స్కూళ్లు తెరిచినా పంపం! మంబయిలో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన
ముంబయి: లాక్‌డౌన్ తర్వాత తిరిగి పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ తమ పిల్లలను దాదాపు నెల వరకు స్కూళ్లకు పంపేది లేదని ముంబయిలోని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ‘పేరెంట్ సర్కిల్’ అనే ఆన్‌లైన్ పేరెంటింగ్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 12వేల మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారిలో 54 శాతం మంది ముంబయి నగరానికి చెందినవారే. వీరిలో దాదాపు 24 శాతం మంది లాక్‌డౌన్ ముగిసిన తర్వాత దాదాపు నెల రోజుల వరకు తమ పిల్లలను స్కూలు పంపేందుకు ఇష్టపడటం లేదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలు జూన్-జులై నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ, తమ పిల్లలను స్కూలుకు పంపే విషయమై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులలో పిల్లలను స్కూళ్లకు పంపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోలేమని, ప్రభుత్వాలే ఈ సమస్యను పరిష్కరించేందుకు వ్యూహంతో మందుకు రావాలని సర్వేలో పాల్గొన్న ఓ విద్యార్థి తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఆరు నెలల వరకు తమ పిల్లలను బర్త్‌డే పార్టీలకు, ఆరు బయట ఆడుకునేందుకు, స్నేహితులను కలుసుకునేందుకు పంపబోమని 43 శాతం మంది తల్లిదండ్రులు వెల్లడించారు. వాటితో పాటు సినిమాలకు, మాల్స్‌కు ఏడాదిపాటు వెళ్లబోమని తెలిపారు. పాఠశాలలో తమ పిల్లలు క్షేమంగా ఉంటారనే హామీ లభిస్తేనే వారిని స్కూలు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మరొక విద్యార్థి తండ్రి అభిప్రాయపడ్డారు.
మరోవైపు పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చించేందుకు మహారాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే పలుమార్లు సమావేశమయింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా స్కూళ్లు తిరిగి ప్రారంభించడంపై తర్వలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక వేళ ఆలస్యంగా స్కూళ్లు ప్రారంభించాల్సి వస్తే సిలబస్ తగ్గించడం, ఆన్‌లైన్ తరగతులను నిర్వహించడంపై దృష్టి సారిస్తామని సదరు అధికారి తెలిపారు
0 Response to " స్కూళ్లు తెరిచినా పంపం! మంబయిలో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన"
Post a Comment