విద్యా ప్రమాణాలే లక్ష్యం
కొత్త డిగ్రీ కాలేజీలు, కోర్సులకు కఠిన నిబంధనావళి
ఉన్నత విద్యామండలి నియమించిన కమిటీ కసరత్తు
యూజీసీ రూల్స్‌కు అనుగుణంగా మార్పులు
త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నా విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, యూజీ కోర్సులు, పీజీ కోర్సుల ఏర్పాటుకు కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. 2009, 2012 యూజీసీ రూల్స్‌కు అనుగుణంగా.. డిగ్రీ, పీజీ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచే దిశగా కొత్త నిబంధనలు రూపొందించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తాజాగా నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ కొత్త నిబంధనావళిపై కసరత్తు ప్రారంభించింది. ప్రొఫెసర్ డి.సూర్య చంద్రరావు (కృష్ణా వర్సిటీ మాజీ ఇన్‌చార్జి వీసీ), డాక్టర్ పి.అనిల్ కుమార్ (అకడమిక్ ఆఫీసర్, కళాశాల విద్యా కమిషనరేట్), వి.బాబు రామ్‌జీ (లెక్చరర్, టీజేపీఎస్ కాలేజ్-గుంటూరు), టి.వి.శ్రీకృష్ణమూర్తి (జాయింట్ డైరెక్టర్, ఉన్నత విద్యామండలి), డాక్టర్ బి.ఎ్‌స.సెలీనా (అకడమిక్ ఆఫీసర్, ఉన్నత విద్యా మండలి), డాక్టర్ శ్రీరంగం (లెక్చరర్ , లయోలా కాలేజీ, విజయవాడ)లతో కూడిన కమిటీ సోమవారం సమావేశమైంది. నిబంధనలు ఎలా ఉండాలన్న దానిపై చర్చించింది.
అన్నీ పరిశీలించి నివేదిక..
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి కమిటీకి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విద్యా చట్టం-1982కి సంబంధించిన ప్రొవిజన్లు, 1987 ఫిబ్రవరి 5న జారీచేసిన జీవో 29లో పేర్కొన్న రూల్స్, తదనంతరం వాటికి తీసుకువచ్చిన సవరణలను పరిశీలించాలని, గత కమిటీ రూపొందించిన డ్రాఫ్టు రూల్స్, డిగ్రీ కాలేజీల అంశానికి సంబంధించి గతంలో ఇతర కమిటీలు రూపొందించిన రూల్స్‌ను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు, వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం కాలేజీలు, కోర్సుల ఏర్పాటుకు కూడా రూల్స్‌ను రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో మొత్తం 1152 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిలో దాదాపు 700 కాలేజీలు దీర్ఘకాలంగా అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. రాష్ట్రంలో 30ఏళ్ల నాటి రూల్సే స్వల్ప సవరణలతో అమలవుతున్నాయి. మన రూల్స్‌కు యూజీసీ రూల్స్‌కు ఎన్నో తేడాలున్నాయి. భూమి, భవనాలు, వసతి, కార్పస్ ఫండ్ తదితర అంశాల్లో రాష్ట్రంలో సరళత ఉంది. ఏజీ ఆడిట్ కూడా నిబంధనల విషయంలో చూసీచూడనట్లు ఉంటుందోన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఫలితంగా విద్యాప్రమాణాలు పడిపోతున్నాయన్నది విశ్లేషణ. ఈ నేపథ్యంలో విద్యా ప్రమాణాలను కాపాడేందుకు చర్యలు అనివార్యమని, ఇందుకోసం యూజీసీ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. కమిటీ నివేదిక అందిన తర్వాత కొత్త డిగ్రీ, కోర్సుల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉన్నత విద్యా మండలి యోచిస్తున్నట్లు సమాచారం.
60 రోజుల్లో ‘నాడు-నేడు’ తొలిదశ పూర్తి
రాష్ట్రంలోని 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ తొలిదశ పనులు జూలై నెలాఖరుకు పూర్తిచేయాలని మంత్రి సురేశ్ అధికారులను ఆదేశించారు. ఎక్కడెక్కడ ఏయే సమస్యలు ఉన్నాయో గుర్తించి పనుల వేగం పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ వి.చినవీరభద్రుడు పాల్గొన్నారు
0 Response to "విద్యా ప్రమాణాలే లక్ష్యం"
Post a Comment