స్కూళ్లకు రండి

బయోమెట్రిక్‌ హాజరు వేయండి

ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు

సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు.. 

వెంటనే హాజరు కావాలని ఆదేశాలు 

కమిషనర్‌ వైఖరిపై టీచర్ల ఆగ్రహం


అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘‘హెడ్మాస్టర్లు, టీచర్లు అందరూ సోమవారం నుంచే పాఠశాలలకు తప్పనిసరిగా హాజరు కావాలి. రోజూ బయోమెట్రిక్‌ హాజరు వెయ్యాలి. అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్‌ వదిలి వెళ్లరాదు. కొవిడ్‌ రక్షణ చర్యలు తీసుకుంటూ హాజరు కావాలి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు పాటించాలి’’ అంటూ పాఠశాల విద్యా కమిషనర్‌ సోమవారం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారితో రాష్ట్రం హడలిపోతుంటే.. ఇవేం ఉత్తర్వులంటూ బెంబేలెత్తిపోతున్నారు. పాఠశాల విద్యాశాఖ మాత్రం రోజుకో ఉత్తర్వు, పూటకో సర్క్యులర్‌ జారీచేస్తూ ప్రభుత్వ పాఠశాలలు తెరిచి ఉంచాల్సిందే.. ఉపాధ్యాయులను రప్పించాల్సిందేనన్న విధంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న ‘నాడు-నేడు’ కార్యక్రమం లాక్‌డౌన్‌ కారణంగా సజావుగా సాగకపోవడంతో అసహనానికి గురవుతున్న విద్యాశాఖ, ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తున్నందున ఆయా టీచర్లు, దూరదర్శన్‌ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పిల్ల ల సందేహాలు నివృత్తి చేసేందుకు మంగళ, బుధ, శుక్రవారాల్లో పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఈ ఆదేశాలను ఫ్యా ప్టో వ్యతిరేకించి, బహిష్కరణ పిలుపు ఇచ్చింది. దీంతో వెనక్కు తగ్గిన విద్యాశాఖ హాజరుకావడం, కాకపోవడాన్ని టీచర్లకు వదిలేసింది. ఇంతలోనే తాజాగా.. పాఠశాల విద్యా కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు సోమవారం ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. చిత్రమేమంటే సోమవారం మధ్యాహ్నం ఆదేశాలిచ్చి, ఆ వెంటనే పాఠశాలలకు హాజరుకావాలని పేర్కొన్నారు. అంతేకాదు, జూన్‌ 11 వరకే వేసవి సెలవులన్న విషయాన్ని గుర్తు చేశారు.


కారణాలు ఇవేనా?!

2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూడైస్‌ డేటాలో వ్యత్యాసాలు ఉన్నందున వాటిని సరిదిద్ది, సమాచారాన్ని 2020-21 కోసం అప్‌లోడ్‌ చేయాల్సి ఉందని ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. ఈ కారణంగానే టీచర్లను స్కూళ్లకు రప్పిస్తున్నట్లు తెలిపారు. పీడీ అకౌంట్‌, రికార్డులు అప్‌డేట్‌ చేయాల్సి ఉందన్నారు. యూడైస్‌ డేటా ఆధారంగానే నీతి ఆయోగ్‌ నిధులు మం జూరు చేస్తుందని పేర్కొన్నారు. 2019-20 యూడైస్‌ డేటాలో స్కూలు కాంప్లెక్స్‌ల సమాచారం, టీచర్ల ట్రైనింగ్‌, సీఎల్‌ఈపీ ఫౌండేషన్‌ ట్రైనింగ్‌లను నమోదు చేయలేదని, లైబ్రరీలు, మరుగుదొడ్లు, కిచెన్‌ షెడ్లు, ల్యాబ్‌ల వివరాలు లేవని ప్రొసీడింగ్స్‌లో వివరించారు. కట్టడిప్రాంతాలు, క్వారంటైన్‌లో ఉన్న వారు, కిడ్నీ, కేన్సర్‌, గుండెజబ్బులతో బాధ పడేవారికి మాత్రం మినహాయింపునిచ్చారు. 

 

అప్పుడు వద్దని.. ఇప్పుడు కావాలని

మార్చి నెలలో కరోనా దృష్ట్యా బయోమెట్రిక్‌ హాజరు వద్దని పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. అయితే, తాజా ఆదేశాల్లో బయోమెట్రిక్‌ హాజరు వేయాల్సిందేనని పేర్కొన్నారు. కరోనా రాష్ట్రంలో అడుగు పెట్టకముందే బయోమెట్రిక్‌ హాజరు వద్దని సూచించిన విద్యాశాఖ ఇప్పుడు వ్యాధి విజృంభించిన తరుణంలో బయోమెట్రిక్‌ యంత్రాలను ఎలా వినియోగిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు చేయాల్సిన పనుల కోసం టీచర్లను రమ్మనడం సరికాదని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎ.ఎ్‌స.రామకృష్ణ, ఫ్యాప్టోతో పాటు యూటీఎఫ్‌, ఎస్‌టీయూ, ఏపీటీఎఫ్‌, టీఎన్‌యూఎస్‌, ఆపస్‌, పీఆర్‌టీయూ, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘా లు... ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. 


ఆగస్టు వరకు ఆగలేరా?

సాధారణంగా నూతన విద్యా సంవత్సరం జూన్‌ 12న ప్రారంభం కావాల్సివుండగా.. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఆగస్టు 3 నుంచి స్కూళ్లు తెరవాలని ప్రకటించింది. కానీ, అప్పటి వరకు ఆగకుండా విద్యాశాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. ‘‘ఒకవైపు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రజా రవాణాను పునరుద్ధరించలేదు. కనీసం ఆటోలు కూడా నడవని పరిస్థితి. ఈ తరుణంలో ఉపాధ్యాయులను ఉన్న ఫళంగా పాఠశాలలకు రావాలని ఆదేశించడం సరికాదు’’ అని సీనియర్‌ ఉపాధ్యాయులు అంటున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "స్కూళ్లకు రండి"

Post a Comment