ఈపీఎఫ్ వడ్డీరేటు యథాతథం..?
దిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) వార్షిక నిల్వలపై వడ్డీరేటు యథాతథంగానే ఉంచే అవకాశం కనిపిస్తోంది. గతేడాదిలానే ఈ సారి కూడా 8.65 శాతం చెల్లించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈపీఎఫ్‌వో నిర్ణయాక మండలి సెంట్రల్ బోర్డు ట్రస్టీ మార్చి 5న భేటీ కానుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిల్వలపై వడ్డీరేటును యథాతథంగా ఉంచాలని బోర్డు సభ్యులు యోచిస్తున్నట్లు సమాచారం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిల్వలపై చెల్లించిన 8.65 శాతం మొత్తాన్నే కొనసాగించాలని కార్మిక శాఖ సైతం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈపీఎఫ్ వడ్డీరేటు 8.5కకు తగ్గిస్తారని ఊహాగానాల నేపథ్యంలో వడ్డీరేటును అలానే కొనసాగిస్తారన్న సమాచారం కార్మికుల ఊరట కల్పించేదే! తుది నిర్ణయం మార్చి 5న జరిగే భేటీలో వెలువడనుంది
సామాజిక భద్రతతో పాటు పదవీ విరమణ, భవిష్యత్తు అవసరాలకు ఈపీఎఫ్‌వో మంచి పెట్టుబడి సాధనం. ఏటా బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ప్రతినెలా వడ్డీ లెక్కించి జమచేయడంతో మంచి ప్రతిఫలం వస్తుంది. 1989 నుంచి 2000 వరకు వరకు ఏటా 12 శాతం ప్రతిఫలం లభించింది. ఆ తరువాతి నుంచి తగ్గుతూ వస్తోంది. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే పింఛనుదారులు, ఖాతాదారులు దాదాపు 20 కోట్లమంది వరకు ఉన్నారు. యజమాని, ఉద్యోగి చందాలను జమ చేసి ఆ మొత్తంపై వచ్చే ఆదాయం మేరకు వడ్డీ రేట్లు ఈపీఎఫ్‌వో నిర్ణయిస్తుంది. ఇది ఏటా సెప్టెంబరు నెలాఖరు నాటికి ప్రకటించి, కార్మిక, ఆర్థికశాఖల ఆమోదం తీసుకుని మార్చి 31 నాటికి నిల్వలపై వడ్డీ జమ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నాలుగేళ్లుగా జాప్యం జరుగుతోంది. వడ్డీరేటు ముందుగానే నిర్ణయించినప్పటికీ కార్మికశాఖ ఆమోదం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఆ తరువాత ఆర్థికశాఖ వద్ద జాప్యం జరుగుతోంది
0 Response to "ఈపీఎఫ్ వడ్డీరేటు యథాతథం..?"
Post a Comment