స్కూళ్లకు ఆహ్లాదకర రంగులు

మిగిలిన దశల పనుల రుణాలపై దృష్టి సారించాలి

సచివాలయాల ఇంజనీర్లూ పనులను పరిశీలించాలి

వారానికోసారి నివేదిక ఇవ్వాలి: సీఎం .. ‘నాడు-నేడు’ పనులపై సమీక్ష


అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల భవనాలకు వేసే రంగులు ఆహ్లాదకరంగా ఉండాలి.. అక్కడ ఒక పండగ వాతావరణం కనిపించాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. విద్యార్థులకు అన్ని విషయాలపై అవగాహన కలిగేలా స్కూల్‌ గోడలపై చక్కని బొమ్మలు కూడా గీయాలని సూచించారు. వర్షాల సీజన్‌ ముగిసిన తర్వాత ఆ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలని, లేకుంటే ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. సోమవారం ‘మనబడి నాడు-నేడు’ పనులపై సీఎం సమీక్షించారు. పలు రంగుల నమూనాలను అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎంకు చూపించ గా, ఆయన ఈ మేరకు నిర్దేశించారు. నాడు-నేడు పనులు ఇప్పుడు చాలా వేగంగా జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా గంటకు రూ.2 కోట్ల విలువైన పనులు చేస్తున్నారని అధికారులు వివరించారు.


అయితే, దాతలు చేపడుతున్న పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని చెప్పగా, ఆ బాధ్యతల నుంచి దాతలను తప్పించి వెంటనే ఆ పనుల బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. ‘నాడు-నేడు’కు సంబంధించి మిగిలిన రెండు, మూడు దశల పనులు కూడా సకాలంలో చేపట్టేలా అవసరమైన రుణాల సేకరణపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు. ఇప్పుడు స్కూళ్లలో పనులు పేరెంట్స్‌ కమిటీలు చేస్తున్నందున, వాటిల్లో జాప్యం ఉండబోదన్నారు. గ్రామ సచివాలయాల ఇంజనీర్లు నాడు-నేడు పనులను కూడా చూడాలని, ప్రతిరోజూ తప్పనిసరిగా స్కూళ్లను సందర్శించాలని సీఎం ఆదేశించారు. వారానికి ఒక సారి వారు తమ పనులపై నివేదిక ఇవ్వాలన్నారు. స్కూళ్లలో పనులకు సంబంధించి ఎంబీ(మేనేజ్‌మెంట్‌ బుక్‌)లో రికార్డింగ్‌ పవర్స్‌ కూడా సచివాలయ ఇంజనీర్లకే ఇవ్వాలని, ఈ మేరకు ఎస్‌వోపీ రూపొందించాలని సీఎం నిర్దేశించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌, కమిషనర్‌ వి.చినవీరభద్రుడు పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "స్కూళ్లకు ఆహ్లాదకర రంగులు"

Post a Comment