పరిశోధనలు జరుగుతున్నాయి.. వ్యాక్సిన్ వచ్చి తీరుతుంది
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు పాటించడమే కరోనా వైరస్ నివారణకు సరైన మార్గమని ‘ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ’ ఛైర్మన్, ప్రముఖ వైద్య నిపుణులు జి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఈటీవీతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై వివరించారు.
‘‘కరోనా వైరస్ గురించి ప్రజల్లో చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శాస్త్రీయ సమాచారం వారికి అందటం చాలా ముఖ్యం. ప్రపంచంలో ఇప్పటి వరకు దాదాపు 6లక్షల మంది ఈ వైరస్ బారినపడ్డారు. వారిలో 5శాతం వరకు మరణాలు ఉన్నాయి. కానీ ఇండియాలో పరిస్థితి అందుకు భిన్నం. వుహాన్‌లో మొదలైన ఈ వైరస్ నాలుగు వారాల తర్వాత భారత్‌లోకి వచ్చింది. మిగతా దేశాలతో పోలిస్తే ఇప్పటివరకు మనదేశంలో మరణాలరేటు 2 శాతంగా ఉంది. స్పెయిన్, ఇరాన్‌లో 10శాతం వరకు ఉంది. ఇందుకు చాలా కారణాలున్నాయి. కరోనా వైరస్‌కు కొమ్ముల వంటి భాగాలుంటాయి. వీటి ద్వారానే మన శరీరంలో ఉన్న కణాల్లోకి అవి చేరుతాయి. మన దేశంలోకి ప్రవేశించిన వైరస్‌లో సింగిల్ మ్యుటేషన్ మాత్రమే జరిగింది. దీని వల్లే అది శరీరంలోని కణాలకు సరిగా అతుక్కోలేకపోతోంది. అదే స్పెయిన్, ఇటలీలో వైరస్‌లో మూడు మ్యుటేషన్‌లు చోటుచేసుకున్నాయి. దీని వల్ల కణాలకు సులువుగా అతుక్కుంటుంది. అందుకే అక్కడ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆ దేశాల్లో వయసు పైబడిన వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇటీలీ, స్పెయిన్‌లో 70 నుంచి 80 ఏళ్ల వయసు మధ్యవారు ఎక్కువగా మరణించారు. వైరస్ సోకిన వారిలో డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, పొగతాగడం వంటి సమస్యలు ఉంటే మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అంశంలో మన దేశం చాలా మేలనే చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. పోలీసు శాఖ కూడా ప్రజలను ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు. ఆరోగ్య రంగంలో మౌలికవసతుల కొరత, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా.. పటిష్ఠ చర్యలే తీసుకుంటున్నారు’’ అని నాగేశ్వర్ రెడ్డి అన్నారు.
పరిశోధనలు జరుగుతున్నాయి...
కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ‘‘ప్రాథమిక స్థాయి వ్యాక్సిన్లు ఇప్పటికే తయారయ్యాయి. ఆర్‌ఎన్‌ఏతో తయారు చేసే వ్యాక్సిన్ కావడం వల్ల ఎక్కువ సమయం పడుతోంది. దీన్ని వెంటనే విచ్చల విడిగా ప్రజల్లో ఉపయోగించలేం. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నిర్ధారించుకుని.. నయం చేయగలిగే సామర్థ్యాన్ని బట్టి వినియోగంలోకి తెస్తాం. సాధారణంగా వ్యాక్సిన్ నాలుగు దశలు దాటిన తర్వాత వినియోగంలోకి వస్తుంది. మొదటి దశ తయారు చేయడం. రెండో దశ జంతువులపై పరీక్షించడం. మూడో దశ ఎంపిక చేసిన కొంతమందిపై ప్రయోగించడం. నాలుగో దశలో ఎక్కువ మందిపై ప్రయోగించి ఆమోదం తెలపడం. ఈ దశలన్నీ దాటడానికి 12 నుంచి 16 నెలల సమయం పడుతుంది. వచ్చే ఏడాది ఆఖరునాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే నాలుగైదు కంపెనీలు దీంట్లో నిమగ్నమయ్యాయి. కచ్చితంగా వ్యాక్సిన్ వచ్చి తీరుతుంది’’ అని వివరించారు.
ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే..
‘‘ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే కరోనా వైరస్ చనిపోతుందనేది ఒక ఆలోచన మాత్రమే. దీనిపై శాస్త్రీయ అవగాహన చాలా తక్కువ ఉంది. నిన్న రాత్రి యూఎస్ ఎంఐటీ నుంచి ఒక పరిశోధనా పత్రం వచ్చింది. వాళ్లు చెప్పిందేంటంటే ఈ వైరస్ 32 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే వైరస్ వెంటనే చనిపోతుంది. సాధారణంగా మనకు వ్యాపించేది గదుల్లోనే. ఇళ్లల్లో 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉండదు. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రత ఆ స్థాయికి చేరుకుంటుంది. లాక్‌డౌన్ మొదలైన తర్వాత వైరస్ వ్యాప్తికి కొంచెం అడ్డుకట్ట పడింది. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పటి వరకు మన దేశంలో దాదాపు వెయ్యిమందికి కరోనా సోకింది. ప్రజలు ఇంకా రెండు వారాలపాటు జాగ్రత్తగా ఉండాలి. దీనిగురించి ఎక్కువగా భయపడొద్దు. 80 శాతం మందిలో చాలా స్వల్ప స్థాయిలో జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వచ్చి తగ్గిపోతాయి. 10శాతం మందిలో మాత్రమే జ్వరం కాస్త ఎక్కువగా ఉంటుంది. కేవలం ఐదు శాతం మంది మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురవుతారు. వారికి వెంటిలేటర్స్ అవసరమవుతాయి.’’ అని వ్యాధి లక్షణాలను నాగేశ్వర్ రెడ్డి వివరించారు.
ఆ మందు వారికి మాత్రమే..
‘‘ఇప్పటి వరకైతే కరోనా చికిత్సకు ప్రత్యేకంగా మందులేమీ లేవు. చైనాలో కొన్ని డ్రగ్స్ ట్రై చేశారు. జపాన్‌లో తయారైన ఎవిగాన్ కొంతవరకు ప్రభావవంతంగా పనిచేసిందని చైనా వైద్యులు చెప్పారు. ఫ్రాన్స్‌లో ఒక చిన్న అధ్యయనం జరిగింది. మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌తో పాటు అజిత్రోమైసిన్ అనే యాంటిబయాటిక్ కలిపి ఇస్తే తొందరగా కోలుకున్నారని తేలింది. దీనిపై ఇంకా లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. నివేదిక రావడానికి కనీసం ఒక నెల పడుతుంది. వచ్చిన తర్వాత కచ్చితంగా ఎంత మోతాదు వాడాలనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి ప్రజలకు దీని వాడకంపై ఎలాంటి సూచనలు చేయడం లేదు. వైద్య సిబ్బందికి, వైరస్ సోకిన వారిని కలిసిన వారికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ రెండు టాబ్లెట్లు వారానికి రెండుసార్లు జింక్‌తో పాటు కలిపి ఇస్తున్నారు. దీని వల్ల వైరస్ సోకే అవకాశాలు తక్కువ ఉన్నట్లు రెండు, మూడు అధ్యయనాలు చెబుతున్నాయి. ఐసీఎంఆర్ కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఈ మేరకు సిఫార్సు చేస్తున్నాయి. కచ్చితమైన మందు మాత్రం ప్రస్తుతానికి లేదు. సాధారణ ప్రజలు వీటిని తీసుకోవద్దు. వైద్య విభాగంలో పనిచేసేవారు, వైరస్ సోకిన వారిని కలిసిన వారు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. మనిషికి మనిషికీ మధ్య కనీసం మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ అని వ్యవహరించడం సరికాదు. ఫిజికల్ డిస్టెన్స్ అనడమే మంచిది’’ అని నాగేశ్వర్ రెడ్డి తెలియజేశారు
0 Response to "పరిశోధనలు జరుగుతున్నాయి.. వ్యాక్సిన్ వచ్చి తీరుతుంది"
Post a Comment