ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరు ప్రమాణాలు
కోవిడ్ ఆస్పత్రుల తరహాలో తప్పనిసరిగా అమలవ్వాలి
కోవిడ్ నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్
ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలను తప్పనిసరిగా నియమించాలి
వైద్య సేవల్లో పనితీరు ఆధారంగా ఆరోగ్య మిత్రలకు గ్రేడింగ్
104 కాల్ సెంటర్ సేవలను ఎప్పటికప్పుడు సమీక్షించాలి
ఫోన్ చేసిన అర గంటలో బెడ్ కేటాయించాలి
హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందాలి
వైద్యులు, ఏఎన్‌ఎంలు వారికి అందుబాటులో ఉండాలి
ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో ఆరోగ్య మిత్రలను తప్పనిసరిగా వెంటనే నియమించాలి. ఆస్పత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలకు ఇక నుంచి గ్రేడింగ్ అమలు చేయాలి. ఆరోగ్య మిత్రలకు కూడా గ్రేడింగ్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ అంతా 15 రోజుల్లో పూర్తి కావాలి.
కోవిడ్
ఆస్పత్రులు, ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అత్యంత నాణ్యతతో కూడిన
వైద్య సేవలందాలి. దీనిపై వైద్య శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి
సారించాలి. అన్ని ఆస్పత్రుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
– సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రస్తుతం అమలవుతున్న మౌలిక వసతులు, అందుబాటులో
వైద్యులు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, శానిటేషన్, నాణ్యతతో కూడిన ఆహారం,
ఆరోగ్యమిత్రలు (హెల్ప్ డెస్క్).. ఈ ఆరు ప్రమాణాలు ఆరోగ్య శ్రీ
ఆస్పత్రుల్లోనూ కచ్చితంగా అమలు కావాలని ముఖ్యమంత్రి వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాణాలు పాటించని
ఆస్పత్రులకు కొంత సమయం ఇవ్వాలని, అప్పుడు కూడా అవి మారకపోతే ప్యానెల్
నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. నాణ్యమైన వైద్య సేవలను అందించడమే
ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలపై శుక్రవారం ఆయన తన
క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం
ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి
కోవిడ్ నివారణ చర్యలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు
ఆరోగ్య మిత్రలు కీలకం
► రోగులకు వైద్యం అందేలా చూడటంలో ఆరోగ్య మిత్రలు కీలకం. అన్ని ఆస్పత్రుల్లో
ఆరోగ్య మిత్రల (హెల్ప్‌డెస్క్)ను నియమించారా? లేదా? వారెలా పని
చేస్తున్నారు? అన్నది అధికారులు చూడాలి.
► ఒక రోగి ఆస్పత్రికి రాగానే ఆరోగ్యమిత్రలు వారి సమస్య తెలుసుకోవాలి. అక్కడ
వారికి కావాల్సిన వైద్య సదుపాయం లేకపోతే ఏ ఆస్పత్రికి వెళ్లాలో సూచించి,
అక్కడి వైద్యులతో మాట్లాడి.. రోగిని ఆ ఆస్పత్రిలో చేర్పించాలి.
► హోం ఐసొలేషన్‌లో ఉన్న వారితో ఏఎన్‌ఎంలు టచ్‌లో ఉండాలి. వారికి
తప్పనిసరిగా మెడికల్ కిట్ అందించాలి. వైద్యులు కూడా వారితో టచ్‌లో ఉండి
మెరుగైన సేవలందించాలి.
104కు మాక్ కాల్స్ తప్పనిసరి
► తమకు కోవిడ్ సోకిందని ఎవరైనా భావిస్తే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి?
అన్నది అందరికీ తెలియాలి. అందుకు ఇప్పుడు మనకు 104 కాల్ సెంటర్ ఉంది.
► ఈ కాల్ సెంటర్ మరింత సమర్థవంతంగా పని చేయాలి. అధికారులు ఈ కాల్
సెంటర్ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా
మాక్ కాల్స్ చేయాలి. ఫోన్ చేసిన అర గంటలో బెడ్ కేటాయించాలి. హోం
ఐసొలేషన్‌లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందాలి.
15 రోజుల్లో గ్రేడింగ్ పూర్తి కావాలి
► వచ్చే 15 రోజుల్లో ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవల ఆధారంగా
గ్రేడింగ్ జరగాలి. ఆరోగ్యమిత్రల ఏర్పాటు, వారి సేవలను కూడా బేరీజు వేసి
గ్రేడింగ్ ఇవ్వాలి. ఆయా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించకపోతే,
వాటిని ప్యానల్ నుంచి తొలగిస్తామన్న మెసేజ్ వెళ్లాలి.
► ఐవీఆర్‌ఎస్ ద్వారా పొందుతున్న ఫీడ్ బ్యాక్, డేటా మేరకు, ఆ తర్వాత వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది చాలా ముఖ్యం.
► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్
నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్
కుమార్ సింఘాల్, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్,
పలువురు అధికారులు పాల్గొన్నారు
0 Response to "ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరు ప్రమాణాలు"
Post a Comment