ఈపీఎఫ్ కొత్త నిబంధన... ప్రయోజనమిదే
హైదరాబాద్ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) మరో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణం. ఇప్పటికే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి ఉద్యోగులు 75 % లేదా మూడు నెలల బేసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది పాండమిక్ అడ్వాన్స్ రూపంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తూ నిబంధనల్ని మార్చ్చారు.
దీంతోపాటు 100 లోపు ఉద్యోగులున్న సంస్థల్లో రూ. 15 వేల లోపు వేతనం ఉన్న ఈపీఎఫ్ ఖాతాదారులకుఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇవే కాకుండా కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఈపీఎఫ్ విషయంలో మరి కొన్ని నిర్ణయాలను తీసుకుంది కేంద్రం. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా 12 శాతం చొప్పున ఉన్న ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ను 10 శాతానికి తగ్గించింది.
ఈపీఎఫ్ ఖాతాలో ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ను 10 శాతానికి తగ్గించడంతో ఆ మేరకు నిబంధనల్ని మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ. ఇది మూడు నెలలకే వర్తిస్తుంది. అంటే మే, జూన్, జూలై నెలలకు ఈపీఎఫ్ ఖాతాలో మొత్తం 24 శాతం కాకుండా కేవలం 20 శాతం చొప్పున జమ అవుతుంది. దీని వల్ల సంఘటిత రంగంలో పనిచేస్తున్న 4.3 కోట్ల మంది ఉద్యోగులకు మే, జూన్, జూలై నెలల టేక్ హోమ్ సాలరీ పెరుగుతుంది. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది.
ఈ నిబంధనపై ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగులు కావాలంటే తమ వాటాను 10 శాతం నుంచి పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. యజమానులు మాత్రం 10 శాతం జమ చేస్తే చాలని తెలిపింది. ఈపీఎఫ్ స్కీమ్-1952 ప్రకారం ఉద్యోగులు 10 శాతం లేదా అంతకన్నా ఎక్కువ తమ ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయొచ్చని, యజమాని మాత్రం 10 శాతం జమ చేయాలని వివరించింది. కాబట్టి ఉద్యోగులు కోరుకుంటే గతంలోలాగే 12 శాతం చొప్పున ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేసుకోవచ్చు. ఈ కొత్త నిబంధన రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ.15 వేల లోపు వేతనం పొందుతూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నవారికి వర్తించదు.
ఎందుకంటే వారికి కేంద్ర ప్రభుత్వమే 24 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తుంది కాబట్టి. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మరో మూడు నెలల్లో రూ. 6,750 కోట్ల నగదు లభ్యత ఏర్పడుతుందని అంచనా. ప్రభుత్వోద్యోగులకు మాత్రం ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 12 శాతం ఈపీఎఫ్ఓ అకౌంట్‌లో ఎప్పటి మాదిరిగానే జమ అవుతుంటుంది

0 Response to "ఈపీఎఫ్ కొత్త నిబంధన... ప్రయోజనమిదే"
Post a Comment