభద్రతల నిర్వహణ వ్యవహారాల్లో ఒక ఐపీఎస్‌ అధికారి ఎన్నికల సంఘానికి సహకరిస్తారు. ఎన్నికల నామినేషన్ల వ్యవహారంలో ఏమైనా సమస్యలు తలెత్తినా, ఫిర్యాదులు వచ్చినా, అవకతవకలు జరిగినా కమిషన్‌ తక్షణం పరిష్కరిస్తుంది' అని ఎస్‌ఈసీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
ఎన్నికల్ని అడ్డుకుంటే సహించం 
'ఎన్నికలపై కొన్ని వ్యతిరేక స్వరాలు వినిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల్లో పాల్గొనకుండా పౌరుల్ని నిరోధించే హక్కు ఎవరికీ లేదు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకుగానీ, పోటీ చేసే అభ్యర్థుల్ని లక్ష్యంగా చేసుకునిగానీ ఎలాంటి చర్యలకు దిగినా సహించం. అభ్యర్థులకు కమిషన్‌ పూర్తి భద్రత కల్పిస్తుంది. సమస్యలు సృష్టించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసుల్ని ఆదేశిస్తున్నాం' అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయాలని రమేశ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

తొలి దశ ప్రక్రియ ఇలా..

పంచాయతీ ఎన్నికల మొదటి దశ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం జారీ చేయనుంది. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న సర్పంచి, ఉపసర్పంచి ఎన్నికతో ముగుస్తుంది. 
జనవరి 23: నోటిఫికేషన్‌ జారీ 
25: అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ 
27: నామినేషన్ల దాఖలుకు తుది గడువు 
28: నామినేషన్ల పరిశీలన 
29: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన 
30: ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం 
31: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల 
ఫిబ్రవరి 5: పోలింగ్‌ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌) 
పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడే నోటిఫికేషన్‌"

Post a Comment