భారీగా టీచర్ పోస్టులు రద్దు?
ఇంగ్లీషు మీడియం పెడతామంటూనే టీచర్ల తగ్గింపు
ప్రైమరీ స్కూల్లో రోల్ 150 దాటితేనే హెడ్మాస్టర్ పోస్టు
విద్యార్థులు ఎందరున్నా కనీసం ఇద్దరు టీచర్లు
ఇవీ పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రతిపాదనలు
తీవ్రంగా నష్టపోనున్న ప్రభుత్వ పాఠశాలలు
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదు అంటున్న ప్రభుత్వం... రేషనలైజేషన్ పేరిట భారీగా టీచర్ పోస్టులను రద్దు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఒకవైపు ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే... మరోవైపు టీచర్ల సంఖ్యను తగ్గించేందుకు స్కెచ్ గీచింది. ఇంగ్లీషుతోపాటు తప్పనిసరిగా మాతృభాష నేర్పుతామని ప్రకటించిన ప్రభుత్వం...
ఇకపై ఏ ఒక్క ప్రాథమిక పాఠశాలలోనూ సింగిల్ టీచర్ ఉండరు. విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నా సరే కనీసం ఇద్దరు టీచర్లు ఉంటారు. రాష్ట్రంలో ఒక్క టీచర్ కూడా లేని 1963 పాఠశాలలు, ఒకే టీచర్ ఉన్న 9410 పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం ఆయా స్కూళ్లన్నింటిలోనూ ఇద్దరు టీచర్లను నియమించాల్సి ఉంటుంది.
ప్రాథమిక స్కూళ్లలో 1:30 నిష్పత్తిలో 60 మంది విద్యార్థుల వరకు ఇద్దరు టీచర్లను మాత్రమే కేటాయిస్తామన్నది ఒక ప్రతిపాదన. కానీ 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉంది.
గ్రామానికి ఒక పెద్ద పాఠశాల ఉండాలని, అందులో ఐదుగురు టీచర్లు ఉండాలన్న ఉద్దేశంతో గతంలో 80 మంది రోల్ ఉన్న పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలగా ప్రకటించి ఐదుగురు టీచర్లను ఇచ్చారు. కానీ ప్రస్తుత ప్రతిపాదనల్లో 120 మంది విద్యార్థులు ఉంటేనే ఐదుగురు టీచర్లను కేటాయిస్తాన్నారు. అంటే ప్రస్తుతం ఐదుగురు టీచర్లు ఉన్న పాఠశాలల నుంచి కూడా పోస్టులను తగ్గిస్తారన్న మాట.
80 మందికిపైగా ఉన్న ప్రాథమిక స్కూళ్లలో ప్రస్తుతం 5 పోస్టులు ఉండగా తాజా ప్రతిపాదనలు ప్రకారం మూడు పోస్టులే ఉంటాయి. ప్రస్తుతం 130 రోల్ దాటితే ప్రాథమిక స్కూళ్లలో హెడ్మాస్టర్ పోస్టు ఉంది. ఇకపై 150 కంటే ఎక్కువ ఉంటేనే పోస్టు మంజూరు చేస్తారు.
ఉన్నత పాఠశాలల్లో జీ.వో.నం.29 ప్రకారం మీడియం వారీగా పోస్టులు మంజూరు చేయగా, తాజా ప్రతిపాదనల్లో మొత్తం విద్యార్థులను ఒకే మీడియంగా పరిగణనలోనికి తీసుకుని పోస్టులు మంజూరు చేస్తారట.
ఆంగ్ల మాధ్యమంలో 500 విద్యార్థులు దాటిన చోట రెండవ హెచ్‌ఎం పోస్టు ఉండగా, ఇప్పుడు ఒకే హెచ్‌ఎం పోస్టును ప్రతిపాదించారు.
సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం, కొన్ని ప్రాంతాల్లో మైనర్ మీడియంలో విద్యార్థులు ఉన్నారు. గతంలో ఇంగ్లీషుతో పాటు మైనారిటీ మీడియానికీ ప్రత్యేకంగా టీచర్లను కేటాయించారు. ప్రస్తుత ప్రతిపాదనల్లో అవి కూడా తొలగించారు.
ప్రభుత్వ స్కూళ్లలో గతేడాది 1.4 లక్షలకుపైగా ఎన్‌రోల్‌మెంట్ పెరిగింది. మరోవైపు సీఎం ప్రత్యేకంగా అమ్మఒడి, నాడు-నేడు, విద్యా దీవెన వంటి పథకాలను ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడు రేషనలైజేషన్‌తో ఇప్పటిదాకా ఉన్న పోస్టులను తొలగించాలని ప్రతిపాదించారు.
పోస్టులు తగ్గించొద్దు: ఉపాధ్యాయ సంఘాలు
రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక స్కూళ్లలో టీచర్ పోస్టులను తగ్గించడం సరికాదని, విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పుడు పోస్టులను తగ్గించడం వల్ల ప్రమాణాలు పడిపోతాయని టీచర్ల సంఘాలు అంటున్నాయి
0 Response to "భారీగా టీచర్ పోస్టులు రద్దు?"
Post a Comment