ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట ఎస్‌పీడీ చినవీరభద్రుడు
అధికారులతో చర్చిస్తున్న ఎస్‌పీడీ చినవీరభద్రుడు
సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడు వెల్లడించారు. సి.ఎస్.పురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆదివారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వం నాడు-నేడు కింద పాఠశాలలకు అన్నిరకాల మౌలికవసుతల కల్పనకు కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఈ పథకం కింద తొలివిడత ఈ ఏడాది 15,715 పాఠశాలల్లో తొమ్మిది రకాల వసతులను కల్పించడం జరుగుతుందని తెలిపారు. దీనికి ప్రభుత్వం రూ.3,600 కోట్లు నిధులను విడుదల చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే 10,448 చోట్ల పనులు ప్రారంభమైనట్లు వివరించారు. ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ బి.ప్రతాపరెడ్డి మాట్లాడుతూ వివిధ దేశాల్లో పాఠ్యపుస్తకాలను పరిశీలించి సీబీఎస్‌ఈకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా వచ్చే విద్యాసంత్సరం ఒకటి నుంచి ఆరు తరగతుల వరకు నూతన పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలల్లో బ్రిడ్జి కోర్సును ప్రారంబించనున్నట్లు వివరించారు. సమగ్ర శిక్ష సంయుక్త కార్యదర్శి పి.విజయలక్ష్మి మాట్లాడుతూ కేజీబీవీల్లో విద్యార్థినులకు ఆహార పట్టికను మార్చి మెనూ ఛార్జీలను పెంచినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఓపెన్ స్కూల్ డైరెక్టర్ పి.దేవానందరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సహాయక జీసీడీవో పి.విఠల్‌కుమారి, సీఎంవో ఆర్.కొండారెడ్డి, జీసీడీవో వసంతకుమారి, సి.ఎస్.పురం, వెలిగండ్ల ఎంఈవోలు జె.ప్రసాదరావు, డి.ప్రసాద్, కేజీబీవీ ఎస్‌వో కె.సజన, ఉపాధ్యాయినులు, సీఆర్పీలు పాల్గొన్నారు.
కంప్యూటర్ శిక్షణ పరిశీలన: కేజీబీవీలో కోడ్‌తంత్ర కంపెనీ అందిస్తున్న పైతాన్ కంప్యూటర్ శిక్షణను సమగ్ర శిక్ష ఎస్‌పీడీ వి.చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు పి.దేవానందరెడ్డి, పి.ప్రతాపరెడ్డిలు పరిశీలించారు. అక్కడ విద్యార్థినుల మెనూను పరిశీలించి, కంప్యూటర్ శిక్షణను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కోడ్‌తంత్ర కంపెనీ సీఈవో సీవీఎస్ రమణ, సమగ్ర శిక్ష అధికారులు పాల్గొన్నారు
0 Response to " ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట ఎస్‌పీడీ చినవీరభద్రుడు"
Post a Comment